సర్కారు వారి పాట!

ABN , First Publish Date - 2022-06-24T08:22:52+05:30 IST

ప్రభుత్వం కొత్తగా ప్రకటించిన బార్‌ పాలసీ వెనుక ఆదాయమే అసలు లక్ష్యంగా కనిపిస్తోంది. వెంటనే రూ.500 కోట్లు ఖజానాలో వేసుకోవాలనే ఉద్దేశంతో ఈ పాలసీని తెచ్చినట్లుగా స్పష్టమవుతోంది.

సర్కారు వారి పాట!

భారీ ఆదాయమే లక్ష్యంగా బార్‌ విధానం

రూ.500 కోట్లు వచ్చే అవకాశం

భారీగా ఫీజులు పెంచిన ప్రభుత్వం

వాటిపై మళ్లీ వేలం విధానం

నాన్‌ రిఫండబుల్‌ ఆదాయమే 300 కోట్లు

మద్యం ధరల నిర్ణయం లైసెన్సీలదే

ఇకపై బార్లలో మందు మరింత ప్రియం

వినియోగదారు వైపు ఆలోచించని సర్కారు


చాలినంత అప్పు పుట్టడంలేదు.. ఖాజానాకు వచ్చే ఆదాయం చాలడంలేదు!. ప్రజలపై ఇప్పటికే అడ్డమైన పన్నుల బాదుడు.. ఇది చాలదన్నట్లు మద్యం అడ్డగోలు వ్యాపారం.. అందులోనే ఇప్పుడు ఉన్నపళంగా ఓ 500 కోట్లు లాగేందుకు కొత్తగా బార్‌ పాలసీ!. ఇదీ సర్కారు వారి మద్యం పాట!.. దశలవారీ మద్య నియంత్రణ చేపడతామని హామీ ఇచ్చిన ఏలికలు.. ప్రజారోగ్యాన్ని పణంగా పెట్టి.. ఇప్పుడు తమ మనుగడకు మద్యం ఒక్కటే మార్గమన్నట్లు నడవడం విస్తుపోయే అంశం!!.


(అమరావతి-ఆంధ్రజ్యోతి)

ప్రభుత్వం కొత్తగా ప్రకటించిన బార్‌ పాలసీ వెనుక ఆదాయమే అసలు లక్ష్యంగా కనిపిస్తోంది. వెంటనే రూ.500 కోట్లు ఖజానాలో వేసుకోవాలనే ఉద్దేశంతో ఈ పాలసీని తెచ్చినట్లుగా స్పష్టమవుతోంది. ఇప్పటికే షాపులను ప్రభుత్వ పరం చేయడంతో ఇక వీలైనంత మేర బార్లలో లాగాలని ప్రయత్నాలు చేస్తోంది. వీలైనంత మేర బార్లపై బాదితే అసలు వినియోగదారులపై ఎంత భారం పడుతుందనే కోణాన్ని పూర్తిగా విస్మరించింది. అడిగినంత కట్టండి... ఎంతకైనా అమ్ముకోండి అన్నట్టుగా తాజా పాలసీలో రుసుములు పెంచేసింది. నాన్‌ రిఫండబుల్‌ రిజిస్ర్టేషన్‌ చార్జీ, లైసెన్సు ఫీజు, దరఖాస్తు ఫీజులు భారీగా పెంచడంతోనే ప్రభుత్వం సరిపెట్టుకోలేదు. ఇంకా అదనపు ఆదాయం కావాలన్నట్టుగా లైసెన్సీ ఎంపిక ప్రక్రియను మొట్టమొదటిసారిగా వేలం ద్వారా నిర్వహిస్తోంది. దీంతో ఇక బార్లలో మందు తాగడం అంటే పట్టపగలే చుక్కలు కనిపించనున్నాయి. 2017లో పాలసీ ప్రకటించినప్పుడు బార్లను జనాభా ఆధారంగా 3 రకాలుగా వర్గీకరించారు.


50వేల లోపు, 50వేల నుంచి 5లక్షలు, 5లక్షలకు పైగా అనే కేటగిరీలు పెట్టి వాటికి వరుసగా  రూ.10లక్షలు, రూ.20లక్షలు, రూ.30లక్షలు నాన్‌ రిఫండబుల్‌ రిజిస్ర్టేషన్‌ చార్జ్‌గా నిర్ణయించారు. వాటిపై ఏటా 10శాతం పెంచారు. ఇప్పుడు ఆ రుసుములను రూ.15లక్షలు, రూ.35లక్షలు, రూ.50లక్షలు చేశారు. గతంలో లైసెన్సు ఫీజు అన్నిటికీ రూ.2లక్షలుగా ఉంటే, ఇప్పుడు రూ.5లక్షలు చేసేశారు. దరఖాస్తు రుసుమును రూ.2లక్షల నుంచి మూడు కేటగిరీలకు కనీసం రూ.5లక్షల నుంచి గరిష్ఠంగా రూ.10లక్షలకు పెంచారు. వీటిని కనీస రుసుములుగా భావించి ఆపై వేలం నిర్వహిస్తారు.


