పోస్టింగ్‌లు ఎప్పుడో?

ABN , First Publish Date - 2020-07-12T10:16:59+05:30 IST

ఉపాధ్యాయ ఉద్యో గార్థులతో ప్రభుత్వం ఆటలాడుతోంది. ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగం సాధించాలన్న కసితో చదివి,

పోస్టింగ్‌లు ఎప్పుడో?

ఎదరుచూస్తున్న డీఎస్సీ-2018 ఎస్‌జీటీ అభ్యర్థులు

కోర్టుల పేరుతో పోస్టింగ్‌లో జాప్యం 

వందలాది మందికి తప్పని నిరాశ

నిరుద్యోగులతో ప్రభుత్వం ఆటలు

స్పెషల్‌ డీఎస్సీ-2019 వారికి మాత్రం ఇటీవలే పోస్టింగ్‌


అనంతపురం విద్య, జూలై 11: ఉపాధ్యాయ ఉద్యో గార్థులతో ప్రభుత్వం ఆటలాడుతోంది. ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగం  సాధించాలన్న కసితో చదివి, ఎంపికైనా పోస్టింగ్‌ కోసం ఎదురుచూపులు తప్పట్లేదు.  దీంతో ఉపాధి కోసం ఉపాధి హామీ, ఇతర కూలి పనులకు వెళ్లాల్సిన దుస్థితి వారికి దాపురించింది. ఇదీ డీఎస్సీ- 2018లో ఎంపికైన ఎస్‌జీటీ తెలుగు, ఇతర అభ్యర్థుల దయనీయ పరిస్థితి.  తమను అలాగే ఉంచి ఇటీవల  స్పె షల్‌ డీఎస్సీ-2019 అభ్యర్థులకు పోస్టింగ్‌ ఇవ్వటంపె డీఎస్సీ - 2018 అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కోర్టు పే రు చెప్పి జాప్యం చేయటం సబబుకాదంటూ మండి పడుతున్నారు. మంత్రులు, అధికారులను కలిసినా తమకు పోస్టింగ్‌ ఇవ్వకుండా డీఎస్సీ-2019 వారికి ఇవ్వటం ఏంటని ప్రభుత్వ వైఖరిపై అసహనం వ్యక్తం చేస్తున్నారు.


స్పెషల్‌ డీఎస్సీ వారికి వరం..

స్పెషల్‌ డీఎస్సీ-2019 వారికి ఇటీవలే పోస్టింగ్‌ ఇచ్చారు. 55 పోస్టులను నోటిఫై చేసి, పరీక్షలు నిర్వహించగా 237 మంది రాశారు. వీరిలో 65 మంది క్వాలిఫై అయ్యారు. 46 మంది ప్రొవిజినల్‌గా ఎంపికయ్యారు. కరోనా వల్ల అన్నీ రద్దు చేస్తున్న నేపథ్యంలో ఐఈఆర్టీలు, ఇతరులు కోర్టులను ఆశ్రయిస్తారంటూ ఆగమేఘాల మీద ఎంపికైన అభ్యర్థులకు ఇటీవల సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ నిర్వహించారు. ఆ మరుసటి రోజే కౌన్సెలింగ్‌ నిర్వహించి, 37 మందికి నియామక ఉత్తర్వులు జారీ చేశారు. వీరి కంటే ముందే  పరీక్షలు రాసి, ఎంపికైన డీఎస్సీ-2018 అభ్యర్థులకు మాత్రం నేటికీ నిరాశ తప్పట్లేదు.


426 మంది ఎదురుచూపులు

 డీఎస్సీ-2018లో జిల్లాలో 602 పోస్టులు నోటిఫై చేశా రు. గతేడాది జనవరిలో పరీక్షలు నిర్వహించి ఫిబ్రవరిలో మెరిట్‌ లిస్టు విడుదల చేశారు. పలు కారణాలతో భర్తీ ప్రక్రియకు బ్రేక్‌ పడుతూ వచ్చింది. అదే ఏడాది డిసెంబరులో ప్రొవిజినల్‌గా ఎంపికైన వారికి సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ నిర్వహించారు. ఇతర జాబితాలు విడుదల చేయలేదు. వారికి ఎలాంటి వెరిఫికేషన్‌ చేయలేదు. ఈ నోటిఫికేషన్‌లో అత్యధికంగా ఎస్‌జీటీ తెలుగు 377, పీఈటీ 29, ఎల్పీ (తెలుగు) 16, స్కూల్‌ అసిస్టెంట్‌ (తెలుగు) 4 పోస్టులు భర్తీ చేయాల్సి ఉంది. ఇదే డీఎస్సీలో తక్కువ పోస్టులున్న పలు స్కూల్‌ అసిస్టెంట్‌ కేటగిరీ పోస్టులను భర్తీ చేశారు. అత్యధికంగా ఉన్న ఎస్‌జీటీ పోస్టులను కోర్టు కేసులు ఉన్నాయంటూ పెండింగ్‌లో ఉంచారు. విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌, ఇతర విద్యాశాఖ ఉన్నతాధికారులను కలిసినా బాధిత అభ్యర్థులకు తీపి కబురు అందలేదు.


