అప్పుల్లోకి నెట్టి అమ్మకానికి!?

ABN , First Publish Date - 2021-12-30T07:53:52+05:30 IST

ఏపీ జెన్‌కో, పవర్‌ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌ (పీడీసీ)... ప్రభుత్వ రంగంలోని విద్యుదుత్పత్తి సంస్థలు ఇవే! ఈ రెండు సంస్థల నెత్తిన ఉన్న రుణ భారం...

అప్పుల్లోకి నెట్టి అమ్మకానికి!?

  • జెన్‌కో పవర్‌ ప్లాంట్లకు సర్కారు ఉరి
  • దివాలా దిశగా జెన్‌కో, పీడీసీలు
  • నష్టాల పేరు చెప్పి ప్లాంట్లను అమ్మేయడమే లక్ష్యం!
  • జెన్‌కో, పీడీసీ నెత్తిన రూ.35 వేల కోట్ల రుణ భారం
  • చెల్లింపులకు ప్రతినెలా రూ.400 కోట్లు అవసరం
  • జెన్‌కోకు సర్కారు బాకీ రూ.13,657 కోట్లు
  • మరో రూ.6 వేల కోట్లు అప్పు తెచ్చుకుని సొంతానికి!
  • రోజువారీ ఖర్చులకూ డబ్బుల్లేక జెన్‌కో విలవిల
  • ఇతర కార్పొరేషన్ల బాకీలు కడుతున్న ప్రభుత్వం
  • జెన్‌కోకు మాత్రం పైసా విదల్చని రాష్ట్ర  సర్కారు


కుక్కను వదిలించుకోవాలంటే... దానిపై పిచ్చిది అనే ముద్ర వేయాలి. ఒక ప్రభుత్వ రంగ సంస్థను ప్రైవేటు పరం చేయాలంటే... దానిని అప్పుల పాల్జేసి, కష్టాల్లోకి నెట్టేసి, సొంత కాళ్లపై నిలబడలేని పరిస్థితి నెలకొందంటూ విషాద రాగాలు తీసి, ఆ తర్వాత నచ్చిన వాళ్లకు కట్టబెట్టేయాలి! రాష్ట్రంలో జెన్‌కో ఆధ్వర్యంలో నడుస్తున్న విద్యుదుత్పత్తి కేంద్రాల విషయంలోనూ ఇదే జరుగుతోందా? ‘అస్మదీయుల కోసం’ జెన్‌కోను చంపేసే పథకం అమలవుతోందా?


(అమరావతి - ఆంధ్రజ్యోతి): ఏపీ జెన్‌కో, పవర్‌ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌ (పీడీసీ)... ప్రభుత్వ రంగంలోని విద్యుదుత్పత్తి సంస్థలు ఇవే! ఈ రెండు సంస్థల నెత్తిన ఉన్న రుణ భారం... రూ.35వేల కోట్లు! ఎప్పటికప్పుడు వడ్డీ, అసలు వాయిదాలు చెల్లించకపోవడంతో కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలైన పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌, గ్రామీణ విద్యుదీకరణ సంస్థ (ఆర్‌ఈసీ) ఉన్నతాధికారులు ఇటీవల నేరుగా విజయవాడకు వచ్చారు. అప్పు చెల్లించకపోతే... ‘డిఫాల్టర్‌’గా ప్రకటిస్తామని హెచ్చరించారు. ఇలా... ఏపీ జెన్‌కో ‘దివాలా’ అంచుల దాకా వెళ్లింది. ఈ పాపంలో ప్రధాన పాత్ర మరెవరిదో కాదు! అచ్చంగా... రాష్ట్ర ప్రభుత్వానిదే! ఎందుకంటే... జెన్‌కోకు సంబంధించిన సుమారు రూ.20వేల కోట్లను జగన్‌ ప్రభుత్వం చెల్లించకుండా ఆపేసింది. అందులో నయా పైసా కూడా తిరిగివ్వడం లేదు. దీంతో జెన్‌కోలో ‘మనీ రొటేషన్‌’ ఆగిపోయింది. అప్పుల ఊబిలో కూరుకుపోయింది. బ్యాంకులకు, ఇతర ఆర్థిక సంస్థలకు నెలవారీ వాయిదాలు కట్టలేక చేతులెత్తేసింది.


అప్పుడు అంతా బాగానే...

