నాడు ఛీ పొమ్మని.. నేడు రారమ్మని!

ABN , First Publish Date - 2022-01-29T08:13:25+05:30 IST

ఉద్యోగ నేతల తీరు అపరిపక్వంగా ఉంది! వారి వ్యవహార శైలి మొండిగా ఉంది! జీవితాంతం సమ్మెలో ఉండరు కదా! ఎప్పుడైనా చర్చలకు రావాల్సిందే!

నాడు ఛీ పొమ్మని.. నేడు రారమ్మని!

  • ఉద్యోగులతో చర్చలపై సర్కారు ద్వంద్వ వైఖరి
  • పీఆర్సీపై నేతలతో తొలినుంచీ దాగుడు మూతలు
  • ప్రభుత్వంతో డజనుసార్లకుపైగా నేతల చర్చలు
  • సచివాలయంలో పలుమార్లు పడిగాపులు
  • జీవోలు ఇవ్వొద్దని సీఎంవో చుట్టూ ప్రదక్షిణలు
  • అయినా నాడు పట్టించుకోని ప్రభుత్వ పెద్దలు
  • సమ్మె నోటీసు ఇవ్వగానే మంత్రుల కమిటీ ఏర్పాటు
  • పిలిచినా చర్చలకు రారేమంటూ నేడు మండిపాటు
  • చివరికి... మాలో చీలికకూ ప్రయత్నాలు: నేతలు

(అమరావతి - ఆంధ్రజ్యోతి)

ఉద్యోగ నేతల తీరు అపరిపక్వంగా ఉంది!

వారి వ్యవహార శైలి మొండిగా ఉంది!

జీవితాంతం సమ్మెలో ఉండరు కదా! ఎప్పుడైనా చర్చలకు రావాల్సిందే!

...పీఆర్సీపై ‘అపోహలు’ తొలగించేందుకు ప్రభుత్వం నియమించిన కమిటీలోని మంత్రులు, సలహాదారు చేస్తున్న వ్యాఖ్యలివి. చర్చలకు పిలిచి, రోజూ వేచి చూస్తున్నప్పటికీ ఉద్యోగ నేతలు రావడంలేదని వారు పేర్కొంటున్నారు. వెరసి... ప్రభుత్వం తమను జనం ముందు దోషులుగా నిలబెట్టే ప్రయత్నం చేస్తోందని ఉద్యోగ నేతలు ఆక్రోశిస్తున్నారు. పీఆర్సీపై ఆది నుంచీ ఏకపక్షంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వం మళ్లీ చర్చల పేరుతో మభ్యపెడుతోందని ఆరోపిస్తున్నారు. అశుతోష్‌ మిశ్రా కమిషన్‌ నివేదిక సమర్పించి ఏడాదైందని, పీఆర్సీ అమలు చేయాలని ఉద్యోగ నేతలు నెలల తరబడి వేడుకున్నారు. ప్రభుత్వ పెద్దలు, ఉన్నతాధికారుల చుట్టూ తిరిగారు. ప్రభుత్వం నెల, వారం, 72 గంటలు అంటూ డెడ్‌లైన్లు పొడిగించుకుంటూ పోయింది. చివరికి... చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పీఆర్సీ నివేదికను బయటపెట్టకుండానే ఉద్యోగ సంఘాల నేతలను ఆడుకున్నారు.


జాయింట్‌ స్టాఫ్‌ కమిటీ సమావేశాలు, అధికారుల కమిటీ సమావేశాలు అంటూ సచివాలయంలో రాత్రి పది గంటల వరకు సమావేశాలు నిర్వహించి ఏమీ తేల్చకుండా.. ప్రభుత్వ అభిప్రాయం చెప్ప కుండానే నేతలను పంపేశారు. ఉద్యోగ నేతలు 12 నుంచి 15సార్లు జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌, అధికారుల కమిటీ, సజ్జల, సీఎంవో అధికారులతో చర్చించారు. ఇక... వారి అపాయింట్‌మెంట్ల కోసం గంటలతరబడి వేచి చూశారు. ‘మేం సానుకూలంగా స్పందిస్తాం’ అని ఒకేఒక్క హామీ ఇవ్వగానే... అప్పటిదాకా జరుగుతున్న ఆందోళనలను కూడా ఆపేశారు. ఇక... సీఎం జగన్‌ ఫిట్‌మెంట్‌ ప్రకటించి, ఇతర అంశాలపై సీఎస్‌ కమిటీతో చర్చించుకోవాలని తేల్చేశారు. హెచ్‌ఆర్‌ఏ, సీసీఏ, అదనపు క్వాంటమ్‌ పెన్షన్‌... తదితర అంశాల్లో ఉద్యోగులకు నష్టం జరుగుతుందనే ఆందోళనతో సీఎస్‌ కమిటీతో చర్చల కోసం ఉద్యోగ సంఘాల నేతలు నానా హైరానా పడ్డారు. తమ వాదన వినకుండా పీఆర్సీ జీవోలు జారీ చేయవద్దని కోరేందుకు సీఎంవో చుట్టూ తిరిగారు. అయినప్పటికీ... ప్రభుత్వం రాత్రికి రాత్రి ఏకపక్షంగా పీఆర్సీ జీవోలు ఇచ్చింది. వెరసి... అప్పటిదాకా ప్రభుత్వంకానీ, ప్రభుత్వ పెద్దలు కానీ ఉద్యోగులను పట్టించుకోనే లేదు. వారి వాదనలు వినిపించుకోలేదు. 