కరువు పనికి వెళ్తున్నా: మహేష్‌, 205వ ర్యాంకర్‌

మాది శింగనమల మండలం సోదనపల్లి. డీఎస్సీ-2012లో ఒకటిన్నర మార్కులు, డీఎస్సీ-2014లో ఒక మార్కు తేడాతో ఉద్యోగం కోల్పోయా. కసిగా చదివి డీఎస్సీ-2018లో విజయం సాధించా. జిల్లాస్థాయిలో 205వ ర్యాంకు సాధించా. వెరిఫికేషన్‌ పూర్తయినా పోస్టింగ్‌ ఇవ్వకపోవటంతో తల్లిదండ్రులకు ఆసరాగా ఉపాధి పనికి వెళ్లాల్సి వస్తోంది. కష్టపడి చదివి, ర్యాంకు సాధించినా ఉపయోగం లేకుండా పోతుందేమోనన్న భయం వెంటాడుతోంది. ప్రభుత్వం మా బాధలు అర్థం చేసుకుని, వెంటనే భర్తీ ప్రక్రియ చేపట్టాలి.


మానసికంగా కుంగిపోతున్నాం:శోభారాణి, 29వ ర్యాంకర్‌

మాది గుడిబండ మండలం బైరేపల్లి. అమ్మనాన్నలు రైతులు. డీఎస్సీ-2018లో 29వ ర్యాంకు సాధించా. ధ్రువ పత్రాల పరిశీలన ముగిసి, ఏడు నెలలవుతోంది. కోర్టు కేసుల కారణం చూపి, నియామక పత్రాలు ఇవ్వలేదు. మా మిత్రులు కొందరు ఇప్పటికే ఉద్యోగాల్లో చేరారు. మేము ఎంపికైనా పోస్టింగ్‌ దక్కక మానసికంగా కుంగిపోతున్నాం. పోస్టింగ్‌ ఇచ్చి, ఆదుకోవాలి.


వెరిఫికేషన్‌ పూర్తయినా ఎదురుచూపులే:భారతి, 262 ర్యాంకర్‌

నేను డీఎస్సీ-2018లో ఎస్‌జీటీ తెలుగు అభ్యర్థిని. జిల్లా స్థాయిలో 262వ ర్యాంకు సాధించా. డీఎస్సీ రాసి కూడా ఏడాదిన్నర దాటింది. సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ పూర్తి చేశారు. ఏవో కారణాలు చూపుతూ భర్తీ ప్రక్రియను ముందుకు కదల్చట్లేదు. ప్రభుత్వం మాకు వెంటనే పోస్టింగ్‌ ఇస్తే, చదివిన కష్టానికి ఫలితం దక్కుతుంది.


మా కష్టం తొలగిందనుకున్నా:క్రాంతి, 252 ర్యాంకర్‌, ధర్మవరం

నేను 2016 నుంచి ప్రిపేర్‌ అయ్యా. నాన్న మగ్గం నేస్తుండేవారు. 2016లో ఆయన చనిపోయారు. అమ్మ కూలి పనిచేస్తూ నన్ను కోచింగ్‌కు పంపింది.  డీఎస్సీ-2018లో 252 ర్యాంకు వచ్చింది. మా కష్టాలు తీరుతాయని అనుకున్నా. పలు కారణాలతో పోస్టింగ్‌ ఇవ్వ లేదు. పనులు లేవు, ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాం. ప్రభుత్వం పోస్టింగ్‌లు  ఇచ్చి, మాకు న్యాయం చేయాలి.

Updated Date - 2020-07-12T10:16:59+05:30 IST