ఆర్‌ఈసీ, పీఎ్‌ఫసీలకు 6 నెలల కిందటి వరకు చెల్లింపులు సక్రమంగానే జరిగేవి. ఆ తర్వాత సీన్‌ మారిపోయింది. జెన్‌కో, పీడీసీలను ప్రభుత్వం ఎన్‌పీఏ ముంగిట వరకు తెచ్చి... చివరి నిమిషంలో బయటపడేసింది. ఇప్పుడు పూర్తిగా వదిలేసింది. ప్రతినెలా రూ.400 కోట్లు చెల్లిస్తేనే జెన్‌కో, పీడీసీ భద్రంగా ఉంటాయి. లేదంటే... అంతే సంగతులు! జెన్‌కో పరిధిలో థర్మల్‌, హైడల్‌తోపాటు కొంతమేరకు సంప్రదాయేతర విద్యుదుత్పత్తి కేంద్రాలు కూడా ఉన్నాయి. ఈ ప్లాంట్ల విలువ వేల కోట్లు ఉంటుంది. జెన్‌కోకు అంతే స్థాయిలో ఆస్తులూ ఉన్నాయి. పవర్‌ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌ కింద కూడా విలువైన ఆస్తులున్నాయి. ఈ సంస్థ పెయిడ్‌ అప్‌ క్యాపిటల్‌ రూ.2000 కోట్లు ఉంది. ఆథరైజ్డ్‌ క్యాపిటల్‌ రూ.4,000 కోట్లు. ఇది కూడా భారీ సంస్థ. ఇంతటి కీలకమైన సంస్థలను జగన్‌ సర్కారు కావాలనే నిర్వీర్యం చేస్తోందని, అప్పుల ఊబిలోకి నెట్టి, వాటి రోజువారీ కార్యకలాపాలకు కూడా డబ్బుల్లేని పరిస్థితులు సృష్టించి... నష్టాలు, ఆస్తులకు మించి అప్పుల పేరుతో వాటిని అమ్మేయాలన్న వ్యూహం కనిపిస్తోందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.


ఇతర కార్పొరేషన్లకు చేయూత 

రాష్ట్రంలో 29 కార్పొరేషన్లున్నాయి. ఈ కార్పొరేషన్లకు గ్యారంటీ, నాన్‌ గ్యారంటీ అప్పులు కలిపి మొత్తం రూ.2 లక్షల కోట్లున్నాయి. ఇందులో... రూ.10,000 కోట్లు మినహా మిగతా అప్పులన్నీ ప్రభుత్వమే వాడుకుంటోంది. అందుకే వాటి అసలు, వడ్డీ కింద కార్పొరేషన్లకు గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ రూపంలో తానే నిధులు మళ్లిస్తోంది. ఆయా కార్పొరేషన్ల అప్పుల కిస్తీలు, వడ్డీల కోసం ప్రతినెలా రూ.1800 కోట్లు కడుతోంది. ఆర్‌బీఐ ద్వారా తెచ్చే అప్పుల అసలు, వడ్డీని ప్రతి నెలా దాదాపు రూ.3,500 కోట్ల వరకు కూడా చెల్లిస్తోంది. చివరికి... విద్యుత్‌ రంగానికే చెందిన ట్రాన్స్‌కో, డిస్కమ్‌ల అప్పులు, వడ్డీలను కూడా చెల్లిస్తోంది. కానీ... కీలకమైన జెన్‌కో, పవర్‌ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌లను మాత్రం వదిలేసింది. పైగా... జెన్‌కోకు బకాయి పడిన రూ.20వేల కోట్లను చెల్లించకుండా మరింత ఇక్కట్లలోకి నెట్టేసింది. జెన్‌కో తన సొంత ఖర్చుతో విద్యుత్‌ ఉత్పత్తి చేసి ప్రభుత్వానికి విక్రయించింది. ఆ మొత్తం రూ.13,567 కోట్లు. దీనిని ప్రభుత్వం జెన్‌కోకు చెల్లించడంలేదు. మరోవైపు... రూ.6,000 కోట్లను జెన్‌కో పేరిట అప్పుగా తెచ్చుకుని, సొంతానికి వాడుకుంది. అంటే... జెన్‌కో సొమ్ము రూ.19,567 కోట్లు సర్కారు వద్ద ఇరుక్కుపోయాయి. దీంతో రోజువారీ ఖర్చులకూ డబ్బుల్లేక జెన్‌కో ఆర్థిక ఊబిలో కూరుకుపోయింది. జెన్‌కో, పీడీసీలను పూర్తిగా ముంచేసి, వాటి పరిధిలోని విద్యుదుత్పత్తి ప్లాంట్లను తెగనమ్మేందుకే ప్రభుత్వం ఇలా చేస్తోందని సీనియర్‌ అధికారులు అనుమానిస్తున్నారు. 


నిర్మాణంలో ఉన్న ప్లాంట్లు

రూ. 7586.67 కోట్లతో నార్ల తాతారావు స్టేజ్‌-5 (800 మెగావాట్లు)

రూ.4814.60 కోట్లతో పోలవరం జల విద్యుత్కేంద్రం. (960 మెగావాట్లు)

దామోదరం సంజీవయ్య కృష్ణపట్నం (800 మెగావాట్లు)


అప్పుల కుప్పలు..

