ప్రభుత్వ భూమి వేసేయ్‌ పాగా!

ABN , First Publish Date - 2021-10-28T05:25:29+05:30 IST

జిల్లా కేంద్రంతో పాటు పట్టణ, మండల శివారుల్లో ప్రభుత్వ స్థలం ఖాళీ కనిపిస్తే చాలు కబ్జాదారులు పాగా వేస్తున్నారు.

ప్రభుత్వ భూమి వేసేయ్‌ పాగా!
పోకాల కుంటలో మట్టిని నింపి కబ్జా చేసిన వెంచర్‌ నిర్వాహకులు

- జిల్లాలోని పట్టణ శివారుల్లో ప్రభుత్వ ఖాళీ స్థలాలు కబ్జా
- ప్రభుత్వ స్థలాలపై కన్నేస్తున్న కబ్జారాయుళ్లు
- రూ. కోట్ల విలువ చేసే భూములు అన్యాక్రాంతం
- ఎల్లారెడ్డి శివారుల్లో ఎకరంన్నరకు పైగా కుంట భూమిని కబ్జా చేసిన వెంచర్‌ నిర్వాహకులు
- మట్టితో కుంటను కూడిపేసిన వైనం
- కుంట వద్ద వెంచర్‌కు అనుమతి ఇవ్వవద్దంటూ రెవెన్యూకు లేఖ రాసిన ఇరిగేషన్‌ శాఖ
- వెంచర్‌ పనులను వెంటనే ఆపివేయాలంటూ రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు
- బాన్సువాడలో రూ.20 కోట్ల విలువ చేసే ప్రభుత్వ అమ్మకానికి పెట్టిన కబ్జాదారులు
- స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధుల ఆగడాలతోనే కబ్జాలు


