కార్పొరేట్‌స్థాయిలో సర్కారు దవాఖానా

ABN , First Publish Date - 2022-07-02T06:56:13+05:30 IST

జిల్లా ఆసుపత్రితో పాటు మెటర్నీటీ ఆసుపత్రిలో కూడా మెరుగైన వైద్యసేవలు అందిస్తున్న కారణంగా జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది.

కార్పొరేట్‌స్థాయిలో సర్కారు దవాఖానా
జిల్లా కేంద్రంలోని మెటర్నీటీ ఆసుపత్రి ఇదే

జిల్లా ఆసుపత్రికి హైటెక్‌ సొగబులు 

ఎన్‌క్వాస్‌ ఎంపికతో జాతీయస్థాయిలో గుర్తింపు 

ఉచితంగా పేదలకు ఖరీదైన వైద్యం 

డయాలసిస్‌ సెంటర్‌ ద్వారా మెరుగైన సేవలు 

టీ-హబ్‌తో ఒకేచోట అన్నిరకాల పరీక్షలు 

నిర్మల్‌, జూలై 1 (ఆంధ్రజ్యోతి) : జిల్లా ఆసుపత్రితో పాటు మెటర్నీటీ ఆసుపత్రిలో కూడా మెరుగైన వైద్యసేవలు అందిస్తున్న కారణంగా జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. కేంద్ర వైద్య,ఆరోగ్యశాఖ పరిధిలోని నేషనల్‌ హెల్త్‌మిషన్‌ కొద్దినెలల క్రితం సర్కారు దవాఖానాల్లో అందుతున్న సేవలు, వాటి నిర్వహణ తీరును తెలుసుకునేందుకు ప్రత్యేకబృందాలను రంగంలోకి దింపింది. ఈ బృందాలు ప్రభుత్వాసుపత్రులను పూర్తిగా తనిఖీ చేసి సేవలపై నివేదికలు అందించాయి. రెండుదశల్లో వైద్యసేవల ప్రమాణాలను లెక్క గట్టేందుకు ఇక్కడికి బృందాలు వచ్చాయి. మొదట ఎన్‌క్యూఎఎస్‌ (నే షనల్‌ క్వాలిటీ అస్యూరెన్స్‌ స్టాండర్డ్‌)కు సంబంధించిన బృందం నిర్మల్‌కు చేరుకొని ఇక్కడి జిల్లా ఆసుపత్రితో పాటు మెటర్నిటీ ఆసుపత్రి పనితీరును తెలుసుకుంది. ఈ బృందం సంతృప్తి వ్యక్తం చేసిన అనంతరం మరో ప్రత్యే కబృందం ఇటీవలే రెండు ఆసుపత్రుల్లో మూడు రోజుల పాటు ప్రత్యేక సర్వే జరిపింది. మొత్తం 72 అంశాల ఆధారంగా ఇక్కడి ఆసుపత్రుల్లో అం దుతున్న సేవలపై నివేదికలు రూపొందించారు. ఇక్కడి డాక్టర్‌ల పనితీరు, పరిసరాల పరిశుభ్రత, ఔట్‌పేషంట్‌, ఇన్‌పేషంట్‌ విభాగాల నిర్వహణ, రిజిస్ర్టార్‌ నిర్వహణ, లేబర్‌రూం, ఆపరేషన్‌ థియేటర్‌ల నిర్వహణతో పాటు డయాగ్నోస్టిక్‌ సేవలు, ఫార్మసీ సేవలపై ఈ బృందం ఆరా తీసింది. అలాగే రోగులతో మాట్లాడి వారి అభిప్రాయాలను సైతం సేకరించింది. ఇలా మొత్తం 72 అంశాల ఆధారంగా రూపొందించిన నివేదికలతో జిల్లా ఆసుపత్రికి, అలాగే మెటర్నీటీ ఆసుపత్రికి 94 శాతం మార్కులు దక్కాయి. ఎన్‌క్యూఎఎస్‌ అధి కారులు ఒక్కో అంశానికి మార్కులను కేటాయించారు. దేశంలోనే నిర్మల్‌ ఆసుపత్రులు అత్యధికంగా మార్కులు సాధించి అగ్రస్థానంలో నిలిచాయి. దీంతో నేషనల్‌ హెల్త్‌ మిషన్‌ ఇక్కడి జిల్లా ఆసుపత్రికి అలాగే మెటర్నీటీ ఆసుపత్రికి ఎన్‌క్వాస్‌ అందిం చింది. ఇలా సర్టిఫికెట్లు పొందిన ఆసుపత్రుల గ్రేడింగ్‌ మారిపోతోంది. రాష్ట్రంలోనే జిల్లా ఆసుపత్రి మొదటి వరుసలో నిలిచి తన పనితీరును చాటుకునేందుకు అవకా శం దక్కించుకుంది. అయితే ఈ జాతీయస్థాయి గుర్తింపు ద్వారా జిల్లా ఆసుపత్రిలోని ఒక్కోబెడ్‌కు కేంద్రప్రభుత్వం రూ.10వేలను ప్రతీ సంవత్సరానికి అందించనుంది. ఇలా వరుసగా మూడేళ్లపాటు ఆర్థిక సహకారం కొనసాగుతోంది. జిల్లాకేంద్ర ఆసుపత్రిలో వంద పడకలు, మెటర్నిటీ ఆసుపత్రిలో 50 పడలకను కలుపుకొని మొత్తం 150కి పైగా బెడ్‌లున్నాయి. ఒక్కో బెడ్‌కు రూ.10వేల చొప్పున అందించనుండగా ప్రతీయేటా రూ.15 లక్షలు ఇక్కడి ఆసుపత్రికి దక్కనున్నాయి. దీంతో పాటు లక్ష్యపథకం కింద ఎంపి కైన మెటర్నిటీ హాస్పిటల్‌కు కూడా ప్రతీయేటా 6 లక్షల చొప్పున ఆర్థికసహాయం అందుతోంది.  

