సర్కారు వారి షాక్‌

ABN , First Publish Date - 2022-05-16T17:44:30+05:30 IST

వైసీపీ సర్కారు అడ్డగోలుగా అప్పులు చేస్తోంది. ఎడాపెడా పన్నులు బాదుతోంది. అయినా సకాలంలో బిల్లులు చెల్లించడం లేదు. ఒక్క ఉమ్మడి

సర్కారు వారి షాక్‌

హంద్రీనీవా విద్యుత్‌ బకాయి 2,640 కోట్లు 

మూడేళ్లుగా చెల్లించని వైసీపీ సర్కారు 

పెనాల్టీ రూ.314.78 కోట్లు

విద్యుత్‌ శాఖపై ఆర్థిక భారం 

సకాలంలో జీతాలు ఇవ్వలేని పరిస్థితి 

గతంలో ఎన్నడూ లేదంటున్న ఉద్యోగులు


(కర్నూలు-ఆంధ్రజ్యోతి)

వైసీపీ సర్కారు అడ్డగోలుగా అప్పులు చేస్తోంది. ఎడాపెడా పన్నులు బాదుతోంది. అయినా సకాలంలో బిల్లులు చెల్లించడం లేదు. ఒక్క ఉమ్మడి కర్నూలు జిల్లాలోనే ప్రభుత్వం రూ.3,028.39 కోట్లు విద్యుత్‌ బిల్లులు చెల్లించలేదు. అందులో హంద్రీనీవా సుజల స్రవంతి ఎత్తిపోతల పథకం విద్యుత్‌ బకాయిలే రూ.2,640.98 కోట్లు ఉన్నాయి. 2019లో జగన్‌ ప్రభుత్వం కొలువుదీరినప్పటి నుంచి హంద్రీనీవా విద్యుత్‌ బిల్లులు చెల్లించడం లేదు. సకాలంలో చెల్లించనందున పెనాల్టీ రూ.314.78 కోట్లకు చేరింది. కరెంటు బిల్లులు సకాలంలో చెల్లించి ఉంటే ఇంత భారీ మొత్తంలో పెనాల్టీ పడేది కాదని, అదనంగా చెల్లించాల్సిన ఈ డబ్బుతో ఓ ప్రాజెక్టు నిర్మించవచ్చని సాగునీటి నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వం చెల్లించాల్సిన విద్యుత్‌ బకాయిలు రూ.వేల కోట్లకు పేరుకుపోవడంతో ఆ శాఖ ఉద్యోగులకు సకాలంలో జీతాలు చెల్లించలేని పరిస్థితి ఏర్పడింది. ఒకటో తారీఖు అందాల్సిన జీతాలు రెండు వారాలు అయినా రావడం లేదు. ఇలాంటి పరిస్థితి గతంలో ఎప్పుడూ లేదని ఉద్యోగులు అంటున్నారు. రాయలసీమలో కరువు, దుర్భిక్ష పరిస్థితులను శాశ్వతంగా నివారించాలనే లక్ష్యంతో హంద్రీనీవా సుజల స్రవంతి ఎత్తిపోతల పథకం చేపట్టారు. కర్నూలు, అనంతపురం, చిత్తూరు, కడప జిల్లాల్లో 6.05 లక్షల ఎకరాలకు సాగునీరు, 35 లక్షల జనాభాకు తాగునీరు ఇవ్వాలనేది ప్రధాన ఆశయం. శ్రీశైలం ప్రాజెక్టు ఎగువన కర్నూలు జిల్లా నందికొట్కూరు మండలం మాల్యాల నుంచి 40 టీఎంసీల కృష్ణా వరద జలాలను ఎత్తిపోయాలి. ఫేజ్‌-1 కింద మాల్యాల నుంచి అనంతపురం జిల్లా జీడిపల్లి జలాశయం వరకు 216.30 కిలో మీటర్ల ప్రధాన కాలువ నిర్మించారు.


