ప్లాట్స్‌ ఫర్‌ సేల్‌

ABN , First Publish Date - 2022-06-30T05:51:16+05:30 IST

ప్లాట్స్‌ ఫర్‌ సేల్‌

ప్లాట్స్‌ ఫర్‌ సేల్‌
ఇబ్రహీంపట్నంలోని ట్రక్‌ టెర్మినల్‌

నాటి వీజీటీఎం-ఉడా స్థలాలపై సీఆర్‌డీఏ కన్ను

ప్రజా ఉపయోగాలను పక్కనపెట్టి అమ్మకానికి.. 

అమరావతి టౌన్‌షిప్‌లోని అంతర్భాగ స్థలాలు హాంఫట్‌

ఇబ్రహీంపట్నంలోని ట్రక్‌ టెర్మినల్‌, పాయకాపురం కాలనీ ప్లాట్లే టార్గెట్‌

ప్రస్తుతం తక్కువ విస్తీర్ణంలో ట్రయల్‌ రన్‌

తరువాత అన్నింటినీ అమ్మేసే ప్లాన్‌

ట్రక్‌ టెర్మినల్‌ స్థలంపై స్థానిక ప్రజాప్రతినిధి దృష్టి


ఎకరాలకు ఎకరాల భూములు అమ్మేసి.. రూ.కోట్లకు కోట్లు ఆర్జించాలని సీఆర్‌డీఏ పక్కా ప్లాన్‌ వేసింది. ఇందులో భాగంగానే ప్రజా ఉపయోగ స్థలాలను అమ్మకానికి పెట్టింది. ట్రయల్‌ రన్‌లా ముందు తక్కువ స్థాయిలో స్థలాలు అమ్మేసి, ఆ తరువాత పెద్ద మొత్తంలో విక్రయించే వ్యవహారం తెరవెనుక జరుగుతోంది. 


(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : నాటి విజయవాడ-గుంటూరు-తెనాలి-మంగళగిరి (వీజీటీఎం) ఉడా హయాంలో అభివృద్ధి చేసిన అమరావతి టౌన్‌షిప్‌ భూములను అమ్మేందుకు సీఆర్‌డీఏ ప్రణాళిక సిద్ధం చేస్తోంది. ఈ భూములు కొంటారో, లేదోనని ముందుగా ట్రయల్‌ రన్‌ వేసింది. దీనిప్రకారం ప్రభుత్వం ఎంఐజీ లే అవుట్‌ స్కీమ్‌ను అమలు చేసింది. రాష్ట్రంలో పలు పట్టణాభివృద్ధి సంస్థల్లో అమలుచేసిన ఎంఐజీ లే అవుట్లకు స్పందన రాలేదు. కానీ, మంగళగిరి సమీపంలోని నవులూరులో ఉన్న అమరావతి టౌన్‌షిప్‌ ఎంఐజీ లే అవుట్‌కు మాత్రం మంచి స్పందన వచ్చింది. ట్రయల్‌ రన్‌ విజయవంతం కావటంతో మలి దఫాగా అమరావతి టౌన్‌షిప్‌లోని భూములకు ఆక్షన్‌ వేసింది. రూ.300 కోట్ల ఆదాయం టార్గెట్‌గా మిగులు ప్లాట్లు కూడా అమ్మేందుకు అవుట్‌ రేట్‌ సేల్‌ (ఓఆర్‌ఎస్‌)కు పెట్టింది. తాజాగా అప్పట్లో టౌన్‌షిప్‌లో అంతర్భాగంగా నిర్మిస్తామని చెప్పిన కమర్షియల్‌ సెంటర్‌, థియేటర్‌, హైస్కూల్‌, ప్రైమరీ స్కూల్‌, హెల్త్‌ సెంటర్‌ తదితరాలకు చెందిన 8.03 ఎకరాలను కూడా అమ్మాలని నిర్ణయించారు. ఎక్కడ భూములు అమ్మాలో అక్కడ ట్రయల్‌ రన్‌ నిర్వహిస్తున్నారు. 