కలెక్టర్‌, సూపరింటెండెంట్‌ల కృషితో..

కాగా జిల్లా ఆసుపత్రి జాతీయస్థాయిలో ఎన్‌క్వాస్‌ సర్టిఫికెట్‌ దక్కించుకోవడానికి జిల్లా కలెక్టర్‌ ముషారఫ్‌ ఆలీ ఫారూఖీ, సూపరింటెండెంట్‌ డాక్టర్‌ దేవేందర్‌రెడ్డిల ఉమ్మడి కృషియే కారణమంటున్నారు. ముఖ్యంగా కలెక్టర్‌ గత కొంతకాలం నుంచి వరుసగా సమీక్ష సమావేశాలు నిర్వహించి వైద్య,ఆరోగ్యశాఖకు దిశానిర్దేశం చేస్తున్నారు. జిల్లా ఆసుపత్రితో పాటు మెటర్నిటీ ఆసుపత్రిలో వైద్యసేవల మెరుగుదలకు కలెక్టర్‌ పక్కా ప్రణాళిక రూపొందించారు. ఇలా రూపొందించిన ప్రణాళికను వైద్యాధికారులు పకడ్బందీగా అమలు చేశారు. ముఖ్యంగా వైద్యులుతో సమన్వయంగా వ్యవహరించడం, డాక్టర్‌లందరినీ వైద్యసేవల్లో క్రియాశీలకంగా భాగస్వాములను చేయడం, వైద్యసిబ్బందికి ఎప్పటికప్పుడు సలహాలు, సూచనలు అందించి వారి పనితీరును మెరుగు పర్చుకోవడం, రోగులకు అందుతున్న వైద్యసేవలు, వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తెలుసుకోవడం లాంటి అంశాలపై దృష్టి పెట్టారు. అలాగే జాతీయస్థాయిలో హెల్త్‌మిషన్‌ అమలు చేస్తున్న ర్యాంకింగ్‌లు, గ్రేడింగ్‌లపై కూడా దృష్టి సారించారు. ఈ ర్యాంకింగ్‌ల సాధన ద్వారా ఆసుపత్రులకు అదనపు ఆర్థిక సహకారం అందుతుందన్న విషయాన్ని పరిగణలోకి తీసుకున్నారు. దీంతో ఎలాగైనా ఎన్‌క్యూఎఎస్‌ ద్వారా గుర్తింపు సాధించి సర్టిఫికెట్‌ పొందాలన్నదే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ లక్ష్యానికి అనుగుణంగా అమలు చేసిన కార్యాచరణ సక్సెస్‌ కావడంతో జిల్లా ఆ సుపత్రికి 94 శాతం మార్కులు దక్కాయి. దీంతో ఎన్‌క్యూఎఎస్‌ నాణ్యత ప్రమాణాలకు సంబందించిన సర్టిఫికెట్‌ జిల్లా ఆసుపత్రికి జారీ చేసింది. 

