తుమ్మపాల షుగర్స్‌ ఆస్తులపై ప్రభుత్వం కన్ను

ABN , First Publish Date - 2022-06-30T06:12:29+05:30 IST

అనకాపల్లి (తుమ్మపాల) సహకార చక్కెర కర్మాగారం ఆస్తులను స్వాధీనం చేసుకునేందుకు ప్రభుత్వం దొడ్డిదారిన ప్రయత్నాలు చేస్తోంది.

తుమ్మపాల షుగర్స్‌ ఆస్తులపై ప్రభుత్వం కన్ను
అనకాపల్లి సహకార చక్కెర కర్మాగారం

దివాలా సంస్థగా ప్రకటన

ఉద్యోగుల వీఆర్‌ఎస్‌కు జీవో జారీ

దొడ్డిదారిలో లిక్విడేషన్‌

తాజాగా ఫ్యాక్టరీని సందర్శించిన ఇద్దరు అధికారులు

ఆస్తులు, అప్పుల వివరాలు సేకరణ

సభ్య రైతుల ఆమోదం లేకుండానే ఆస్తుల అమ్మకానికి సన్నాహాలు


అనకాపల్లి అర్బన్‌, జూన్‌ 29: అనకాపల్లి (తుమ్మపాల) సహకార చక్కెర కర్మాగారం ఆస్తులను స్వాధీనం చేసుకునేందుకు ప్రభుత్వం దొడ్డిదారిన ప్రయత్నాలు చేస్తోంది. దివాలా సంస్థగా ప్రకటించి కోట్లాది రూపాయల విలువ చేసే భూములను చేజిక్కించుకోవడానికి సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం. ఇద్దరు ప్రభుత్వ అధికారులు మంగళవారం ఫ్యాక్టరీకి వెళ్లి రికార్డులను పరిశీలించడం ఈ అనుమానాలకు బలం చేకూరుస్తున్నది.

అనకాపల్లి మండలం తుమ్మపాలలో 1937లో గుజరాత్‌కు చెందిన కాంతీలాల్‌ అనే వ్యాపారి 450 టన్నుల చెరకు క్రషింగ్‌ సామర్థ్యంతో కర్మాగారాన్ని ఏర్పాటుచేశారు. తరువాత దశల వారీగా విస్తరించారు. 1957లో రైతులు, కార్మికులతో ఏర్పడిన గొడవ కారణంగా యాజమాన్యం షుగర్‌ ఫ్యాక్టరీని తూర్పు గోదావరి జిల్లా (ప్రస్తుత కాకినాడ జిల్లా) యర్రవరం ప్రాంతానికి తరలించడానికి సిద్ధపడింది. దీంతో నాటి రాజ్యసభ సభ్యుడు వి.వి.రమణ, మరికొందరు రైతు నాయకులు సుమారు 150 గ్రామాల్లో పర్యటించి షుగర్‌ ఫ్యాక్టరీని సహకార రంగంలో నడిపించడంపై రైతులకు అవగాహన కల్పించారు. షేర్‌ క్యాపిటల్‌గా 13,500 మంది రైతుల నుంచి రూ.కోటి 50 లక్షలు సేకరించారు. మరో రూ.50 లక్షలు ప్రభుత్వం పెట్టుబడిగా పెట్టింది. 1959లో వెయ్యి టన్నుల క్రషింగ్‌ సామర్థ్యం గల కొత్త యంత్రాలను ఏర్పాటుచేశారు. అప్పటి నుంచి సహకార రంగంలోనే కొనసాగుతున్నది. అయితే కాలక్రమేణా ఫ్యాక్టరీ యంత్ర పరికరాలు పాతబడిపోవడం, క్రషింగ్‌లో తరచూ సమస్యలు తలెత్తుతుండడంతో చెరకు క్రషింగ్‌, పంచదార రికవరీ శాతం తగ్గిపోతూ వచ్చాయి. దీంతో ఫ్యాక్టరీకి నష్టాలు మొదలయ్యాయి. ఆర్థిక పరిస్థితి దిగజారడంతో 2002-03 సీజన్‌లో మూతపడింది. తిరిగి 2004-05 సీజన్‌లో పునఃప్రారంభించారు. మళ్లీ 2015-16లో మూతపడగా, 2018-19 సీజన్‌లో తెరిచారు. దీనికి అప్పటి ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ.30.58 కోట్లు గ్రాంటుగా విడుదల చేయించి రైతులకు, కార్మికులకు బకాయిలు చెల్లించారు. ఫ్యాక్టరీకి అదే చివరి సీజన్‌. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత పూర్తిగా మూతపడింది. 