ఇబ్రహీంపట్నం ట్రక్‌ టెర్మినల్‌పై కన్ను

నాటి వీజీటీఎం-ఉడా హయాంలో ఇబ్రహీంపట్నంలో ట్రక్‌ టెర్మినల్‌ను నిర్మించారు. జాతీయ రహదారుల వెంబడి ఎక్కడపడితే అక్కడ లారీలు పార్కింగ్‌ చేయటం వల్ల ఎదురవుతున్న ఇబ్బందులను తొలగించాలనే ఉద్దేశంతో ఈ ట్రక్‌ టెర్మినల్‌ను అభివృద్ధి చేశారు. అయితే అది ఇప్పటివరకు వినియోగంలోకి రాలేదు. దాదాపు 70 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ట్రక్‌ టెర్మినల్‌లో 15 ఎకరాల్లో ఖాళీ భూములు ఉన్నాయి. వీటిపై సీఆర్‌డీఏ కన్నేసింది. సుమారు ఎకరం ట్రయల్‌గా అమ్మకానికి పెట్టాలని భావిస్తోంది. ఇది షాపులు, ఆఫీసులు, ప్లాట్లకు చెందిన భూమి. 

రంగంలోకి అధికార పార్టీ నేతలు

ఈ భూములపై అధికార పార్టీ నేతల కన్ను కూడా ఉంది. బూడిద చెరువు సమీపంలో ఉండటం వల్ల పర్మినెంట్‌ కార్యకలాపాలు నిర్వహించటానికి ఈ భూమి అనువైనదని భావిస్తున్నట్టు సమాచారం. స్థానిక ప్రజాప్రతినిధి అనుచరుడికి కట్టబెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న విమర్శలు వస్తున్నాయి. మొదట ఆక్షన్‌కు వచ్చే డిమాండ్‌ను చూసి, మొత్తం భూములను అమ్మేయాలని చూస్తున్నారు.

పాయకాపురంపైనా..

పాయకాపురంలో గతంలో ఉడా అభివృద్ధిపరిచిన టౌన్‌షిప్‌లోని ఐదు ఎకరాల్లో ఉన్న ప్లాట్లు, ఇతర ప్రజా ఉపయోగాలకు చెందిన 630 చదరపు గజాల స్థలాలను కూడా సీఆర్‌డీఏ అమ్మకానికి పెట్టింది. పాయకాపురం టౌన్‌షిప్‌లో ప్రైమరీ స్కూల్స్‌, హెల్త్‌ సెంటర్‌, షాపింగ్‌ ఏరియా, డిస్పెన్సరీ, రెసిడెన్షియల్‌ ఏరియా, జూనియర్‌ కాలేజీ, సినిమా థియేటర్‌కు కేటాయించిన స్థలాలతో పాటు పలు ఖాళీ స్థలాలను విక్రయించాలని చూస్తోంది. పాయకాపురం టౌన్‌షిప్‌లోనే ఈడబ్ల్యూఎస్‌, ఎల్‌ఐజీ-1, 2, ఎంఐజీలోని ప్లాట్లతో పాటు జర్నలిస్టు కాలనీలోని పలు ప్లాట్లను అమ్మనున్నారు. అలాగే, తెనాలిలో వేసిన లే అవుట్‌లో వివిధ ప్రజా ఉపయోగ అవసరాల కోసం కేటాయించిన భూములను కూడా సీఆర్‌డీఏ అమ్మకానికి పెట్టింది. వీటిలో షాపింగ్‌ ఏరియా, హెల్త్‌ సెంటర్‌, స్కూల్‌, సినిమా థియేటర్లకు కేటాయించిన స్థలాలున్నాయి. వీటిని కూడా ఆక్షన్‌కు పెట్టాలని నిర్ణయించారు. 


Updated Date - 2022-06-30T05:51:16+05:30 IST