సర్కారు ఆసుపత్రులు సూపర్‌!

ABN , First Publish Date - 2021-10-12T04:58:45+05:30 IST

నేను రానుబిడ్డో సర్కారు దవాఖానాకు అని ఒకప్పుడు పాడుకునేవారు.

సర్కారు ఆసుపత్రులు సూపర్‌!

  • దవాఖానాల్లో పెరిగిన ప్రసవాలు 
  • కాన్పుల్లో ‘మేడ్చల్‌’ బెస్ట్‌
  • వ్యాక్సినేషన్‌లో వికారాబాద్‌, రంగారెడ్డి భేష్‌ 
  • జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వేలో వెల్లడి


నేను రానుబిడ్డో సర్కారు దవాఖానాకు అని ఒకప్పుడు పాడుకునేవారు. అప్పట్లో అక్కడ రోగులకు సౌకర్యాలు అందేవి కావు. దీంతో అక్కడి అసౌకర్యాలపై ఈ పాటను పాడుకునేవారు. కానీ, ఇప్పుడు పరిస్థితి మారింది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని ప్రభుత్వ దవాఖానాలు వివిధ సేవల్లో భేష్‌ అనిపించుకుంటు న్నాయి. గతంలో కాన్పుకోసం ప్రైవేటు ఆసుపత్రులకు బారులు తీరేవారు. కానీ, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో ఆ పరిస్థితి మారింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య భారీగా పెరుగుతోంది.  


రంగారెడ్డి (ఆంధ్రజ్యోతి): మాత, శిశు సంరక్షణ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న చర్యలు మంచి ఫలితాలనిస్తున్నాయి. ముఖ్యంగా ప్రసవాలు ఆసుపత్రుల్లో జరిగే విధంగా తీసుకుంటున్న చర్యల వల్ల నవజాత శిశువులు, బాలింతల మరణాలు కూడా తగ్గుముఖం పడుతున్నాయి. అలాగే పిల్లలకు వి`విధ టీకాల విషయంలో కూడా గణనీయ పురోగతి కనిపిస్తోంది. తాజాగా కేంద్రం విడుదల చేసిన జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే వివరాల్లో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. ప్రసవానంతరం మాత, శిశు సంరక్షణ గతంకంటే మెరుగైనట్లు వెల్లడైంది.  ఆసుపత్రుల్లో కాన్పులు పెంచేందుకు ప్రభుత్వాలు ఇటీవల కాలంలో అనేక చర్యలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వం మాత, శిశు సంరక్షణ కోసం కేసీఆర్‌ కిట్లు పంపిణీ చేస్తున్న సంగతి విదితమే. గర్భిణులకు ఎప్పటికప్పుడు ఆరోగ్య పరీక్షలు నిర్వహించడమే కాక వారికి కావాల్సిన పౌష్టికాహారం అందించడంతోపాటు ప్రసవానంతరం తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఎప్పటికప్పుడు వైద్యసిబ్బంది వివరిస్తున్నారు. ప్రజల్లో అవగాహన పెరిగింది. దీంతో ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య గణనీయంగా పెరిగింది. వైద్యుల పర్యవేక్షణలో కాన్పులు అవుతుండడంతో మాత, శిశుసంరక్షణకు తగిన వైద్యం అందుబాటులోకి వస్తోంది. రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం ద్వారా ముందుగానే జన్మించిన శిశువులకు (నవజాత) చికిత్స అందించేందుకు ప్రత్యేక టీములను ఏర్పాటు చేశారు. దీంతో నవజాత శిశువులు, బాలింతల మరణాలు గణనీయంగా తగ్గిపోతున్నాయి. రంగారెడ్డి జిల్లాలో ప్రసవానంతరం పిల్లల సంరక్షణ 85.80శాతంగా నమోదైంది.


ఆసుపత్రుల్లో ప్రసవాలు

జిల్లా              శాతం

రంగారెడ్డి జిల్లా  97.20 (20వ స్థానం)

మేడ్చల్‌ 98.00 (10వస్థానం)

వికారాబాద్‌  95.00 (26వస్థానం)

పిల్లల వ్యాక్సినేషన్‌

వికారాబాద్‌ జిల్లా 86.00 (4వస్థానం)

రంగారెడ్డి జిల్లా  85.80 (8వ స్థానం)

మేడ్చల్‌-మల్కాజిగిరి  76.00  (20వ స్థానం)

Updated Date - 2021-10-12T04:58:45+05:30 IST