ప్రభుత్వ భూములు ఫలహారం

ABN , First Publish Date - 2020-08-08T06:11:52+05:30 IST

తీగలాగితే డొంక కదులుతున్నది. ప్రభుత్వ భూములు ఫలహారమయ్యాయి. బొమ్మకల్‌ గ్రామంతో పాటు కరీంనగర్‌ చుట్టుపక్కల గ్రామాలైన రేకుర్తి, తీగలగుట్టపల్లి

ప్రభుత్వ భూములు ఫలహారం

జిల్లాలో వెయ్యికోట్ల భూకబ్జా వెలుగులోకి

జిల్లాలో సుమారు 300 ఎకరాలు అన్యాక్రాంతం

టాస్క్‌ఫోర్స్‌ తనిఖీలలో పట్టుబడ్డ వేల డాక్యుమెంట్స్‌

భూకబ్జాదారులపై పీడీ యాక్ట్‌ నమోదుకు లోక్‌సత్తా డిమాండ్‌


(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్‌)

తీగలాగితే డొంక కదులుతున్నది. ప్రభుత్వ భూములు ఫలహారమయ్యాయి. బొమ్మకల్‌ గ్రామంతో పాటు కరీంనగర్‌ చుట్టుపక్కల గ్రామాలైన రేకుర్తి, తీగలగుట్టపల్లి, సీతారాంపూర్‌, ఆరెపల్లి, పద్మనగర్‌, చింతకుంట తదితర గ్రామాలలో ప్రభుత్వ భూములు చెరువు, కుంటల శిఖం భూములు సుమారు 300 ఎకరాల వరకు అన్యాక్రాంతమయ్యాయి. వీటి విలువ వెయ్యికోట్ల వరకు ఉంటుందని అంచనా. కొందరు ప్రజాప్రతినిధులు భూ కబ్జాదారుల అవతారమెత్తి చెరువు, కుంటల శిఖం భూములను స్వాహా చేశారు. భూ మాఫియా శ్మశానవాటిక భూములను కూడా వదలటంలేదు. ఈ భూ కబ్జా అక్రమదందాలో ప్రభుత్వ అధికారుల హస్తం కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే భూకబ్జా వ్యవహారంలో ఒక డిప్యూటీ తహసీల్దార్‌, ఒక వీఆర్‌ఓలపై కేసులు నమోదయ్యాయి. 


డొంక కదిలిందిలా.....

బొమ్మకల్‌లో సర్వే నెంబర్‌ 184లోని ఐదున్నర గుంటల భూమిని తనకు తెలియకుండా కరీంనగర్‌కు చెందిన తుల అనిల్‌ పేరిట పహాణీ రికార్డులో నమోదు చేసి, తహసీల్దార్‌ కార్యాలయంలో నకిలీ పహణీ పత్రం తీసుకున్నారని ఆరోపిస్తూ జూలై 24న ఆ భూమి యజమాని బొమ్మకల్‌ గ్రామస్థుడు గూడ రాజేశ్వర్‌రెడ్డి కరీంనగర్‌ రూరల్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై మరుసటి రోజు కరీంనగర్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు బొమ్మకల్‌లో తనిఖీలు నిర్వహించగా గజ్జల అనిల్‌ ఇంటిలో భారీ మొత్తంలో పహణీ రికార్డులు, పట్టాదారు పాస్‌ పుస్తకాలు, మ్యుటేషన్‌ పత్రాలు, ఇతర డాక్యుమెంట్లు, స్టాంపులు దొరికాయి. 2003 నుంచి 2006 వరకు బొమ్మకల్‌ గ్రామ వీఆర్‌ఓగా పని చేసిన నర్సింహాచారి వద్ద గజ్జల అనిల్‌ (ప్రైవేట్‌)సహాయకుడిగా పనిచేసేవాడని వెల్లడైంది. ఆ తరువాత బాధితులు ఒకరి తరువాత ఒకరు పదుల సంఖ్యలో పోలీసులను ఆశ్రయించారు. పోలీసు కమిషనర్‌ వీబీ కమలాసన్‌రెడ్డి టాస్క్‌ఫోర్స్‌, స్పెషల్‌ బ్రాంచి పోలీసులతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ఈ భూ వ్యవహారంపై మరింత లోతుగా విచారణ చేపట్టారు. ఇప్పటి వరకు 10 కేసులు నమోదయ్యాయి. 


వేల సంఖ్యలో డాక్యుమెంట్ల పట్టివేత

భూకబ్జా, నకిలీ పత్రాలు సృష్టించి రిజిస్ట్రేషన్లు చేసుకున్న వ్యవహారంలో డాక్యుమెంట్స్‌ కోసం టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు సోదాలు చేస్తుండగా శుక్రవారం దుర్శేడ్‌ గ్రామ శివారులో ఒక వాహనంలో 5 గన్నీ సంచుల నిండా కీలకమైన డాక్యుమెంట్లు లభించాయి. వేల సంఖ్యలో రిజిస్ట్రేషన్‌ డాక్యుమెంట్లు, పాస్‌బుక్‌లు, పహణీ నఖళ్లు, రికార్డుబుక్‌లు, స్టాంపు పేపర్లు, ఒప్పంద పత్రాలు ఇతర పత్రాలు ఇందులో ఉన్నాయి. కరీంనగర్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు బొమ్మకల్‌, గోపాల్‌పూర్‌, దుర్శేడ్‌ గ్రామాలలోని సర్పంచ్‌ పురమల్ల శ్రీనివాస్‌ అనుచరులు, డ్రైవర్‌ల ఇళ్లలో సోదాలు నిర్వహించి కొందరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. భూకబ్జా వ్యవహారంపై జిల్లా కలెక్టర్‌ ఏర్పాటు చేసిన ఆర్‌డీఓ ఆనంద్‌కుమార్‌ నేతృత్వంలోని 8 మంది సభ్యులతో కూడిన కమిటీ రెండు రోజులుగా బొమ్మకల్‌లోని చెరువు, కుంటల శిఖం భూములు, ప్రభుత్వ భూములపై సర్వే చేపట్టింది.