దరఖాస్తుల ద్వారానే రూ.70 కోట్లు

రాష్ట్రంలో సుమారు 300 బార్లు 5లక్షలకు పైగా జనాభా ఉన్న కేటగిరీలో ఉంటే, మిగిలినవి మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో ఉన్నాయి. వాటికి నిర్ణయించిన దరఖాస్తు రుసుముతో బార్‌కు కేవలం ఒక్కటే దరఖాస్తు వచ్చిందనకున్నా రూ.70కోట్లు దరఖాస్తు ఫీజులతోనే వస్తాయు. ఇక బార్ల కోసం వ్యాపారుల మధ్య ఎంత పోటీ పెరిగితే అంత ఆదాయం పెరిగిపోతుంది. అలాగే లైసెన్సు ఫీజుల రూపంలో రూ.45 కోట్ల వరకూ వస్తాయి. నాన్‌ రిఫండబుల్‌ రిజిస్ర్టేషన్‌ చార్జ్‌ కింద రూ.300 కోట్లకు పైగా ఆదాయం వస్తుంది. ఈ మూడు రూపాల్లోనే రూ.415 కోట్లు ప్రభుత్వానికి వస్తాయి. ఇక నాన్‌ రిఫండబుల్‌ రిజిస్ర్టేషన్‌ చార్జ్‌ను కనీస రుసుముగా తీసుకుని ఆపైన వేలంలో రూ.2లక్షలకు తగ్గకుండా కోట్‌ చేయాలి. ఒక్కో బార్‌కు కనీసం అదనంగా రూ.4లక్షలు కోట్‌ చేసినా రూ.35కోట్లు వస్తాయి. ఇలా ఎక్సైజ్‌శాఖ భారీ అంచనాలు పెట్టుకోకపోతేనే రూ.450 కోట్లు పాలసీ మొదట్లో వచ్చిపడతాయి. ఇక ప్రాంతాల వారీగా వ్యాపారుల మధ్య పోటీ ఉంటుంది. ఆ పోటీ తీవ్రంగా ఉంటే వేలంలో భారీగా కోట్‌ చేసే వీలుంది. అప్పుడు ప్రభుత్వం ఊహించిన దానికన్నా అదనంగా కాసులు ఖజానాలో పడతాయి. కాగా అధికార వర్గాలు మాత్రం బార్‌ పాలసీతో రూ.384 కోట్లు వస్తాయని చెబుతున్నాయి.


ఇక అదుపు కష్టమే

తాజా రుసుముల పెంపు చూస్తే వినియోగదారులను వీలైనంత మేర బాదండి అన్నట్టుగానే ఉంది. ఎక్సైజ్‌ నిబంధనల ప్రకారం బార్లలో మద్యం ధరలు ఎంత ఉండాలనేది బార్‌ లైసెన్సీ ఇష్టం. ఆయా బార్లు వారు కల్పించే సౌకర్యాలు, ప్రాంతాన్ని బట్టి మద్యం ధర నిర్ణయించుకుంటారు. అందుకే షాపులతో  పోలిస్తే బార్లలో రేట్లు భారీగా ఉంటాయి. అదనపు రేట్లు పెట్టకపోతే బార్‌ లైసెన్సు ఫీజులు, బార్‌ ఏర్పాటుకు పెట్టుబడి అవన్నీ లైసెన్సీకి తిరిగి రావడం కష్టం. ఇప్పుడు ఆ అదనాన్ని మరింత పెంచుకోండి అన్నట్టుగా ప్రభుత్వం రేట్లు పెంచేసింది. పోనీ దీని వెనుక మద్యం అమ్మకాలు తగ్గించే ఆలోచన ఉందా అంటే అదీ లేదు. కొత్త పాలసీలో ఒక్క బార్‌ను కూడా తగ్గించలేదు. వీలైనంత ఎక్కువ మద్యం బార్లలో అమ్మించి ఆదాయం ఆర్జించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. 


Updated Date - 2022-06-24T08:22:52+05:30 IST