కార్యాచరణ ప్రకటించగానే...

ప్రభుత్వ ఉద్యోగులు ఉద్యమ కార్యాచరణ ప్రకటించగానే ప్రభుత్వానికి ‘చర్చలు’ గుర్తుకొచ్చాయి. ప్రభుత్వ సలహాదారు సహా మంత్రులతో సీఎస్‌ మెంబర్‌ కన్వీనర్‌గా కమిటీని నియమించింది. ‘నియమించాం. వచ్చి చర్చించుకోండి’ అని చెప్పడమే తప్ప దీనిపై అధికారిక ఉత్తర్వులు ఇవ్వలేదు. పైగా... ఇది బుజ్జగింపుల కమి టీ, అపోహలు తొలగించే కమిటీగా ప్రచారం చేశారు. ‘‘కమిటీ ఏర్పడినట్లు మీడియా ద్వారానే మాకు తెలిసింది. కమిటీ పరిధి, అధికారాలు తెలియనందున... చర్చలకు వెళ్లం’’ అని ఉద్యోగ నేతలు చెప్పారు. చివరికి... సమ్మె నోటీసు ఇచ్చేందుకు వెళ్లినప్పుడు, ‘కమిటీపై జీవో ఇచ్చాం. చూశారా’ అని అధికారులు అడిగారు. ఇదీ... చర్చలపై ప్రభుత్వం తీరు. ‘‘పీఆర్సీ నివేదిక ఇవ్వాలి. జీవోలు రద్దు చేయాలి. ఈ నెలకు పాత జీతాలే చెల్లించాలి’’ అని డిమాండ్లతో స్టీరింగ్‌ కమిటీ సభ్యులు ప్రభుత్వ కమిటీకి వినతిపత్రం ఇచ్చారు. తమ వైఖరిని స్పష్టం చేశారు.


దీనిపై ప్రభుత్వం నుంచి ఏ స్పందనా రాలేదు. పైగా... ‘మీవి అపోహలు. మేమే రైట్‌’ అని చెబుతున్నారు. కొత్త పీఆర్సీ ప్రకారమే జీతాలు ఇచ్చేస్తామని తేల్చిచెబుతున్నారు. ‘‘గతంలో పీఆర్సీ కోసం జరిగిన సమావేశాల్లో గంటల తరబడి చర్చించినా ఏమీ తేల్చలేదు. ప్రభుత్వానికి సమస్య పరిష్కరించాలనే చిత్తశుద్దే ఉంటే... ముందు మా మూడు డిమాండ్లపై స్పందించి, పరిష్కరించాలి’’ అని ఉద్యోగ నేతలు స్పష్టం చేస్తున్నారు. ఒక పక్క మంత్రుల కమిటీ చర్చలు అంటూనే తను చేయాలనుకున్నది చేసుకుంటూ వెళ్లడం సరికాదని పేర్కొంటున్నారు. 


చీలిక యత్నాలు..

ప్రభుత్వంపై ఉమ్మడిగా పోరాటాని కి సిద్ధమైన ఉద్యోగ సంఘాల్లో చీలికకు ప్రభు త్వ పెద్దలు కుట్రలు పన్నుతున్నట్లు ఉద్యోగులు విమర్శిస్తున్నారు. ‘‘పీఆర్సీ సాధన సమితి నేతలే కాదు. మిగిలిన ఉద్యోగ సంఘాల నేతలెవరు వచ్చినా చర్చలకు సిద్ధమే’’ అన్న సజ్జల రామకృష్ణా రెడ్డి ప్రకటనే ఇందుకు నిదర్శనమని చెప్తున్నారు. రెండున్నరేళ్లుగా 4 జేఏసీలను చీల్చి నాలుగు స్తం బాలాట ఆడారని, ఇ ప్పుడు చర్చలకు రావట్లేదంటూ కొత్త డ్రామాకు తెరతీశారని మండిపడుతున్నారు. 

Updated Date - 2022-01-29T08:13:25+05:30 IST