కామారెడ్డి, అక్టోబరు 27(ఆంధ్రజ్యోతి): జిల్లా కేంద్రంతో పాటు పట్టణ, మండల శివారుల్లో ప్రభుత్వ స్థలం ఖాళీ కనిపిస్తే చాలు కబ్జాదారులు పాగా వేస్తున్నారు. పట్టణాల్లో, శివారు ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణాలు జోరందుకోవడం, వ్యవసాయ భూములు ప్లాట్లుగా మారుతుండడంతో భూముల ధరలు రూ.కోట్లలో పలుకుతున్నాయి. దీంతో కబ్జాదారుల కన్ను ప్రభుత్వ స్థలాలపై పడుతుంది. మున్సిపల్‌, రెవెన్యూ, నీటి పారుదల శాఖలకు చెందిన పార్కులు, కుంటలు, ఖాళీ ప్రభుత్వ స్థలాలను కబ్జాదారులు దర్జాగా ఆక్రమిస్తు ప్లాట్లుగా మార్చుతూ రూ.కోట్లు విలువ చేసే భూములను అమ్మేస్తున్నారు. ఈ వ్యవహారమంతా స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధుల కనుసన్నల్లోనే జరుగుతుందనే ఆరోపణలు వస్తున్నాయి. ఎల్లారెడ్డి పట్టణ శివారుల్లోని ఓ కుంట పక్కనే పెద్ద ఎత్తున వెంచర్‌ చేపడుతున్నారు. వెంచర్‌ నిర్వాహకులు కుంటకు సంబంధించిన సగం ప్రభుత్వ భూమిని కబ్జా చేసి అందులో మట్టి కూర్పేశారు. కుంట భూమిని వెంచర్‌ నిర్వాహకులు కబ్జా చేశారంటూ స్థానిక ఇరిగేషన్‌ అధికారులు రెవెన్యూకు ఫిర్యాదు చేశారు. అదేవిధంగా బాన్సువాడ పట్టణంలో ఏకంగా రూ.20 కోట్లు విలువ చేసే ప్రభుత్వ స్థలాన్ని  కొందరు స్థానిక అధికార పార్టీ నేతలు, విలేకరులు ఇళ్ల నిర్మాణాల కోసం ప్లాట్లుగా మార్చి అమ్మకానికి పెట్టినట్లు విమర్శలు వస్తున్నాయి. ఇలా జిల్లాలో ఎల్లారెడ్డి, బాన్సువాడ, కామారెడ్డి పట్టణాల్లో ప్రభుత్వ స్థలాలు కబ్జాలకు గురవుతున్నా అధికారులు మాత్రం పట్టించుకోకపోవడంపై స్థానిక ప్రజలు మండిపడుతున్నారు.
ఎల్లారెడ్డిలో పోకాల కుంట కబ్జా
ఎల్లారెడ్డి పట్టణ శివారుల్లోని సాతిల్ల్లిబేస్‌ ప్రాంతంలో బాన్సువాడకు చెందిన కొందరు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు 14 ఎకరాల్లో వెంచర్‌ను చేపడుతున్నారు. ఈ వెంచర్‌కు ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతి లేదు. వ్యవసాయ భూమి చదును చేసి ప్లాట్లుగా మార్చుతున్నారు. ఈ వెంచర్‌ పక్కనే 3.10 గుంటల విస్తీర్ణంలో పోకాల కుంట ఉంది. రెండు నెలల కిందట కురిసిన భారీ వర్షాలకు ఈ కుంట సైతం పూర్తిగా నిండుపోయింది. ఇటీవల కుంటలో నీరు తగ్గిపోవడంతో పక్కనే చేపడుతున్న వెంచర్‌ నిర్వాహకులు కుంట స్థలంపై కన్ను పడింది. కుంటకు సంబంధించిన సుమారు ఎకరన్నర భూమిని కబ్జాచేసి అందులోకి మొరం, మట్టిని నింపేసి చదును చేశారు. ఇదే విషయమై స్థానికులు నీటి పారుదలశాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. కుంటకు సంబంధించిన భూమిని కొందరు వ్యక్తులు కబ్జా చేశారని రెవెన్యూ శాఖకు ఫిర్యాదు చేశారు. పక్కనే వెంచర్‌ నిర్వాహకులు కుంటలో భూమిని మొరంతో నింపివేశారని వెంటనే ఆ వెంచర్‌ పనులను నిలిపివేయాలంటూ ఎల్లారెడ్డి నీటి పారుదలశాఖ అధికారులు రెవెన్యూకు లేఖ రాశారు. సుమారు 14 ఎకరాలలో కొందరు వ్యక్తులు ఎలాంటి అనుమతి లేకుండా వెంచర్‌ చేపడుతుంటే రెవెన్యూ, మున్సిపల్‌ శాఖల అధికారులు ఏం చేస్తున్నారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
గతంలో సొసైటీ, దేవాదాయ భూముల కబ్జా
ఎల్లారెడ్డి మున్సిపల్‌గా ఏర్పడిన తర్వాత శివారు ప్రాంతాల్లోని వ్యవసాయ భూములకు రెక్కలు వచ్చాయి. కొన్ని గ్రామాలు మున్సిపాలిటీలో కలవడంతో ఆ గ్రామాల్లోని వ్యవసాయ భూములు ప్లాట్లుగా మారుతున్నాయి. కొందరు రియల్‌ఎ స్టేట్‌ వ్యాపారులు కబ్జాదారులు కలిసి ఎలాంటి అనుమతులు లేకుండా ఇష్టారాజ్యంగా వెంచర్లుగా మార్చి ప్లాట్లుగా విక్రయిస్తున్నారు. అక్రమ వెంచర్లకు అనుమతులు ఇవ్వవద్దని నాన్‌ లేఅవుట్‌లు జరుగకుండా చూడాలని ప్రభుత్వం సంబంధిత శాఖ అధికారులకు ఖచ్చితమైన ఆదేశాలు జారీ చేస్తున్నా అక్రమ వెంచర్లు మాత్రం ఆగడం లేదు. వెంచర్లు, లేఅవుట్‌ల చాటున స్థానికంగా ఉండే ప్రభుత్వ భూములను కబ్జాలు చేస్తున్నారు. తాజాగా పోకాల కుంటకు సంబంధించిన ఎకరన్నర భూమిని స్థానిక వెంచరు నిర్వాహకులు కబ్జా చేసి మట్టితో కూడిపేశారు. గత ఆరు నెలల కిందట ఎల్లారెడ్డి పట్టణంలోని బస్సు డిపో సమీపంలో ఎల్లారెడ్డి సొసైటీకి సంబంధించిన ప్రభుత్వ భూమిని పాలకవర్గ సభ్యుల్లోని కొందరు తమ పేరిట గుంట చొప్పున రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారని ఆరోపణలు రావడంతో కొందరు రెవెన్యూతో పాటు సహకార శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. సొసైటీ భూములను కాపాడాల్సిన పాలకవర్గ సభ్యులే సొంత సంస్థ భూమిని కబ్జా చేసుకోవడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఎల్లారెడ్డి పట్టణంలోని బస్టాండ్‌ సమీపంలో గల బీసీ కాలనీ పక్కన దేవాదాయశాఖకు సంబంధించిన రెండెకరాల భూమిని గతంలో కొందరు కబ్జాచేసి వెంచర్లుగా మార్చి ప్లాట్లను విక్రయించారు. ఈ భూములను ఇప్పటికీ కబ్జాదారుల నుంచి అధికారులు స్వాధీనం చే సుకోకపోవడంపై స్థానిక ప్రజలు మండిపడుతున్నారు.
బాన్సువాడలో అమ్మకానికి రూ.20 కోట్ల ప్రభుత్వ భూమి
బాన్సువాడ పట్టణం రోజురోజుకూ విస్తరిస్తుండడం అపార్ట్‌మెంట్‌ల కల్చర్‌ రావడం, వందల ఎకరాలలో కొత్తకొత్త వెంచర్‌లు వెలుస్తుండడంతో భూముల ధరలు రూ. కోట్లలో పలుకుతున్నాయి. పట్టణ శివారుల్లోనూ వెంచర్లు పుట్ట గొడుగుల్లా వెలుస్తున్నాయి. దీంతో కబ్జాదారుల కన్ను ప్రభుత్వ భూములపై పడుతుంది. బాన్సువాడ పట్టణంలోని ఇస్లాంపూర కాలనీ ప్రాంతంలో రూ.20 కోట్లు విలువ చేసే రెండెకరాల ప్రభుత్వ భూమిని కొంత మంది ఇళ్ల పేరిట నెంబర్‌లు వేసి ఆ భూమిని అమ్మకానికి పెట్టారు. ఈ భూమి గ్రామకంఠం భూమిగా ప్రభుత్వ రికార్డులలో ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. కానీ కొంతమంది విలేకరులు, అధికార పార్టీ నాయకులు ఒక్కటై రెవెన్యూ అధికారులపై ఒత్తిళ్లు తీసుకువచ్చి ప్లాట్లుగా మార్చి నెంబర్‌లు కూడా వేసి విక్రయించడానికి సిద్ధమైనట్లు తెలిసింది. దీనికి సంబంధించిన మున్సిపాలిటీ కార్యాలయం నుంచి మ్యూటేషన్‌ పత్రం పొందినట్లు సమాచారం.  ఈ ప్రభుత్వ భూమిని కబ్జా చేసేందుకు స్థానికంగా ఉండే అధికార పార్టీ నేతలతో కొందరు విలేకరులు కుమ్మక్కై విక్రయానికి పెట్టినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఇదే విషయమై కొందరు స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. స్థానిక మున్సిపల్‌, రెవెన్యూ అధికారుల అండదండలతోనే ఈ ప్రభుత్వ భూమికి సంబంఽధించిన సర్వే నెంబర్‌లను తారుమారు చేసి మున్సిపల్‌శాఖ నుంచి ప్లాట్లుగా నెంబర్‌లు వేయించి కబ్జాలకు పాల్పడ్డారనే ఆరోపణలు వస్తున్నాయి.

