ఊళ్ళో బడికి ఊపిరాడనివ్వటం లేదు!

ABN , First Publish Date - 2022-06-28T22:01:40+05:30 IST

పాఠశాల విద్య ప్రైవేటుపరం కావడానికి ప్రభుత్వ నిర్ణయాలు దోహదపడుతున్నాయి. ప్రైవేటు విద్యాసంస్థల్లో చదివే విద్యార్థులకు ‘అమ్మఒడి’ పథకాన్ని వర్తింపచేయడం, ‘అమ్మ ఒడి’ డబ్బు

ఊళ్ళో బడికి ఊపిరాడనివ్వటం లేదు!

పాఠశాల విద్య ప్రైవేటుపరం కావడానికి ప్రభుత్వ నిర్ణయాలు దోహదపడుతున్నాయి. ప్రైవేటు విద్యాసంస్థల్లో చదివే విద్యార్థులకు ‘అమ్మఒడి’ పథకాన్ని వర్తింపచేయడం, ‘అమ్మ ఒడి’ డబ్బు విద్యాసంవత్సరం ప్రారంభంలో జమ చేయడం, ప్రభుత్వ పాఠశాలలను ఆలస్యంగా ప్రారంభించడం, వేలాది గ్రామాలలో 3, 4, 5 తరగతులు అందుబాటులో లేకపోవడం.. ఇవన్నీ తల్లిదండ్రుల దృష్టి ప్రైవేటు పాఠశాలల వైపు మరలే విధంగా చేస్తున్నాయి.


ఆంధ్రప్రదేశ్‌లో విద్యారంగంలో పెనుమార్పులు చోటు చేసుకుంటున్నాయి. గత రెండేళ్లుగా విద్యార్థుల చదువుకు కరోనా నష్టం కలుగచేస్తే, తర్వాత పాలకులు, విద్యాశాఖాధికారులు  చేపట్టిన విధానాలు విద్యార్థులను మరింత అయోమయంలోకి నెడుతున్నాయి. పాఠశాల విద్యలో సంస్కరణల పేరుతో, జాతీయ విద్యా విధానం అమలు పేరుతో ప్రభుత్వం పాఠశాల విద్యలో పలుమార్పులకు శ్రీకారం చుట్టింది. మాతృభాషా మాధ్యమాన్ని పూర్తిగా తొలగించి ఆంగ్ల మాధ్యమంలోనే బోధనాభ్యసన ప్రక్రియ సాగాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఉర్దూ, కన్నడ, తమిళ, ఒడియా మొదలగు భాషామాధ్యమాలు కొనసాగించవచ్చునంటూ ప్రభుత్వం మరొక ఉత్తర్వును జారీ చేసింది. అంటే ఆంధ్రరాష్ట్రంలో తెలుగు మాధ్యమంలో చదువుకునే అవకాశం లేకుండాపోయింది. ఏ ఇతర భాషా మాధ్యమంలోనైనా చదువుకోవచ్చు. తెలుగువారికి, తెలుగు భాషకు దాపురించిన ఈ దౌర్భాగ్యానికి చింతించిన కొన్ని స్వచ్ఛంద సంస్థలు, కొందరు సంఘ సేవకులు, మాతృభాషా ప్రేమికులు న్యాయస్థానాలను ఆశ్రయించడంతో ఆంధ్రప్రదేశ్‌ ఉన్నత న్యాయస్థానం ప్రభుత్వ ఉత్తర్వులను నిలిపివేస్తూ ఆదేశాలను జారీ చేసింది.

 

తెలుగు మాధ్యమానికి మంగళం పాడాలని కృతనిశ్చయంతో ఉన్న ప్రభుత్వం ఉన్నత న్యాయస్థాన ఆంక్షల నుంచి తప్పించుకొనేందుకు వీలుగా గత సంవత్సరం, ఈ సంవత్సరం కూడా పాఠ్యపుస్తకాలను రెండు భాషలలోను ముద్రించింది. వీటిలో ఒక పేజీ తెలుగులో ఉంటే పక్క పేజీ ఆంగ్లంలో ఉంటుంది. దీని వలన పాఠ్యపుస్తకాల ముద్రణావ్యయం రెట్టింపయింది.


