కార్పొరేట్‌కు దీటుగా ప్రభుత్వ బడులు

ABN , First Publish Date - 2022-05-11T05:40:39+05:30 IST

రాష్ట్రంలో కార్పొరేట్‌కు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ బడులను అభివృద్ధి చేస్తున్నామని రాష్ట్ర ఐటీ, మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ స్పష్టం చేశారు.

కార్పొరేట్‌కు దీటుగా ప్రభుత్వ బడులు
పాఠశాల భవన నమూనాను చూపుతున్న మంత్రి కేటీఆర్‌

- కోనాపూర్‌లో పండుగ వాతావరణాన్ని తలపించిన కేటీఆర్‌ పర్యటన

- నానమ్మ ఊరుకు మొదటిసారి వచ్చిన కేటీఆర్‌

- తన కల నెరవేరిందని సంబురం

- రూ.2.50 కోట్లతో నానమ్మ వెంకటమ్మ పేరిట పాఠశాల నిర్మాణానికి శంకుస్థాపన

కామారెడ్డి/బీబీపేట, మే 10: రాష్ట్రంలో కార్పొరేట్‌కు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ బడులను అభివృద్ధి చేస్తున్నామని రాష్ట్ర ఐటీ, మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ తల్లిదండ్రులు నివసించిన బీబీపేట మండలం కోనాపూర్‌ గ్రామాన్ని నివసించిన ఇంటిని కేటీఆర్‌ మంగళవారం సందర్శించారు. నానమ్మ వెంకటమ్మ చెప్పిన మాటలను ఆయన గుర్తు చేశారు. తాను పుట్టినప్పటి నుంచి నానమ్మ, తాత నివసించిన స్వగ్రామమైన పోసానిపల్లి నేటి కోనాపూర్‌ గ్రామాన్ని సందర్శించడం ఆనందంగా ఉందని అన్నారు. కేటీఆర్‌ రాకతో కోనాపూర్‌ గ్రామంలో పండుగ వాతావరణ ం నెలకొంది. రాష్ట్రంలో రూ.7,320 కోట్లతో మన ఊరు- మన బడి కింద 26వేల ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్‌ పాఠశాలలకు దీటుగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఇందులో భాగంగా కోనాపూర్‌లో నానమ్మ వెంకటమ్మ పేరు మీద రూ.2.50 కోట్ల సొంత నిధులతో ప్రభుత్వ పాఠశాలకు శంకుస్థాపన చేసి భవన నిర్మాణానికి మంత్రి కేటీఆర్‌ భూమి చేశారు. అలాగే సుమారు రూ.7 కోట్లలో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. రూ.20 లక్షలతో నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించారు. ఆయనతో పాటు రోడ్డు, భవనాల శాఖ మంత్రి ప్రశాంత్‌రెడ్డి, ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్‌, జడ్పీ చైర్‌పర్సన్‌ దఫేదార్‌ శోభలతో కలిసి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. అనంతరం కేసీఆర్‌ పూర్వికుల ఇళ్లను సందర్శించారు. అప్పుడే ముఖ్యమంత్రి కేసీఆర్‌ కేటీఆర్‌కు ఫోన్‌ చేశారు. మన ఇంట్లోనే ఉన్నానంటూ కేటీఆర్‌ సమాధానం చెప్పారు. నానమ్మ, తాతలు నివసించిన ఇంటిని చూడడం ఎంతో ఆనందంగా ఉందని కేటీఆర్‌ అన్నారు.  టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాలుగున్నర ఏళ్లలోనే కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించి రాష్ర్టాన్ని సస్యశ్యామలం చేశారని తెలిపారు. 14 ఏళ్ల పోరాటంతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని అన్నారు. 60 ఏళ్లలో జరగని అభివృద్ధి 7 ఏళ్లలో చేసి చూపెట్టామని అన్నారు. వారు 60 ఏళ్లు పరిపాలించినా ఎందుకు అభివృద్ధి చేయలేదని ప్రశ్నించారు. 80 సంవత్సరాల క్రితం వరకు నానమ్మ, తాతలు నాటి పోసానిపల్లె నేటి కోనాపూర్‌లో నివసించారని వారి గ్రామాన్ని సందర్శించాలని ఎప్పటి నుంచో కోరిక ఉండేదని అన్నారు. బీబీపేట, కామారెడ్డికి వచ్చినప్పుడు కోనాపూర్‌ను గుర్తుకు చేసుకునే వాళ్లమని అన్నారు. ఈ రోజు గ్రామానికి రావడంతో తన కల నెరవేరిందని అన్నారు. కోనాపూర్‌లో నానమ్మ, తాతలు నివసించిన ఇంటి వద్ద మహిళలతో కలిసి మాట్లాడారు. గ్రామానికి ఏమేమి అభివృద్ధి పనులు కావాలో తెలుసుకుని వాటన్నింటిని నెరవేర్చేలా కృషి చేద్దామని నాన్న చెప్పారని కేటీఆర్‌ తెలిపారు. అలాగే 

