ఇక తిరుగుబాటే!

ABN , First Publish Date - 2022-01-24T05:49:51+05:30 IST

పీఆర్సీపై ఆందోళనను ఉధృతం చేయడానికి ఉద్యోగులు సిద్ధమవుతున్నారు. వచ్చే నెల 6వ తేదీ అర్ధరాత్రి నుంచి సమ్మె చేయడానికి నిర్ణయించారు. ఆదివారం కాకినాడలో ఏపీ ఎన్జీవో, పీఆర్సీ సాధన సమితి ఆధ్వర్యంలో రౌండ్‌టేబుల్‌ సమావేశం నిర్వహించారు.

ఇక తిరుగుబాటే!
ఐక్యత చాటుతున్న వివిధ ఉద్యోగ సంఘాల నాయకులు

  • ఏకమైన ఉద్యోగ, కార్మిక, పెన్షనర్ల సంఘాలు
  • రేపు జిల్లావ్యాప్తంగా ర్యాలీలు, ధర్నాలు
  • 26న మండల కేంద్రాల్లో అంబేడ్కర్‌ విగ్రహాలకు వినతిపత్రాలు సమర్పణ
  • 27 నుంచి 30 వరకు జిల్లా కేంద్రంలో రిలే నిరాహార దీక్షలు
  • వచ్చే నెల 5న కార్యాలయాల్లో సహాయ నిరాకరణ ఉద్యమం
  • ప్రభుత్వం దిగిరాకుంటే 6వ తేదీ అర్ధరాత్రి నుంచి సమ్మెలోకి 
  • ఉద్యమ కార్యాచరణ ప్రకటించిన ఉద్యోగ సంఘాల నేతలు

 భానుగుడి (కాకినాడ), జనవరి 23: పీఆర్సీపై ఆందోళనను ఉధృతం చేయడానికి ఉద్యోగులు సిద్ధమవుతున్నారు. వచ్చే నెల 6వ తేదీ అర్ధరాత్రి నుంచి సమ్మె చేయడానికి నిర్ణయించారు. ఆదివారం కాకినాడలో ఏపీ ఎన్జీవో, పీఆర్సీ సాధన సమితి ఆధ్వర్యంలో రౌండ్‌టేబుల్‌ సమావేశం నిర్వహించారు. ఏపీ జేఏసీ జిల్లా చైర్మన్‌ గుద్దాటి రామ్మోహనరావు, అమరావతి జేఏసీ జిల్లా చైర్మన్‌ పితాని త్రినాథ్‌, ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ప్రతినిధి జగన్నాథం, ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం చైర్మన్‌ వెంకటరత్నం, సంయుక్త సంఘాల నాయకులు ప్రసంగించారు. పీఆర్సీపై ఇచ్చిన జీవోలను వెనక్కి తీసుకోవాలని కోరారు. హెచ్‌ఆర్‌ఏ శ్లాబ్‌లు ఒకటే చేయడం తగదన్నారు. 70 సంవత్సరాలు దాటిన పెన్షనర్లకు అదనపు పెన్షన్‌, క్వాంటం ఆఫ్‌ పెన్షన్‌ తగ్గించడాన్ని తీవ్రంగా ఖండించారు. సీపీఎస్‌ రద్దు, కాంట్రాక్ట్‌, కంటెంట్‌, ఔట్‌ సోర్సింగ్‌, డైలీ వేతన ఉద్యోగులను క్రమబద్ధీకరణ చేయాలని, గ్రామ/వార్డు సచివాలయాల ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి వారి సర్వీసును రెగ్యులర్‌ చేయాలన్నవి తమ డిమాండ్లన్నారు. వీటిపై ప్రభుత్వం మొండి వైఖరితో వ్యవహ రిస్తోందన్నారు. దీంతో జిల్లాలోని నాలుగు జేఏసీలతో కలిసి అన్ని భాగస్వామ్య సంఘాల ఆధ్వర్యంలో సోమవారం నుంచి పీఆర్సీ సాధన సమితి పిలుపు మేరకు కార్యాచరణ పటిష్టంగా అమలు చేస్తామన్నారు. సోమవారం సమ్మె నోటీసు ఇస్తామని, 25న జిల్లాలో ర్యాలీ లు, ధర్నాలు నిర్వహిస్తామని, 26న అన్ని మండల, తాలుకా కేంద్రాల్లో అంబేడ్కర్‌ విగ్రహాలకు వినతిపత్రాలు సమర్పిస్తామని, 27 నుంచి 30 వరకు జిల్లా కేంద్రాల్లో రిలే నిరాహార దీక్షలు చేస్తామని చెప్పారు. వచ్చే నెల 3న తలపెట్టిన ‘చలో విజయవాడ’ను విజయవంతం చేయా లన్నారు. 5న కార్యాలయాల్లో ఉద్యోగులు యాప్స్‌ డౌన్‌ చేసి సహాయ నిరాకరణ ఉద్యమం చేపట్టాలన్నారు. ఇలా చేసినా ప్రభుత్వం దిగిరాకపోతే 6వ తేదీ అర్ధరాత్రి నుంచి 6న ఉద్యోగు లందరూ సమ్మెలోకి వెళ్తామని హెచ్చరించారు. ఉద్యోగుల సమస్యలపై అందరూ సమష్టిగా పోరాడి విజయం సాధించాలన్నారు. సమావేశంలో సీపీఎస్‌, ఆర్టీసీ, వివిధ ట్రేడ్‌ యూనియన్ల అధ్యక్ష కార్యదర్శులు, ఏపీ ఎన్జీవో అసోసియేషన్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పసుపులేటి శ్రీనివాస్‌, జిల్లా కార్యదర్శి మూర్తి బాబు, ఏపీ జేఏసీ అమరావతి జిల్లా శాఖ ప్రధాన కార్యదర్శి దుర్గా ప్రసాద్‌, ఫ్యాప్టో చైర్మన్‌, జిల్లా ప్రధానోపాధ్యాయుల సంఘం అధ్యక్షుడు చెవ్వూరి రవి, ఏపీ గవర్నమెంట్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ జిల్లా కార్యదర్శి సత్యనారాయణ, జిల్లాలోని అన్ని ఉద్యోగ సంఘాల నాయకులు పాల్గొన్నారు. 


