Advertisement
Advertisement
Abn logo
Advertisement

ప్రభుత్వ నిర్లక్ష్యమే ఇంటిదొంగలకు వరమైంది!

తెలుగు అకాడెమీలో బయటపడ్డ ఫిక్‌్సడ్ డిపాజిట్ల (ఎఫ్‌డి) కుంభకోణం మొదట ముప్ఫై కోట్లు అన్నారు. ఇప్పుడది వేరే శాఖలకు కూడా పాకి పెద్దమొత్తంలోనే గోల్మాల్ జరిగిందని తేలింది. అది దాదాపు రెండు వందల కోట్ల వరకు ఉండవచ్చుననే అంచనాలకు వస్తున్నారు. ఈ వ్యవహారంలో తెలుగు అకాడమీతో పాటు, హౌసింగ్ కార్పొరేషన్, ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి, ఆంధ్రప్రదేశ్ మైనారిటీ కార్పొరేషన్, ఆంధ్రప్రదేశ్ నెడ్‌కాప్ కాకుండా ఇంకా కొన్ని సంస్థలకు కూడా పాత్ర ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. 


అసలు ఈ డబ్బు ప్రభుత్వ ట్రెజరీ కార్యాలయాలలో పర్సనల్ డిపాజిట్ (పిడి) ఖాతాల్లో ఉండవలసింది, కానీ బ్యాంకులకు ఎలా తరలింది? అధికారులు దాన్ని నిర్దేశించిన కార్యక్రమాలకు వినియోగించకుండా బ్యాంకులలో ఫిక్‌్సడ్ డిపాజిట్లుగా ఎందుకు దాచారు? ఏళ్ల తరబడి ఆ డబ్బు బ్యాంకులలో డిపాజిట్ లాగా ఎందుకు మూలుగుతోంది? ఆ దాచిన వివరాలు సరిగా రికార్డులలో పొందుపరిచారా? ఎవరో కొందరు ప్రభుత్వ అధికారుల స్వార్థం కారణంగా రాష్ట్ర కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచి, పిడి అకౌంట్లకు, అక్కడినుంచి బ్యాంకులకు తరలి ఇప్పుడు అక్రమార్కుల చేతిలో పడింది. ఇదంతా ప్రజాధనం. దీని దుర్వినియోగానికి బాధ్యత ఎవరిది? రాష్ట్ర ప్రభుత్వాల ఆదాయమంతా రాష్ట్ర కన్సాలిడేటెడ్ ఫండుకు జమ చేయాలని, ప్రభుత్వ ఖర్చులన్నీ రాజ్యాంగ నిబంధనలకు లోబడి చేసిన చట్టాలకు అనుగుణంగా మాత్రమే జరగాలని రాజ్యాంగంలోని ఆర్టికల్ 266 స్పష్టంగా చెబుతోంది. అయితే ఇప్పుడు ఇది నామమాత్రంగానే జరుగుతోంది. 


ప్రభుత్వం అనేక పద్దుల కింద, వివిధ కార్యక్రమాలు, పథకాల అమలు కోసం నిధులను వెచ్చిస్తుంది. వాటికి పెట్టే ఖర్చు, జమలను ప్రత్యేకంగా పర్యవేక్షించడం కోసం ప్రత్యేక పర్సనల్ డిపాజిట్ ఖాతాలు ఉంటే తేలిక అనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం ట్రెజరీలలో పి.డి. ఖాతాలను తెరవడానికి నిబంధనలు రూపొందించింది. ఈ పిడి ఖాతాలు మన బ్యాంకు ఖాతాల లాగానే ప్రభుత్వ ట్రెజరీలలో ఉంటాయి. ఉదాహరణకు ప్రభుత్వం ఒక వంద కోట్లతో ఒక ప్రాజెక్టు నిర్మిద్దాం అనుకున్నప్పుడు, ట్రెజరీలో ఒక ప్రత్యేక పిడి ఖాతా తెరిచి ఆ వంద కోట్లను రాష్ట్ర కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచి దానికి బదిలీ చేస్తుంది. ఈ ఖాతా నుంచే ప్రాజెక్టుకు ఖర్చు పెడుతుంది. ఇదీ ప్రభుత్వ ఉద్దేశ్యం. అయితే ప్రభుత్వ పథకాల వంటి వాటి అమలు కోసం తెరిచే పిడి ఖాతాలను ప్రతి ఆర్థిక సంవత్సరం చివర్లో మూసేసి దాంట్లో మిగిలిన నిధులను మళ్ళీ కన్సాలిడేటెడ్ ఫండుకు జమ చేయాలని, ఒకవేళ తదుపరి ఆర్థిక సంవత్సరంలో మళ్ళీ ఆ పథకం కోసం నిధులు అవసరమైతే మళ్ళీ పిడి ఖాతాను ప్రారంభించుకోవాలని ఆంధ్రప్రదేశ్ ఫైనాన్షియల్ కోడ్‌లోని ఆర్టికల్ 271 స్పష్టంచేస్తోంది.


