ప్రభుత్వ విభాగాలు..అవినీతిలో పోటాపోటీ!

ABN , First Publish Date - 2021-12-23T09:16:34+05:30 IST

తెలుగు రాష్ట్రాల్లోని కీలక ప్రభుత్వ విభాగాల్లో 70 శాతంపైనే అవినీతి నెలకొందని యూత్‌ ఫర్‌ యాంటీ కరప్షన్‌ (వైఏపీ) నిర్వహించిన సర్వేలో తేలింది.

ప్రభుత్వ విభాగాలు..అవినీతిలో పోటాపోటీ!

  • తెలుగు రాష్ట్రాల్లో కీలక విభాగాల్లో 70శాతంపైనే అవినీతి
  • తేల్చిన యూత్‌ ఫర్‌ యాంటీ కరప్షన్‌ సర్వే
  • అవినీతిపరులకు త్వరగా శిక్షపడితే ఇతరుల్లో భయం
  • ధరణి విప్లవాత్మకం: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ

హైదరాబాద్‌ సిటీ, డిసెంబరు 22 (ఆంధ్రజ్యోతి): తెలుగు రాష్ట్రాల్లోని కీలక ప్రభుత్వ విభాగాల్లో 70 శాతంపైనే అవినీతి నెలకొందని యూత్‌ ఫర్‌ యాంటీ కరప్షన్‌ (వైఏపీ) నిర్వహించిన సర్వేలో తేలింది. ఏపీలో 7 జిల్లాలు, తెలంగాణలో 30 జిల్లాల్లో మొత్తంగా 21,523 మంది అభిప్రాయాలను ప్రత్యక్ష, ఆన్‌లైన్‌ పద్ధతిలో తీసుకొని నివేదిక రూపొందించారు. ప్రభుత్వ విభాగాల్లో అవినీతి ఉందని 90శాతం మంది.. లంచం ఇవ్వందే పనులు జరిగే పరిస్థితులు లేవని 89శాతం మంది.. కార్యాలయాల్లో అధికారుల తీరు అస్సలు బాగోలేదని 92శాతం మంది అభిప్రాయపడ్డారు. తెలుగు రాష్ట్రాల్లో అత్యధికంగా రెవెన్యూ విభాగంలో 85శాతం మేర అవినీతి ఉందని అభిప్రాయపడ్డారు. ఆ తర్వాత పోలీసు, రిజిస్ట్రేషన్‌, పురపాలక శాఖలో అవినీతి ఉందని చెప్పారు. ఇరు రాష్ట్రాల్లోని రాజకీయ నాయకుల్లో 80శాతం అవినీతిపరులేనని ప్రజలు తేల్చారు. ఈ వైఏసీ నివేదికను బుధవారం ఓ కార్యక్రమంలో సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అవినీతిపరులకు శిక్ష పడితేనే ఇతరులు భయపడతారని అన్నారు. తాము నిర్వర్తించాల్సిన విధులకు అధికారులు రేటు కడితే, పౌరులు ఉపేక్షించొద్దని సూచించారు. ప్రజలు ఎక్కువగా అనుసంధానం ఉండే విభాగాల్లోనే అవినీతి కనిపిస్తోందని, సాంకేతికతతో ఆ అనుసంధానాన్ని తగ్గిస్తే అవినీతి నియంత్రించే అవకాశం ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఆదాయపు పన్ను వివరాలు ఆన్‌లైన్‌లో సమర్పిస్తున్న తరహాలో ఇతర విభాగాల్లోనూ సాంకేతిక సేవలు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. ‘ధరణి’ విప్లవాత్మక నిర్ణయమని, ఫీడ్‌ బ్యాక్‌ తీసుకొని ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చొరవ తీసుకోవాలని అభిప్రాయపడ్డారు.  లంచం అడిగితే ఏసీబీ, సీబీఐకి ఫిర్యాదు చేసేలా ప్రతి ఆఫీసులోనూ టోల్‌ ఫ్రీ నంబర్ల తాలూకు ఫిర్యాదుతో కూడిన బోర్డు ఉండేలా చూడాలని యూత్‌ ఫర్‌ యాంటీ కరప్షన్‌కు సూచించారు. 

Updated Date - 2021-12-23T09:16:34+05:30 IST