ఆర్‌ఈసీ, పీఎ్‌ఫసీలకు జెన్‌కో, పీడీసీలు రూ.35వేల కోట్లు బాకీ పడ్డాయి. జెన్‌కో నుంచి కరెంటు కొంటున్న డిస్కమ్‌లు ఎప్పటికప్పుడు డబ్బులు తిరిగి చెల్లించాలి. కానీ... అలా జరగడంలేదు.

వ్యవసాయానికి ఉచిత విద్యుత్తు, ఇతర సబ్సిడీలు, రాయితీలకు సంబంధించిన సొమ్ములు సర్కారు నుంచి రావడంలేదని డిస్కమ్‌లు వాపోతున్నాయి. ఈ మొత్తాన్ని రాష్ట్ర సర్కారు నుంచి రాబట్టుకోవాలంటూ జెన్‌కోకు డిస్కమ్‌లు ఉచిత సలహా ఇస్తున్నాయి.

కేంద్ర ఆర్థిక సంస్థలకు జెన్‌కో ఇప్పటికిప్పుడు రూ.2000 కోట్లు చెల్లించాల్సి ఉంది. నెలవారీ వాయిదాలను చెల్లించాలంటూ ఏపీ జెన్‌కోపై  కేంద్ర ఆర్థిక సంస్థలు ఒత్తిడి పెంచుతున్నాయి. ప్రతినెలా లేఖలు పంపుతున్నాయి.

ఆర్‌ఈసీ, పీఎ్‌ఫసీ సీఎండీలు ఇటీవల నేరుగా రాష్ట్రానికి వచ్చారు. బకాయిలు చెల్లించకపోతే జెన్‌కోను ‘డిఫాల్టర్‌’గా ప్రకటిస్తామని హెచ్చరించారు. 

విద్యుత్తు కొనుగోళ్ల విషయంలో కేంద్ర విద్యుదుత్పత్తి సంస్థ ఎన్‌టీపీసీకి కేంద్ర ప్రభుత్వం అండగా నిలుస్తోంది. ఎన్‌టీపీసీ నుంచి  కొనుగోళ్లు చేసిన విద్యుత్తుకు వెనువెంటనే చెల్లింపులు జరపాలంటూ రాష్ట్రాలను కేంద్ర ఇంధన మంత్రిత్వశాఖ ఆదేశించింది. దీంతో .. ఎన్‌టీపీసీ నుంచి కొనుగోలు చేసిన విద్యుత్తునకు వెంటనే చెల్లింపులు జరిగిపోతున్నాయి. జెన్‌కోకు మాత్రం అలాంటి ఆర్థిక భరోసా లభించడంలేదు.

డిస్కమ్‌ల నుంచి బిల్లులు రావడం లేదని, రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ మొత్తం చెల్లించడంలేదని ఆర్థిక సంస్థల ఎదుట ఇంధన శాఖ చేసిన వాదనలు చెల్లడంలేదు. ‘మీ తిప్పలు మీరు పడండి. మా అప్పులు మాకు కట్టండి’ అని ఆర్‌ఈసీ, పీఎ్‌ఫసీ తేల్చి చెబుతున్నాయి.


వదిలించుకోవడమే లక్ష్యమా?

దాదాపు 29 వేర్వేరు కార్పొరేషన్లకు సంబంధించి రూ.2 లక్షల కోట్ల అప్పులకు సంబంధించిన వడ్డీని, అసలును ప్రతి నెలా క్రమం తప్పకుండా చెల్లిస్తున్న ప్రభుత్వం జెన్‌కో, పీడీసీ అప్పులను మాత్రం ఎందుకు కట్టడం లేదు? 

ప్రభుత్వం జెన్‌కోకు ఎప్పటికప్పుడు నిధులు మంజూరయ్యేలా ప్రత్యేక యంత్రాంగాన్ని ఎందుకు ఏర్పాటు చేయలేదు?

కేంద్ర ఆర్థిక సంస్థలు ఏపీ జెన్‌కోను నిరర్ధక ఆస్తిగా ప్రకటిస్తామంటూ నోటీసులు ఇస్తుంటే ఇంధన శాఖ ఎందుకు ప్రతిష్ఠకు భంగం కలుగుతుందని ఎందుకు భావించడం లేదు? 

కేంద్ర ఆర్థిక సంస్థల బకాయిలను రాష్ట్రానికి ఇవ్వాల్సిన నిధుల నుంచి నేరుగా ఆర్‌బీఐ ద్వారా ఆర్‌ఈసీ, పీఎ్‌ఫసీలకు జమ చేసేలా కేంద్రం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు?

Updated Date - 2021-12-30T07:53:52+05:30 IST