ఏదైనా ప్రభుత్వ శాఖ ఒక పిడి ఖాతా తెరవాలన్నా, లేదా ప్రభుత్వ నిధులను ఏదైనా బ్యాంకులో డిపాజిట్‌గా ఉంచాలన్నా, ముందుగా ప్రభుత్వ ఆడిటర్ అయిన ఎకౌంటెంట్ జనరల్‌ను సంప్రదించడం, ముందస్తు అనుమతి తీసుకోవడం మొదట్లో ఒక ఆనవాయితీగా ఉండేది. దీని వల్ల అకౌంటెంట్ జనరల్ వద్ద ఈ అకౌంట్ల వివరాలు ఉండేవి. అకౌంటెంట్ జనరల్‌కు వాటి నిర్వహణ మీద అదుపు ఉండేది. అయితే రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక విభాగం జూన్ 02, 2005న జారీ చేసిన జీవో ఎంఎస్‌ నం.140లో ఈ పిడి ఖాతాలను తెరిచిన తరువాత అకౌంటెంట్ జనరల్‌కు నోటిఫై చేయవచ్చని పేర్కొందది. దాంతో అకౌంటెంట్ జనరల్ అనుమతితో మాత్రమే పిడి ఖాతాలను తెరవాలనే నిబంధనకు నీళ్ళు వదిలినట్లయ్యింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ శాఖలు ఇష్టానుసారంగా పిడి ఖాతాలు తెరవడానికి అనుమతి ఇవ్వడం ప్రారంభించాయి. ఏప్రిల్ 01, 2017 నాటికి పశ్చిమ బెంగాల్‌లో 153, గుజరాత్‌లో 478, ఒడిశాలో 827 పిడి ఖాతాలు ఉంటే ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే 58,539 ఖాతాలు ఉన్నాయని, ఆ ఖాతాలలో రూ.26,514కోట్ల నిధులు నిరుపయోగంగా ఉన్నాయని, అలా ఇబ్బడిముబ్బడిగా తెరవడం వల్ల వీటి పర్యవేక్షణ కష్టం అవుతుందని ఆడిట్ నివేదిక స్పష్టం చేసింది. ప్రభుత్వపరంగా ఏదైనా వాణిజ్య పథకాన్ని అమలు చేయడానికి అనుమతి ఇస్తే మాత్రం ఆ పిడి ఖాతాను ఆర్థిక సంవత్సరంలో మూసేయకుండా పథకం అమలు పూర్తి అయ్యేవరకు ఉంచవచ్చు అనే ప్రభుత్వ నిబంధన కూడా ఉంది. దీన్ని లొసుగుగా తీసుకొని దాదాపు అన్ని ప్రభుత్వ శాఖాలూ పి.డి. ఖాతాలను క్లోజ్ చేయకుండా కొనసాగించటం మొదలుపెట్టాయి. ఒకపక్క ప్రభుత్వం సంక్షేమ పథకాల కోసం అప్పులు చేస్తుంటే, అధికారులు ఈ పిడి ఖాతాలలోని మిగిలిన నిధులను బ్యాంకులకు డిపాజిట్‌లుగా తరలించడం ప్రారంభమైంది. 