హామీని నిలుపుకోని సీఎం జగన్‌

వైసీపీ అధికారంలోకి వస్తే తుమ్మపాల షుగర్‌ ఫ్యాక్టరీని ఆధునీకరిస్తామని ప్రతిపక్ష నేతగా వున్నప్పుడు అనకాపల్లి పర్యటనకు వచ్చిన జగన్‌మోహన్‌రెడ్డి హామీ ఇచ్చారు. ఆయన సీఎం అయిన తరువాత తుమ్మపాల ఫ్యాక్టరీ తెరుచుకోకపోగా, జిల్లాలో మరో రెండు ఫ్యాక్టరీలు.. ఏటికొప్పాక, తాండవ మూతపడ్డాయి. కాగా తుమ్మపాల ఆధునికీకరణపై మాట తప్పిన సీఎం జగన్మోహన్‌రెడ్డి, దీనిని ఖాయిలా పరిశ్రమల జాబితాలో చేర్చేశారు. ఉద్యోగులకు వీఆర్‌ఎస్‌ అమలు చేయాలని ఈ ఏడాది మార్చిలో కేబినెట్‌ సమావేశంలో నిర్ణయించారు. ఈ మేరకు  ఇటీవల జీవో 15ను ప్రభుత్వం విడుదల చేసింది. ఆ జీవోలో లిక్విడేషన్‌ (పరిసమాప్తి) చేస్తామని పేర్కొనడం గమనార్హం. ఇందులో భాగంగా డిప్యూటీ కేన్‌ కమిషనర్‌ సత్యనారాయణ, ఎండీ సన్యాసినాయుడు మంగళవారం ఫ్యాక్టరీని సందర్శించి ఆస్తులు, అప్పుల వివరాలు సేకరించినట్టు తెలిసింది. లిక్విడేటర్‌ను నియమించి ఆస్తులు అమ్మేసి అప్పులు తీర్చడానికి సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. 

సభ్య రైతుల ఆమోదం లేకుండా లిక్విడేషన్‌ సాధ్యమేనా?

సహకార చట్టం పరిధిలో ఉన్న తుమ్మపాల షుగర్‌ ఫ్యాక్టరీని లిక్విడేషన్‌ (పరిసమాప్తి) చేసేందుకు ప్రభుత్వం దొడ్డిదారిలో ప్రయత్నాలు చేస్తున్నది. వాస్తవంగా ప్రతిఏటా షేర్‌హోల్డర్లతో (రైతులు) సర్వసభ్య సమావేశం నిర్వహించాలి. ఏ నిర్ణయమైనా షేర్‌హోల్డర్ల అనుమతితోనే తీసుకోవాలి. ముఖ్యంగా లిక్విడేషన్‌ చేసేటప్పుడు రైతుల అంగీకారం తప్పనిసరి. కానీ రైతుల నుంచి అభ్యంతరాలు వస్తాయన్న భయంతో దొడ్డిదారిలో అధికారుల ద్వారా లిక్విడేషన్‌ చేయించి, ఆస్తులను అన్యాక్రాంతం చేస్తుందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.


Updated Date - 2022-06-30T06:12:29+05:30 IST