కుంట భూమిని కబ్జా చేశారు
- వెంకటేశ్వర్లు, ఇరిగేషన్‌ డీఈ, ఎల్లారెడ్డి
ఎల్లారెడ్డి పట్టణంలోని సాతెల్లిబేస్‌ పక్కన ఉన్న పోకాల కుంట 3.10 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ఈ కుంటకు సంబంధించిన సగం భూమిని పక్కనే చేపడుతున్న వెంచర్‌ నిర్వాహకులు కబ్జా చేసి మొరం, మట్టితో నింపివేశారు. కుంట పక్కన ప్లాట్లకు అనుమతి ఇవ్వడానికి వీలు లేదు. కుంట భూమిని కబ్జా చేస్తున్నారంటూ రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశాం.

శిఖం భూమిని కబ్జాచేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం
- అంజయ్య, తహసీల్దార్‌, ఎల్లారెడ్డి
పోకాల కుంటకు సంబంధించి శిఖం భూమిని కబ్జాచేస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. కుంట భూములను కొందరు వెంచర్‌ నిర్వాహకులు కబ్జా చేస్తున్నట్లు నీటి పారుదలశాఖ అధికారులు మాకు ఫిర్యాదు చేశారు. దీంతో కుంట పక్కన చేపడుతున్న వెంచర్‌ పనులను నిలిపివేశాం. సర్వే చేసే వరకు అక్కడ పనులు చేయవద్దని ఆదేశాలు జారీ చేశాం.

Updated Date - 2021-10-28T05:25:29+05:30 IST