టిడ్కో.. గూడు.. గోడు!

ABN , First Publish Date - 2022-08-01T08:53:34+05:30 IST

ప్రభుత్వాలు గృహ పథకాలు అమలుచేసి పేదలకు వాటిని అందుబాటులోకి తీసుకురావడానికి ప్రణాళికలు వేసుకుని పనిచేస్తాయి. గత ప్రభుత్వాలు ఇలాగే చేశాయి. వేరే ప్రభుత్వాలు ప్రారంభించాయనే కారణంగా జరుగుతున్న పనులు ..

టిడ్కో.. గూడు.. గోడు!

పూర్తిచేయరు...అప్పగించరు..


ఇవి ప్రకాశం జిల్లా ఒంగోలు సమీపంలోని చింతల వద్ద టీడీపీ ప్రభుత్వ హయాంలో నిర్మించిన టిడ్కో ఇళ్లు. అప్పట్లో రూ.80 కోట్లు వెచ్చించి వీటిని నిర్మించారు. దాదాపు 90% పనులు పూర్తయ్యాయి. ఇక గృహ ప్రవేశాలే తరువాయి అనుకుంటున్న తరుణంలో వచ్చిన వైసీపీ ప్రభుత్వం వీటి గురించి పట్టించుకోలేదు. ఫలితం.. ఇప్పుడు ఆ ఇళ్లు పిచ్చిమొక్కలు, ఊడిపోయిన తలుపులతో ఇలా నీళ్లలో దర్శనమిస్తున్నాయి.


(ఆంధ్రజ్యోతి - న్యూస్‌ నెట్‌వర్క్‌)

ప్రభుత్వాలు గృహ పథకాలు అమలుచేసి పేదలకు వాటిని అందుబాటులోకి తీసుకురావడానికి ప్రణాళికలు వేసుకుని పనిచేస్తాయి. గత ప్రభుత్వాలు ఇలాగే చేశాయి. వేరే ప్రభుత్వాలు ప్రారంభించాయనే కారణంగా జరుగుతున్న పనులు ఆపివేసి పేదలకు అన్యాయం చేయాలని ఆలోచించలేదు. వైసీపీ కూడా అదే బాట పడుతుందని భావించిన టిడ్కో లబ్ధిదారులకు జగన్‌ సర్కారు ఇన్నేళ్లుగా చుక్కలు చూపిస్తోంది. స్వర్గం కావాల్సిన గృహాన్ని నరకంగా మార్చివేసింది. ఫలితంగా కూడబెట్టిన ప్రతి పైసాను డిపాజిట్లుగా కట్టిన పేద, మధ్యతరగతికి ఎదురుచూపుల ముళ్లే మూడేళ్లుగా గుచ్చుకుంటున్నాయి. పంపిణికీ సిద్ధంగా అపార్టుమెంట్లు పార్టీ రంగులు పులుముకుంటే.. ఒకదశ వరకు వచ్చి ప్రభుత్వం మారడంతోనే ఆగిపోయిన నిర్మాణాలు ‘భీతి’ బంగ్లాలను తలపిస్తున్నాయి. తుప్పుబట్టిన కట్టడాలు... అల్లుకుపోయిన పిచ్చిమొక్కలతో పాడుబడిన టిడ్కో ఇళ్ల పరిసరాల్లో పగలే పందులు స్వైర విహారం చేసేస్తున్నాయి!


వేలల్లో ఆపేశారు.. 

టీడీపీ ప్రభుత్వం పూర్తిచేస్తే, చిన్నచిన్న మరమ్మతులు చేసి తాళంచెవులు పేదలకు ఇవ్వడానికి జగన్‌ సర్కారుకు చేతులు రాని ఫలితం ఇది. ఒక్క పల్నాడు జిల్లాలోనే రమారమీ పదివేల ఇళ్లు నిరుపయోగంగా పడిఉన్నాయి. రోడ్డు కూడా నిర్మాణమై మూడేళ్లుగా గృహప్రవేశాలకు ఎదురుచూస్తున్న నరసరావుపేటలోని టిడ్కో అపార్టుమెంట్లు... 


కాలువ కాదండోయ్‌..!

రెండు అపార్టుమెంట్ల మధ్య నుంచి పారుతున్నది కాలువ కాదండోయ్‌. అది నిజంగా రోడ్డే! కోనసీమ జిల్లా అల్లవరం మండలం బోడసకుర్రులో టిడ్కో ఇళ్లు కట్టి డ్రైనేజీ వసతి లేకుండా నిరుపయోగంగా వదిలేయడంతో నీరంతా నిలిచిపోయి ఈ దుస్థితి తలెత్తింది. 


