‘రియల్‌’ గద్దలు

ABN , First Publish Date - 2020-11-01T08:10:06+05:30 IST

కందనూలు జిల్లాలో ప్రధానంగా నాగర్‌కర్నూల్‌ నియోజకవర్గంలో కబ్జాదారుల అక్రమాలు రోజురోజుకు మితిమీరిపోతున్నాయి.

‘రియల్‌’ గద్దలు

కబ్జాదారుల కోరల్లో కందనూలు

దురాక్రమణకు గురవుతున్న ప్రభుత్వ భూములు

దేవుని మాన్యాలను సైతం దిగమింగుతున్న ఘనులు

తెలకపల్లిలో వంద కోట్ల విలువైన భూమికి ఎసరు

అనుమతులు లేకుండానే రాత్రికి రాత్రి కట్టడాలు

కేసరి సముద్రం, పుట్నాలకుంట, సద్దాల్‌సాబ్‌, తుమ్మలకుంటల కబ్జాలపై నేషనల్‌ గ్రీన్‌ ట్రైబ్యునల్‌లో కేసు

చోద్యం చూస్తున్న రెవెన్యూ, ఇరిగేషన్‌ శాఖల అధికారులు


ఖాళీ స్థలం కనిపిప్తే చాలు, అక్కడ ‘రియల్‌’ గద్దలు వాలిపోతున్నాయి.. చెరువులు, కుంటల శిఖం భూములైనా, దేవుని మాన్యం భూములైనా సరే దర్జాగా పాగా వేసేస్తున్నాయి.. ఇందుకు కొందరు అధికారుల అండ కూడా తోడుకావడంతో ‘రియల్‌’ మాఫియా వందల ఎకరాల భూములను ఆక్రమించింది.. వాటిని ప్లాట్లుగా విభజించి సామాన్య, మధ్య తరగతి కుటుంబాలకు అంటగట్టి కోట్లు దండుకుంది.. ఈ దురాక్రమణలపై ఫిర్యాదులు చేసినా, నేటి వరకు సదరు వ్యక్తులపై చర్యలు తీసుకోకపోవడం అనుమానాలకు తావిస్తోంది.. గ్రీన్‌ ట్రైబ్యునల్‌లో కేసు కూడా నమోదు కావడంతో, ఇప్పుడీ అంశం హాట్‌ టాపిక్‌గా మారింది..


నాగర్‌కర్నూల్‌, అక్టోబరు 31 (ఆంధ్రజ్యోతి) : కందనూలు జిల్లాలో ప్రధానంగా నాగర్‌కర్నూల్‌ నియోజకవర్గంలో కబ్జాదారుల అక్రమాలు రోజురోజుకు మితిమీరిపోతున్నాయి. ప్రభుత్వ భూములు, కుంటలు, శిఖం భూములను రియల్‌ మాఫియా యథేచ్ఛగా ఆక్రమిస్తోంది. వాటిని విక్రయించడం ద్వారా సామాన్య, మధ్య తరగతి ప్రజానీకానికి కుచ్చుటోపీ పెడుతోంది. ఇంత జరుగుతున్నా, అధికార యంత్రాంగం నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరించడం దుమారాన్ని రేపుతోంది. భూ ఆక్రమణలకు సంబంధించి నేషనల్‌ గ్రీన్‌ ట్రైబ్యునల్‌లో కూడా కేసులు దాఖలు కావడం, ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. 


కబ్జాదారుల కనుసన్నల్లో అధికార యంత్రాంగం

జిల్లా కేంద్రానికి ఆరు కిలోమీటర్ల పరిధిలో ఉన్న కేసరి సముద్రం, పుట్నాలకుంట, సద్దాల్‌సాబ్‌కుంట, తుమ్మలకుంటలలో శిఖం భూములను కొందరు అక్రమార్కులు దురాక్రమణ చేయడం బహిరంగ రహస్యమే కావడం, రెవెన్యూ, ఇరిగేషన్‌ అధికారుల సంయుక్త విచారణలో కూడా ఆక్రమణలు నిజమేనని నివేదికలు వచ్చినా ఉలుకూపలుకు లేకుండాపోవడం వెనుక మర్మమేమిటనే విషయం బోధపడటం లేదు. పుట్నాలకుంటను ధ్వంసం చేసి పరివాహక ప్రాంతాన్ని మళ్లించడం పట్ల పోలీస్‌ స్టేషన్‌లో అధికారులు ఫిర్యాదు చేసినా సంబంధిత వ్యక్తులపై ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం విశేషం. తెలకపల్లి మండల కేంద్రంలో సర్వే నంబర్‌ 35లో అసైన్‌మెంట్‌ ల్యాండ్‌ను కమర్షియల్‌ కాంప్లెక్స్‌లుగా మార్చి కోట్ల రూపాయలు దండుకున్నప్పటికీ ప్రజాప్రతినిధులు, అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం పట్ల ప్రజల్లో అసహనం వ్యక్తమవుతోంది. ఒక్క తెలకపల్లి మండల కేంద్రంలోనే 35వ సర్వే నంబరులో దాదాపు 200 అక్రమ నిర్మాణాలుండటం అధికారుల డొల్లతనాన్ని ప్రశ్నిస్తోంది.


నాగర్‌కర్నూల్‌ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలకు సంబంధించిన భూమి కూడా ఆక్రమణకు గురైనట్లు వచ్చిన విమర్శలు వాస్తవమా కాదా అనే అంశంలో కూడా ఇప్పటి వరకు స్పష్టత లేదు. నెల్లికొండ హనుమాన్‌ దేవాలయానికి సంబంధించిన మాన్యం ఆక్రమణకు గురైనట్లు దేవాదాయ శాఖ అధికారులు ప్రకటించిన తర్వాత కూడా శిఖం, ప్రభుత్వ భూములను ఆక్రమించడంలో దిట్టైన ఒక రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి తాజాగా రెండు వేల గజాలు రిజిస్ట్రేషన్‌ చేసుకోవడం గమనార్హం.

Updated Date - 2020-11-01T08:10:06+05:30 IST