సర్కారు వారి పాట.. అధికారుల టాటా

ABN , First Publish Date - 2022-05-21T04:50:41+05:30 IST

ఆలయ భూములను సాగు చేసుకునేందుకు

సర్కారు వారి పాట.. అధికారుల టాటా
అధికారుల రాక కోసం ఆలయం ఎదుట నిరీక్షిస్తున్న రైతులు

  • భూముల సాగు వేలానికి రాని అధికారులు 
  • గంటల తరబడి ఆలయం వద్ద రైతుల నిరీక్షణ 


నందిగామ, మే, 20 : ఆలయ భూములను సాగు చేసుకునేందుకు సర్కారువారి పాట పెట్టాలని నిర్ణయించారు. కానీ ఉదయం నుంచి ఎదురుచూసినాభూముల సాగు కోసం వేలం వేయడానికి అధికారులు రాలేదు. గ్రామస్థులు ఫోన్లు చేసినా స్పందించలేదు. చివరికి వేలం పాట రద్దయింది. దీని వెనుక రాజకీయ కుట్ర ఉన్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నందిగామ మండలపరిధిలోని మామిడిపల్లి ఆలయ భూముల సాగు విషయంలో చోటుచేసుకున్న ఉదంతమిది.

వివరాలు ఇలా..

మండల పరిధిలోని మామిడిపల్లి శివారులోని శ్రీ సీతారామచంద్ర దేవస్థానానికి చెందిన 44ఎకరాల భూముల్లో కొందరు రైతులు ఏళ్లతరబడి సాగు చేసుకుంటున్నారు. వచ్చిన ఆదాయంలో ఆలయ ఖర్చుల నిమిత్తం కొంత దేవస్థానానికి చెల్లిస్తున్నారు. ఈ డబ్బుతోనే ఆలయ అర్చకులు గుడిలో ధూప, దీప, నైవేద్యాలను స్వామివారికి సమర్పిస్తున్నారు. ఈ మధ్య కాలంలో నిత్యావసర వస్తువుల ధరలు భారీగా పెరగడంతో దేవాలయ నిర్వహణ భారంగా మారిందని అర్చకులు ఆలయ నిర్వహణ అధికారుల దృష్టికి తీసుకుపోయారు. వారు ఎండోమెంట్‌ అధికారులకు ఈ విషయాలను తెలిపారు. దీంతో 20వ తేదీన ఆలయ భూముల సాగు కోసం వేలం పాట నిర్వహిస్తామని, ఈ విషయాన్ని గ్రామంలో దండోరా వేసి గ్రామస్థులకు తెలియజేయాలని ఆలయ నిర్వాహకులకు తెలిపారు. ఆలయ భూముల సాగు వేలంపాట పాడేందుకు ఉదయాన్నే గ్రామస్థులు ఆలయం వద్దకు చేరుకున్నారు. కానీ సాయంత్రం 5 గంటలు దాటినా ఎండోమెంట్‌ అధికారులు రాకపోవడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనివెనుక పెద్ద రాజకీయ కుట్ర ఉన్నందునే అధికారులను వేలం పాట నిర్వహించకుండా అడ్డుకున్నారని గ్రామస్థులు ఆరోపించారు. ఈ విషయంపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని తెలిపారు.   



Updated Date - 2022-05-21T04:50:41+05:30 IST