డయాలసిస్‌, డయాగ్నోస్టిక్‌ కేంద్రాల సేవల విస్తరణ

జిల్లా ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన డయాలసిస్‌ సెంటర్‌లో కిడ్నీ రోగులకు వైద్యసేవలు అందుతున్నాయి. ప్రతిరోజూ నిర్ణీతసంఖ్యలో ఇక్కడి రోగులకు డయాలసిస్‌ చేస్తున్నారు. స్లాట్‌బుకింగ్‌ ద్వారా రోగులకు సమయాన్ని కేటాయిస్తున్నారు. దీని కారణంగా ఖరీదైన ప్రైవేటు డయాలసిస్‌ భారం పేదరోగులకు తగ్గిపోయింది. డయాలసిస్‌ చేసుకునేందుకు రోగులు క్యూ కడుతున్నారు. అలాగే జిల్లాకేంద్రంలో ఏర్పాటు చేసిన డయాగ్నోస్టిక్‌ హబ్‌ ద్వారా ఒకేచోట అన్ని రకాల రోగ నిర్ధారణ పరీక్షలు జరుగుతున్నాయి. జిల్లాలోని పీహెచ్‌సీలకు కూడా ఇక్కడి నుంచే వ్యాధి నిర్ధారణ పరీక్ష ఫలితాలు అందుతున్నాయి. ఈ డయాగ్నోస్టిక్‌ హబ్‌లో అన్ని రకాల సౌకర్యాలు అందుబాటులో ఉన్న కారణంగా ప్రైవేటు డయాగ్నోస్టిక్‌ సెంటర్‌లకు గిరాకీ తగ్గిపోయింది. ప్రతిరోజూ పెద్దసంఖ్యలో రోగులు రోగ నిర్ధారణ పరీక్షలను ఇక్కడ జరుపుకుంటున్నారు. జిల్లా ఆసుపత్రిలో ప్ర స్తుతం ఈ రెండు విభాగాలకు అత్యధిక ప్రాధాన్యత ఉందంటున్నారు. 

డాక్టర్‌ల సమష్టి కృషి మేరకే..

జిల్లా ఆసుపత్రితో పాటు మెటర్నీటీ ఆసుపత్రిలో మెరుగైన వైద్యసేవలు అందుతుండడం అభినందనీయం. ఇక్కడి డాక్టర్‌ల సమిష్టి కృషి మేరకే జిల్లా ఆసుపత్రి ఎన్‌క్వాస్‌కు ఎంపికైంది. ఎన్‌క్వాస్‌కు ఎంపికవ్వడం జిల్లా ప్రజలందరికి గర్వకారణం. ముఖ్యంగా వైద్య విభాగానికి ఈ ఎంపిక ప్రతిష్టను పెంచుతుంది. డాక్టర్‌లు మానవతాదృక్ఫథంలో మెరుగైన సేవలు అందిస్తున్న కారణంగానే ఈ గుర్తింపు సాధ్యమైంది. భవిష్యత్‌లో ఇదే తరహా వైద్యసేవలను కొనసాగించి పేదరోగులకు డాక్టర్‌లు అండగా నిలవాలి.

- ముషారఫ్‌ ఆలీ ఫారూఖీ, జిల్లా కలెక్టర్‌ 

Updated Date - 2022-07-02T06:56:13+05:30 IST