ఇందులో భాగంగా శుక్రవారం పెద్దపల్లి బైపాస్‌ రోడ్డు ప్రాంతంలోని కాపు సంఘం భవనం, ఓ ఎమ్మెల్యేకు చెందిన ఓ ఇంజనీరింగ్‌ కళాశాల వద్ద సర్వే చేశారు. ఈ ప్రాంతంలో ఉన్న కుంటను కొందరు ఆక్రమించుకుని నిర్మాణాలు చేపట్టినట్లు ఆరోపణలున్నాయి. భూకబ్జా వ్యవహారంలో ప్రధాన నిందితుడిగా పేర్కొంటున్న బొమ్మకల్‌ సర్పంచ్‌ పురమల్ల శ్రీనివాస్‌ను పోలీసు కస్టడీకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. శ్రీనివాస్‌ ఇచ్చిన సమాచారంతో పలు చోట్ల తనిఖీలు చేపట్టారు. బొమ్మకల్‌ గ్రామ పంచాయతీ పరిధిలోని ఐదు చెరువులు, కుంటలలోని భూములు, ఇతర చోట్ల ప్రభుత్వ భూముల సర్వే నెంబర్లతో 10 ఏళ్లలో ఇతరుల పేరిట రిజిస్ట్రేషన్‌ అయిన డాక్యుమెంట్‌ జిరాక్స్‌ కాపీలను పోలీసులు జిల్లా స్టాంపులు, రిజిస్ట్రేషన్‌ కార్యాలయం నుంచి సేకరించారు. 


బొమ్మకల్‌లో ఇంటి అనుమతులపై విచారణ

మరో వైపున జిల్లా పంచాయతీ కార్యాలయంలో బొమ్మకల్‌ గ్రామంలో ఇంటి అనుమతులు, చలాన్‌లను నిశితంగా పరిశీలిస్తున్నారు. ఒకే చలాన్‌తో మూడు ఇళ్లకు అనుమతులు ఇచ్చిన ఉదంతం బయటపడటంతో ఇటువంటివి ఇంకా ఎన్ని ఉన్నాయనే కోణంలో విచారణ జరుపుతున్నారు. ఈ భుకబ్జా వ్యవహారంలో బొమ్మకల్‌ సర్పంచ్‌, అతని అనుచరులపై ఇప్పటికే కరీంనగర్‌ రూరల్‌ ఠాణాలో 10 కేసులు నమోదయ్యాయి. ఈ కేసులకు సంబంధించి సమగ్ర విచారణ, పూర్తి నివేదిక ఇవ్వాలని మానవహక్కుల కమిషన్‌ ఆదేశించిన నేపథ్యంలో సాక్ష్యాధారాల సేకరణలో పోలీసు అధికారులు బిజీగా ఉన్నారు. ఈ కేసులకు సంబంధించి 5 ప్రత్యేక పోలీసు బృందాలు పనిచేస్తున్నాయి. 


కబ్జాకు గురైన భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి

ప్రభుత్వ భూములు కబ్జాచేసిన వారిపై పీడీ యాక్ట్‌ నమోదు చేయాలని, ఇందుకు సహకరించిన పంచాయతీరాజ్‌, రెవెన్యూ, రిజిస్ట్రేషన్‌శాఖ అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని లోక్‌సత్తా ఉద్యమసంస్థ నాయకులు, బాధితుల సంఘం డిమాండ్‌ చేశారు. కబ్జాకు గురైన సుమారు 200 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకుని విక్రయిస్తే ప్రభుత్వానికి ఆదాయం వస్తుందన్నారు. కాగా ప్రభుత్వ భూములు కబ్జాకు గురైన వ్యవహారంలో విచారణ పారదర్శకంగా జరగాలంటే విచారణ కమిటీలో ఈ వ్యవహారంతో సంబంధం లేనివారిని నియమించాలని సిటీ కాంగ్రెస్‌ అధ్యక్షులు కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి శుక్రవారం జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. రెవెన్యూ అధికారుల సహకారంతోనే ఈ భూఅక్రమదందా జరగగా ఆ శాఖ అధికారులతోనే కమిటీ వేయడం సరైందికాదని పేర్కొన్నారు. జిల్లాలో పలు ప్రాంతాల్లో కబ్జాకు గురైన ప్రభుత్వ భూములపై సమగ్ర విచారణ జరిపి దోషులపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలని, బాధితులకు న్యాయం చేయాలని ఇప్పటికే బీజేపీ, సీపీఐ, కాంగ్రెస్‌, టీడీపీ నాయకులు డిమాండ్‌ చేశారు. 

Updated Date - 2020-08-08T06:11:52+05:30 IST