ఉభయ తెలుగు రాష్ట్రాలలో ఆ పిడి ఖాతాల నిర్వహణ చాలా అస్తవ్యస్తంగా ఉన్నదని అకౌంటెంట్ జనరల్ ఆడిట్ నివేదికలలో పలుమార్లు స్పష్టం చేశారు. అయినా ప్రభుత్వ అధికారుల తీరులో కానీ, ప్రభుత్వంలో గాని చలనం లేదు. అన్నిటికంటే ముఖ్యంగా ప్రభుత్వ నిధులను అధికారులు పిడి ఖాతాల నుంచి బ్యాంకులలోని సేవింగ్స్ ఖాతాలకు, కరెంట్ ఖాతాలకు, ఫిక్‌్సడ్‌ డిపాజిట్ ఖాతాలకు తరలించడం గురించి ఆ ఆడిట్ నివేదిక ప్రముఖంగా పేర్కొన్నది. ఈ విధమైన తరలింపునకు ప్రభుత్వ నిబంధనలు అంగీకరించకపోయినా అధికారులు ఆ పని చేస్తూనే ఉన్నారు.. ఇలా ప్రభుత్వ నిధులను బ్యాంకు ఖాతాలకు తరలించి ఏళ్ల తరబడి పట్టించుకోకుండా ఉండడం వల్లనే అక్రమార్కులు ఈ తెలుగు అకాడెమీ తరహా మోసాలకు తెర తీశారు. అసలు తెలుగు అకాడెమీ ఖాతాలో 64కోట్లు ఏళ్ల తరబడి ఎందుకు ఉన్నాయి? ఇంకా ఎన్ని ప్రభుత్వ శాఖలలో ఇటువంటి డిపాజిట్లు ఉన్నాయి?


ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వ ఖజానా శాఖ నవంబరు 16, 2009న ఇచ్చిన ఉత్తర్వులలో ‘ప్రజల సొమ్ము ప్రభుత్వం వద్ద అన్నా ఉండాలి లేదా లబ్ధిదారుకు చేరాలి కానీ మధ్యలో ఉండకూడని’ స్పష్టంగా పేర్కొని, అలా బ్యాంకులలో ఉన్న నిధులు వెంటనే ప్రభుత్వ ఖాతాకు జమ చేయమని కోరింది. రాష్ట్ర ఆర్థిక శాఖ ఫిబ్రవరి 04, 2012న ఉత్తర్వులు ఇస్తూ ప్రభుత్వ నిధులకు ఫిక్‌్సడ్‌ డిపాజిట్లగా తరలించవద్దని ఆదేశించింది. అయినా కూడా వివిధ బ్యాంకు అకౌంట్లలో ప్రభుత్వ నిధులు మూలుగుతున్నాయని తెలిసి రాష్ట్ర ఆర్థిక శాఖ అక్టోబరు 14, 2016న జీవో ఎంఎస్ నం.196 ద్వారా అప్పటి ప్రభుత్వ లెక్కల ప్రకారం వివిధ ప్రభుత్వ శాఖలు 12 బ్యాంకులలో 70,924 అకౌంట్లను కలిగి ఉన్నాయని, వాటిలో రూ.19,611కోట్ల నిధులు ఉన్నాయని పేర్కొంది. ఇవన్నీ డ్రా చేసి ప్రభుత్వ ఖాతాకు జమ చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. అయినా ఈ ఉత్తర్వులు ఏవి అమలు కాలేదని 2016–2017 ఇచ్చిన ఆడిట్ నివేదికే పేర్కొన్నది. నిర్లక్ష్యం ఎక్కడ జరిగింది? ప్రభుత్వ ఉత్తర్వులకు వ్యతిరేకంగా అధికారులు బ్యాంకు అకౌంట్లకు,ఫిక్‌్సడ్ డిపాజిట్లకు నిధులు ఎలా తరలిస్తున్నారు అనే మౌలిక ప్రశ్న ఉత్పన్నం అవుతుంది. 


శాఖాధికారులు కొందరు పిడి ఎకౌంట్లలో నుంచి నిధులను బ్యాంకులు ఇచ్చే కమీషన్ల కోసం ఆశపడి ఫిక్సెడ్ డిపాజిట్‌లుగా వేయడం, ఆ నిధులను మూడు నాలుగేళ్ల పాటు అలానే ఉంచి, తాము అక్కడ నించి బదిలీ అయ్యేటప్పుడు తమతో పాటే ఆ డిపాజిట్‌లకు సంబంధించిన రికార్డ్‌లు కూడా మాయం చేసి, బ్యాంక్ అధికారులతో కుమ్మక్కు అయ్యి ఆ నిధులు స్వాహా చేసిన ఉందంతాలు చాలా ఉన్నాయి. ప్రభుత్వ అకౌంటింగ్ వ్యవస్థ లోపభూయిష్టంగా ఉండడం, ప్రభుత్వ నిబంధలను ఉల్లంఘిస్తున్న అధికారుల పట్ల ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరించడం వల్ల ఇలా ప్రజాధనం దుర్వినియోగం జరుగుతోంది. దీనికి పాలకులే భాధ్యత వహించాలి. 

శ్రీ వెంకట సూర్యఫణితేజ దినవహి

Advertisement
Advertisement