కేంద్రం 'అబద్ధాల'పై కేసు నమోదు చేయాలి: సంజయ్ రౌత్

ABN , First Publish Date - 2021-07-21T20:38:51+05:30 IST

విడ్ సెకెండ్ వేవ్‌లో ఆక్సిజన్ కొరతతో దేశంలో ఒక్కరు కూడా మరణించలేదని కేంద్రం..

కేంద్రం 'అబద్ధాల'పై కేసు నమోదు చేయాలి: సంజయ్ రౌత్

న్యూఢిల్లీ: కోవిడ్ సెకెండ్ వేవ్‌లో ఆక్సిజన్ కొరతతో దేశంలో ఒక్కరు కూడా మరణించలేదని కేంద్రం అబద్ధాలు చెబుతోందని శివసేన నేత సంజయ్ రౌత్ తప్పుపట్టారు. కేంద్రంపై కేసు నమోదు చేయాలన్నారు. బుధవారంనాడిక్కడ మీడియాతో ఆయన మాట్లాడుతూ, ఆక్సిజన్ కొరతతో తమ ప్రియతములను కోల్పోయిన కుటుంబాలు కేంద్రం చేసిన ప్రకటనతో ఏమైపోతాయని ప్రశ్నించారు. ''నాకు మాట రావడం లేదు. ఆక్సిజన్ దొరక్క తమ కళ్లముందే కుటుంబ సభ్యులను కోల్పోయిన వారి పరిస్థితి కేంద్రం చేసిన ప్రకటనతో ఎలా ఉంటుంది? ప్రభుత్వంపై కేసు పెట్టాలి. వాళ్లు అబద్ధాలు ఆడుతున్నారు'' అని సంజయ్ రౌత్ అన్నారు.


కోవిడ్ పేషెట్లు ఆక్సిజన్ కొరతతో రోడ్లు, ఆసుపత్రుల్లో పెద్ద సంఖ్యలో చనిపోవడంపై కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ మంగళవారంనాడు రాజ్యసభలో ప్రశ్నించారు. దీనికి కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్ సమాధానమిస్తూ, సెకెండ్ వేవ్ సందర్భంగా ఆక్సిజన్ కొరతతో ఒక్కరు కూడా ప్రాణాలు కోల్పోయినట్టు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు తమ నివేదకలో పేర్కొనలేదని అన్నారు. ఆరోగ్యం అనేది రాష్ట్ర పరిధిలోకి వచ్చే అంశమని, కేసులు, మరణాలకు సంబంధించి ఎప్పటికప్పుడు రాష్ట్రాలు కేంద్రానికి రిపోర్ట్ చేస్తుంటాయని లిఖిత పూర్వక సమాధానంలో మంత్రి తెలిపారు.


'పెగాసస్'పై దాపరికాలు లేనప్పుడు భయం ఎందుకు?

కాగా, పెగాసస్ నిఘాపై సంజయ్ రౌత్‌ను ప్రశ్నించినప్పుడు.. ఏదీ దాచాల్సిన పనిలేనప్పుడు ప్రభుత్వం భయపడాల్సిన పనేముందని అన్నారు. దీనిపై సంయుక్త పార్లమెంటరీ కమిటీకి, సుప్రీంకోర్టు జోక్యానికి విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయని అన్నారు. రవిశంకర్ ప్రసాద్ విపక్షంలో ఉంటే ఆయన కూడా ఇదే రకమైన డిమాండ్ చేసి ఉండేవారని, నిజమైతే బయటకు రావాలని సంజయ్ రౌత్ అన్నారు. దాపరికాలు లేనప్పుడు భయపడటమెందుకని కేంద్రాన్ని ఆయన ప్రశ్నించారు.

Updated Date - 2021-07-21T20:38:51+05:30 IST