8 పంపింగ్‌ స్టేషన్లు నిర్మించి, ఒక్కోదానిలో 12 మోటార్లు ఏర్పాటు చేశారు. మొత్తం 8 పంపింగ్‌ స్టేషన్లలో ఒక టీఎంసీ నీటిని ఎత్తిపోయాలంటే సుమారుగా రూ.25-30 కోట్లు విద్యుత్‌ ఖర్చు అవుతుందని ఇంజనీర్లు చెబుతున్నారు. టీడీపీ ప్రభుత్వంలో కొంచెం ఆలస్యమైనా బిల్లులు క్రమం తప్పకుండా చెల్లించేవారు. జగన్‌ ప్రభుత్వం వచ్చాక కరెంటు బిల్లులకు నిధులు మంజూరు చేయడం లేదు. దీంతో బకాయిలు పేరుకుపోయాయని  అధికారులు చెబుతున్నారు. హంద్రీనీవా ప్రాజెక్టులో భాగంగా 2019-20లో 42 టీఎంసీలు, 2020-21లో 37 టీఎంసీలు, 2021-22లో 26.65 టీఎంసీలు కృష్ణా వరద జలాలు ఎత్తిపోశారు. అందుకుగాను 2019-20లో 670.01 కోట్లు, 2020-21లో 834.80 కోట్లు, 2021-22లో 821.39 కోట్లు కలిపి మూడేళ్లలో మొత్తం రూ.2,326.2 కోట్ల విద్యుత్‌ బిల్లులు ప్రభుత్వం చెల్లించలేదు. హంద్రీనీవా ప్రాజెక్టుకు సంబంధించే గాక ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర నీటి పారుదల అభివృద్ధి సంస్థ (ఏపీఎ్‌సఐడీసీ) విద్యుత్‌ బకాయిలను చెల్లించడం లేదు.


ఆర్థిక భారంతో జీతాలు ఆలస్యం  

ప్రభుత్వం విద్యుత్‌ బకాయిలు చెల్లించకపోవడంతో డిస్కమ్‌లపై ఆర్థిక భారం పడుతోంది. సకాలంలో బిల్లులు రానందున విద్యుత్‌ ఉత్పత్తి సంస్థలకు డిస్కమ్‌లు రూ.వేల కోట్లు బకాయి పడ్డాయని ఇంజనీర్లు అంటున్నారు. నిధుల కొరత వల్ల విద్యుత్‌ శాఖ ఉద్యోగులకు సకాలంలో జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడిందని, 13,14వ తేదీల వరకు జీతాలు అందడం లేదని చెబుతున్నారు. తన 29 ఏళ్ల సర్వీ్‌సలో ఇలాంటి పరిస్థితిని ఎప్పుడూ చూడలేదని కర్నూలు జిల్లాకు చెందిన ఓ ఇంజనీర్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ బకాయిలు చెల్లిస్తే నిధుల కొరత తీరుతుందని చెబుతున్నారు. 


నోటీసులు జారీ చేశాం 

37 ప్రభుత్వ విభాగాల నుంచి రూ.3,028.39 కోట్లు విద్యుత్‌ బకాయిలు రావాలి. అందులో హంద్రీనీవా ప్రాజెక్టు ఒక్కటే రూ.2,640.98 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఆయా శాఖలకు నోటీసులు జారీ చేశాం. - కె.శివప్రసాద్‌రెడ్డి, విద్యుత్‌ శాఖ ఎస్‌ఈ, కర్నూలు 


ప్రభుత్వానికి నివేదించాం 

హంద్రీనీవా ప్రాజెక్టు నుంచి కృష్ణా వరద జలాలు ఎత్తిపోయాలంటే ప్రధాన పంపుహౌస్‌ మాల్యాల సహా 8 పంపింగ్‌ స్టేషన్లు పని చేయాలి. మూడేళ్ల నుంచి విద్యుత్‌ బిల్లుల బకాయి రూ.2,640.98 కోట్లు ఉంది. దీనిపై ప్రభుత్వానికి నివేదిక పంపాం. 

- నాగరాజు, సీఈ, హంద్రీనీవా ప్రాజెక్టు 

Updated Date - 2022-05-16T17:44:30+05:30 IST