Abn logo
May 14 2021 @ 00:53AM

ఉద్యోగులూ బలైపోతున్నారు

కరోనా రెండో అలలో 22 మంది ప్రభుత్వ ఉద్యోగులు మృతి

ఇప్పటికే 48 మంది టీచర్లు బలి

25 మంది టీటీడీ ఉద్యోగులూ మృతి


నాయకులదేముంది...ఏమైనా చెబుతారు. జలుబుకన్నా తీవ్రం కాదంటారు. సహజీవనం చేయమంటారు. ఎన్నికల పేరుతో జాతర్లు చేస్తారు. జనాన్ని కూడేస్తారు.  పోలీసుల్ని కాపలాకు పెడతారు. పథకాల పేరుతో ప్రభుత్వ ఉద్యోగులను జనంలోకి నెడుతారు. కోర్టులు హెచ్చరించేదాకా టీచర్లను బడులకు తిప్పుతారు. నాయకులదేముంది...ఉపన్యాసాలు ఇస్తారు. కరోనాను ఎదుర్కోండి అని పిలుపునిస్తారు. బాధ్యతగా విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులు మాత్రం బలైపోతున్నారు. అంతా అయిపోయాక, కరోనా వీర మరణాలని పొగడచ్చు. ఎక్స్‌గ్రేషియాలు ప్రకటించవచ్చు. చచ్చిపోయిన మనిషిని మళ్లీ తెచ్చిస్తారా? ఆ కుటుంబాలకు వెలితిని ఎలా పూడుస్తారు? 


చిత్తూరు, మే 13 (ఆంధ్రజ్యోతి): మృత్యు కరోనా ధాటికి జిల్లాలోని ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాలు అతలాకుతలం అవుతున్నాయి. ఏడాది కిందట వైరస్‌ బారిన పడి తట్టుకుని లేచి నిలబడి హమ్మయ్య అనుకునేలోగా రెండో అల ముంచెత్తింది. ఇప్పటికే జిల్లాలో 48 మంది ప్రభుత్వ టీచర్లు కరోనాకు బలయ్యారు. టీటీడీ ఉద్యోగులు 25 మంది మరణించారు. కరోనా కష్టకాలంలోనూ ఉద్యోగ సేవలందిస్తున్న రెవెన్యూ, పంచాయతీరాజ్‌ శాఖల్లోనే రెండో అలలో 22 మంది మరణించారు. విశేషం ఏమిటంటే ఈ వివరాలేవీ ప్రభుత్వ అధికారుల దగ్గర లేకపోవడం. క్షేత్రస్థాయిలో ఆంధ్రజ్యోతి ప్రతినిధులు ఈ సమాచారం సేకరించారు.  ఇక కరోనాతో మాజీ ప్రభుత్వ మాజీ ఉద్యోగులు దాదాపు 50 మంది మరణించి ఉంటారని అంచనా. గతేడాది తిరుపతి పోలీసు జిల్లాలో 287 మందికి పాజిటివ్‌ వస్తే ఏడుగురు మరణించారు. చిత్తూరులో 730 మందికి పాజిటివ్‌ వచ్చినా అందరూ కోలుకున్నారు. సెకండ్‌ వేవ్‌లో ఎక్కడా మరణాలు నమోదు కాలేదు.  ఆంధ్రజ్యోతి సేకరించిన సమాచారం ప్రకారం ఏప్రిల్‌ 14 నుంచీ జిల్లాలో మే 12 దాకా 29 రోజుల వ్యవధిలో 22 మంది ఉద్యోగులు మరణించారు. అంటే రోజూ ఒక్కరైనా చనిపోతున్నారన్నమాట. ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాల్లోని మరణాలను ఇందులో చేర్చలేదు. ఉద్యోగులు తమ విధుల్లో మరింత అప్రమత్తంగా ఉండాలని ఈ మరణాల తీవ్రత హెచ్చరిస్తోంది. తగిన జాగ్రత్తలతోనే విధులు నిర్వహహించాలి. లేకపోతే తమ కుటుంబాలను కూడా వారు ప్రమాదంలోకి నెట్టేసే అవకాశం ఉంది. 


ఒకే ఒంట్లో ముగ్గురు ఉద్యోగులు

బంగారుపాళెంకు చెందిన మధుసూధన్‌ (50) ఆర్టీసీ చిత్తూరు డిపోలో డ్రైవర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు కరోనా సోకింది. అప్పటికే ఆయన తండ్రి సాంబమూర్తి(75) కూడా కరోనాతో చికిత్సలో ఉన్నారు. ఈయన కూడా ఆర్టీసీలో కంట్రోలర్‌గా పనిచేసి రిటైరయ్యారు.  ఈ నెల 8న ఉదయం ఇంటి దగ్గరే తండ్రి మరణించారు. తిరుపతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కుమారుడు మధుసూధన్‌కు ఈ వార్త తెలిసింది. అదే రోజు సాయంత్రం ఆయన కన్నుమూశారు. మధుసూధన్‌ అన్న గుణశేఖర్‌ (52) పెద్దపంజానీ మండలం వీరప్పల్లిలో ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు.  ఆయన కూడా కరోనా బాధితుడే. తండ్రి, తమ్ముడు మరణించిన సమయంలో తిరుపతి ఆసుపత్రిలో ఉన్నారు. కన్న తండ్రి, తోడబుట్టినవాడు చనిపోయారని తెలిసి కుంగిపోయారు.  తిరుపతిలో చికిత్స పొందుతున్న ఈయన కూడా ఈ నెల 9వ తేదీన మరణించారు. ఒకే కుటుంబం రెండో అలలో ముగ్గురినీ పోగొట్టుకుంది. 


 ఆ అధికారి ఇంట్లో విషాదం

తవణంపల్లె ఎంపీడీవో కార్యాలయంలో సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న రమణ భార్య శాంతమ్మ(52) ఈ నెల 2వ తేదీన కుప్పంలో చికిత్స పొందుతూ మరణించారు. మరుసటి రోజు ఆయన కుమారుడు పవన్‌ (32) కూడా తిరుపతి ఆసుపత్రిలో కరోనాతో పోరాడుతూ మరణించారు. రమణ ప్రస్తుతం తిరుపతి ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నారు.


పుత్తూరు విద్యుత్‌ సబ్‌ డివిజన్‌లో ముగ్గురు మృతి

పుత్తూరు సబ్‌డివిజన్‌లో తక్కువ రోజుల వ్యవధిలో ముగ్గురు ట్రాన్స్‌కో ఉద్యోగులు కరోనాతో మరణించారు. నాగలాపురం ట్రాన్స్‌కో ఏడీఏ సుదర్శనం (36) కరోనాతో పోరాడుతూ గత నెల 15వ తేదీన మరణించారు. ఆ తర్వాత నగరి లైన్‌మెన్‌ రాజేంద్రన్‌, బిల్‌ కలెక్టర్‌ సుభాన్‌లు వైరస్‌ బారినపడి చనిపోయారు.


Advertisement