అమ్మమ్మ ఊరైన చొప్పదండి మండలం కొదురుపాక గ్రామంలో నూ తన సొంత నిధులతో ప్రభుత్వ పాఠశాల నిర్మాణం చేపడతానని అన్నారు. నానమ్మ, అమ్మమ్మ ఊర్లలో ప్రభుత్వ పాఠశాలలను సొంతంగా నిర్మించే అవకాశం రావడం నా అదృష్టమని అన్నారు. బీబీపేటలో రూ.7 కోట్లతో ప్రభుత్వ పాఠశాలను జనగామాకు చెందిన సుభాష్‌రెడ్డి నిర్మించి ప్రారంభోత్సవ కార్యక్రమానికి వచ్చినప్పుడు ఆయనను స్ఫూర్తిగా తీసుకుని నానమ్మ ఊరు కోనాపూర్‌లో పాఠశాల భవనాన్ని నిర్మిస్తానంటూ చెప్పి పనులకు శంకుస్థాపన చేసినట్లు తెలిపారు. తెలంగాణలో కార్పొరేట్‌ స్థాయిలో పాఠశాలలను అభివృద్ధి చేసి చూపిస్తామని అన్నారు. రూ.7 కోట్లతో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. రూ.20 లక్షలతో నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించారు. 

సీఎం కేసీఆర్‌ పుట్టుకతోనే భూస్వామి

సీఎం కేసీఆర్‌ పుట్టుకతోనే  భూస్వామిగా ఉన్నారని, చింతమడకలోనే ముఖ్యమంత్రి కేసీఆర్‌ పుట్టారని అప్పటి కే రెండెకరాల స్థలంలో ఇళ్లు ఉందని తెలిపారు. నాడు పోసానిపల్లిగా పిలిచే నేటి కోనాపూర్‌లో నానమ్మ వెంకటమ్మకు ఇల్లరికం పెట్టుకున్నారని ప్రస్తుతం రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్‌ మండలం మోయినికుంటకు చెందిన రాఘవరావును కోనాపూర్‌లో ఉన్న తన నానమ్మ వెంకటమ్మకు ఇచ్చి వివాహం చేశారని తెలిపారు. మానే రు ప్రాజెక్టులకు మాకు అవినాభావ సంబంధం ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్‌పర్సన్‌ దఫేదార్‌ శోభ, కలెక్టర్‌ జితేష్‌ వి.పాటిల్‌, ఎస్పీ శ్రీనివాస్‌రెడ్డి, అదనపు కలెక్టర్‌ వెంకటేష్‌దోత్రే, డీసీసీబీ చైర్మన్‌ పోచారం భాస్కర్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు ముజీబుద్దీన్‌, జడ్పీ వైస్‌ చైర్మన్‌ ప్రేమ్‌కుమార్‌, డీసీఎంఎస్‌ చైర్మన్‌ మోహన్‌, వైస్‌ చైర్మన్‌ ఇంద్రసేనారెడ్డి, పారిశ్రామికవేత్త సుభాష్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ నాయకులు నిట్టు వేణుగోపాల్‌రావు, సర్పంచ్‌ నర్సవ్వ, ఎంపీపీ బాలమణి, వైస్‌ ఎంపీపీ రవీందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


గోడలకు సున్నాలు, చందాలు వసూలు చేసే వారు ఆరోపించడం తగదు

ఫ మంత్రి ప్రశాంత్‌రెడ్డి

రాజకీయ విలువలు లేకుండా మాట్లాడుతున్న వారు ఒకప్పుడు మహబూబ్‌నగర్‌ జిల్లాలో గోడలకు సున్నాలు వేసిన వ్యక్తి ఒకరని, కరీంనగర్‌లో చందాలు వసూలు చేసిన వ్యక్తి మరొకరని రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి ప్రశాంత్‌రెడ్డి మండిపడ్డారు. సీఎం కేసీఆర్‌ పుట్టుకతోనే భూస్వామి అని రెండెకరాల స్థలంలో ఉన్న ఇంట్లో పుట్టాడనే విషయం తెలుసుకుని మాట్లాడాలని ప్రతిపక్షాలకు హితవు పలికారు.


బీబీపేట, కోనాపూర్‌కు నిధులు ఇవ్వాలి

ఫ ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌

మంతి కేటీఆర్‌ నానమ్మ ఊరు కోనాపూర్‌కు రావడం గర్వంగా ఉందని కోనాపూర్‌ ప్రజలు పండుగ లాగా భావిస్తున్నారని ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ అన్నారు. సీసీరోడ్లు, డ్రైనేజీలు, కల్వర్టులు నిర్మాణానికి రూ.7 కోట్లు మంజూరు చేసి శంకుస్థాపనలు చేయడం కోనాపూర్‌ ప్రజల తరపున మంత్రి కేటీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. జడ్పీ వైస్‌ చైర్మన్‌ ప్రేమ్‌కుమార్‌ చెప్పినట్లుగా బీబీపేట మండలానికి కావలసిన అభివృద్ధి పనులకు కోనాపూర్‌లో మరిన్ని అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయాలని మంత్రిని కోరారు. 

Read more