పందుల స్వైర విహారం

కాకినాడలో వైసీపీ ప్రభుత్వం టిడ్కో ఇళ్లను ఆపకపోయి ఉంటే మనుషుల సంచారంతో సందడి నెలకుని ఉండేది. మూడేళ్లుగా పంపిణీ చేయకపోవడంతో పందులు ఆ పరిసరాల్లో స్వైర విహారం చేస్తున్నాయి. గేట్లు విరిగిపోయి... కిటికీలు ఊడిపోయి శిథిలావస్థకు చేరుకోవడంతో ఇటువైపు రావడానికే జనం భయపడుతున్నారు. 


ఎదురుచూపులే...

శ్రీకాకుళంలో అరకొరగా పనులు జరిగిన టిడ్కో ఇళ్లను నిన్నమొన్నటి వరకు కరోనా రోగులకు క్వారంటైన్‌ కేంద్రాలుగా వినియోగించారు. ఈ ఇళ్లలో ఇంకా గచ్చులు కూడా నిర్మించలేదు. అత్యధిక ఇళ్లు బేస్‌మెంట్‌ స్థాయిలోనే ఉన్నాయి. ఈ ఏడాదైనా అప్పగిస్తారా అని లబ్ధిదారులు ఆశగా ఎదురుచూస్తున్నారు. 


గడప వరకు వచ్చినా..

చంద్రబాబు ప్రభుత్వం తెనాలి-పెదరావూరు మార్గంలోని వైకుంఠపురం సమీపంలో 1050 గృహాలు నిర్మించి అన్ని వసతులతో సిద్ధం చేసి లబ్దిదారులకు కేటాయించింది. ప్రభుత్వం మారడంతో వాటిని పట్టించుకోవడం మానేశారు. పిచ్చి మొక్కలు మొలుస్తూ దుమ్ముధూళితో నిండిపోయి శిథిలావస్థకు చేరుకున్నాయి. 


మూడేళ్లకు మన్ను చదును

మూడేళ్లు ముప్పుతిప్పలు పెట్టి ఎట్టకేలకు కర్నూలు జిల్లా జగన్నాథగట్టు మీద పంపిణీకి టిడ్కో ఇళ్లను సిద్ధం చేస్తున్నారు. అపార్టుమెంట్‌ల మధ్య ఎర్రమన్నును చదువుచేస్తూ తాత్కాలిక దారిని నిర్మించేందుకు అధికారులు తిప్పలు పడుతున్నారు. 


ఈ కంపే కంచె అయింది.. 

ఇవీ టిడ్కో ఇళ్లే. మొదటి విడతలో కడప నగరంలో 992 గృహాల నిర్మాణం చేపట్టారు. భవనాలు పూర్తయ్యాయి. డ్రైనేజీ, రోడ్లు, నీటి వసతి మాత్రం లేవు. కరెంటు వస్తువులు, కిటికీలు, నిర్మాణానికి వాడిన మెటీరియల్‌ను కొందరు ఎత్తుకుపోతుండటంతో కారిడార్‌లో కంపచెట్లు ఇలా అడ్డంగా వేశారు. 


ఇంకా పునాదుల్లోనే..

పార్వతీపురంలోని అడ్డాపుశీల వద్ద అర్ధంతరంగా టిడ్కో గృహ నిర్మాణ సముదాయాలు నిలిచిపోవడంతో తుప్పుపట్టి భీతిగొలుపుతున్న నిర్మాణాలు. సుమారు 1488 లబ్ధిదారుల నుంచి సుమారు రూ.2.34 కోట్ల విలువైన డీడీలను గత ప్రభుత్వం కట్టించుకుంది. ఇంతలో ప్రభుత్వం మారడంతో సీన్‌ మారి.. టిడ్కో నిర్మాణాలు పునాదుల స్థాయిలోనే నిలిచిపోయాయి. 


తీగలు అల్లుకుని...

ఏలూరు సమీపంలోని పోణంగిలో నిర్మించిన టిడ్కో ఇళ్లు ఇవి. లబ్ధిదారులకు సకాలంలో ఇవ్వకపోవడంతో కోట్లాది రూపాయలు ఖర్చు చేసి నిర్మించిన అపార్ట్‌మెంట్‌తో పోటీ పడుతూ తీగజాతి మొక్కలు పైపైకి ఎగబాకుతున్నాయి. 




రంగుల..కల

పంపిణీకి సిద్ధంగా ఉన్న టిడ్కో ఇళ్లను వైసీపీ ప్రభుత్వం తన పార్టీ రంగులతో ముస్తాబు చేసింది. రంగులపై కోర్టు వేసిన మొట్టికాయలు కూడా అధికారుల తీరును మార్చలేదు. అప్పుడూ ఇప్పుడూ అంటూ పంపిణీని అధికారులు వాయిదా వేస్తున్నారు. చూడబోతే.. ఎన్నికలు సమీపిస్తేగానీ ఈ గృహాలను అందుకోవాలనే లబ్ధిదారుల కల నెరవేరేట్టు లేదు.

Updated Date - 2022-08-01T08:53:34+05:30 IST