11వ పీఆర్సీతో పీటీడీ ఉద్యోగులకు తీవ్ర నష్టం

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ షేక్‌ సాబ్జీ 

భానుగుడి (కాకినాడ): ప్రభుత్వం ప్రకటించిన 11వ పీఆర్సీ కారణంగా పీటీడీ ఉద్యోగులకు తీవ్ర నష్టం చేకూరుతుందని ఉభయ గోదావరి  జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ షేక్‌ సాబ్జీ ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం ఆయన  ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. 2020 జనవరి 1 నుంచి పీటీడీ ఉద్యోగులుగా చేర్చుకున్న సందర్భంగా తమకు ప్రభుత్వ పెన్షన వస్తుందని ఆశించారు. కానీ సీపీఎస్‌ అమలుకు ప్రతిపాదించడంతో ఉపాధ్యాయులు తీవ్ర నిరాశకు గురవుతున్నారన్నారు. వివిధ రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఆర్టీసీ ఉద్యోగులకు కూడా ప్రభుత్వం పెన్షన అమలు చేస్తున్నాయన్నారు. ఇటీవల విలీనం అనంతరం ప్రజా రవాణా సంఘం ఉద్యోగులు కార్మిక చట్టం ప్రకారం ఉన్న ఒక ్క సౌకర్యం కూడా కోల్పోతున్నారన్నారు. ఏప్రిల్‌ 21 నుంచి ఆర్టీసీ వేతన  ఒప్పందం వీరికి అమలు చేయకపోవడంతో పీటీడీ ఉద్యోగులు ఎంతో ఆర్థికంగా నష్టపోతున్నారన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు, పీటీడీ ఉద్యోగులకు వ్యత్యాసంగా ఉన్న ఫిట్‌మెంట్‌ను సర్దుబాటు చేసి ఆర్టీసీ ఉద్యోగులకు న్యాయం చేస్తానన్న హామీ అలాగే మిగిలిపోయిందన్నారు. 


పీఆర్సీ సాధన సమితి ఆందోళనకు మెడికల్‌ ల్యాబ్‌ టెక్నీషియన్ల మద్దతు

రాజమహేంద్రవరం అర్బన్‌, జనవరి 23: రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల పట్ల నిరంకుశంగా వ్యవహరిస్తోందని ఆంధ్రప్రదేశ్‌ మెడికల్‌ ల్యాబ్స్‌ టెక్నీషియన్స్‌ అసోసియేషన రాష్ట్ర కోశాధికారి ఎండీ దురాని పేర్కొన్నారు. పీఆర్సీపై ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణికి వ్యతిరేకంగా ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల సంఘాలన్నీ కలిసి ఏర్పడిన పీఆర్సీ సాధన సమితికి తమ సంఘం సంపూర్ణ మద్దతు తెలియజేస్తుందన్నారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. డిమాండ్ల పరిష్కారానికి పీఆర్సీ సాధన సమితి సోమవారం ఇవ్వనున్న సమ్మె నోటీసుతో పాటు నిర్వహించే ప్రతీ కార్యక్రమంలోనూ ల్యాబ్‌ టెక్నీషియన్లు పాలుపంచుకుంటారని, హక్కులు సాధించుకోవడానికి కలిసి పనిచేస్తామని పేర్కొన్నారు. విజయవాడలో సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పి.రఘుబాబు, ఆర్‌వీఎస్‌ఎన్‌ మూర్తి ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నామన్నారు. మెరుగైన ఫిట్‌మెంట్‌తో పాటు ఇతర డిమాండ్లు సాధించుకునే వరకూ పోరాటం సాగిస్తామని దురాని చెప్పారు.





Updated Date - 2022-01-24T05:49:51+05:30 IST