జాతీయ విద్యావిధానం అమలు పేరుతో ప్రాథమిక పాఠశాలలను విచ్ఛిన్నం చేసి 3, 4, 5 తరగతులను ఒక కిలోమీటరు లోపు ఉన్న ఉన్నత పాఠశాలల్లో విలీనం చేయటానికి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కరిక్యులమ్‌, బోధనాశాస్త్రం, బోధనావిధానాల అమలు కోసమే తరగతులను 4 భాగాలుగా విభజించారు. కాని పాఠశాలను భౌతికంగా విభజించాల్సిన అవసరం లేదని కేంద్ర ప్రభుత్వ పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి అనిత కర్వాల్‌ పేర్కొన్నారు. కాని రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమిక పాఠశాలల విచ్ఛిన్నానికి పూనుకోవటంతో గ్రామాల్లో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు కనుమరుగయ్యే  ప్రమాదం ఏర్పడింది. కేవలం రెండు తరగతులకే ప్రాథమిక పాఠశాల పరిమితమై బడుగు, బలహీన వర్గాల, పేద వర్గాల బిడ్డలకు ప్రాథమిక విద్య సైతం అందుబాటులో లేకుండా పోయో పరిస్థితి కలిగింది.


విలీన ప్రక్రియను అమలు చేయటానికి పాఠశాలల హేతుబద్ధీకరణ పేరుతో జీవో నెంబర్‌ 117ను ప్రభుత్వం జారీ చేసింది. తెలుగు మాధ్యమం ఎత్తివేయాలనే దృష్టితో పాఠశాలలన్నింటిలో ఒకే మాధ్యమం ఉంటుందని  ఆ ఉత్తర్వులలో పేర్కొన్నారు. ఆ ఒకే మాధ్యమం తెలుగు మాధ్యమమా, ఆంగ్ల మాధ్యమమా, మరేదైనానా– అనే విషయం ఆ ఉత్తర్వులలో లేదు. హైకోర్టు ఆదేశాలున్న కారణంగా ఏ మాధ్యమమో చెప్పకుండా ఒకే మాధ్యమం అని చెప్పటం ద్వారా, విద్యార్థులను, తల్లిదండ్రులను, పాఠశాలల ఉపాధ్యాయులను, ప్రధానోపాధ్యాయులను గందరగోళంలోకి  నెట్టారు. 8వ తరగతి వరకు సింగిల్‌ మీడియం అన్నారు. అంటే 7వ తరగతి వరకు తెలుగు మాధ్యమంలో చదివిన విద్యార్థి 8వ తరగతిలో ఆంగ్లమాధ్యమంలో చదవాలి. ఇది ఆచరణ సాధ్యమేనా? విద్యార్థులు ఒక్కసారిగా ఆంగ్ల మాధ్యమంలోనికి మారగలరా? ఒకవేళ ఏ విద్యార్థి అయినా తెలుగు మాధ్యమంలోనే చదువుతానంటే ప్రధానోపాధ్యాయుడు ఏం చేయాలి? రెండు మాధ్యమాలు లేవని ప్రభుత్వం ఆదేశాలు కదా!


ఇదిలా ఉంటే ఇప్పటి వరకు రెండు మాధ్యమాలు నడిచిన ఉన్నత పాఠశాలల్లో ప్రతి తరగతికి రెండు సెక్షన్లు ఉన్నాయి. తదనుగుణంగా ఉపాధ్యాయ సిబ్బంది ఉన్నారు. సింగిల్‌ మీడియం, 3, 4, 5తరగతులను ఉన్నత పాఠశాలల్లో విలీనం చేయాలనే నిర్ణయంతో జారీ చేసిన జీవో నెంబర్‌ 117 కారణంగా రాష్ట్రంలో ఒకటి రెండు జిల్లాలు మినహా అన్ని జిల్లాల్లో రెండు వేల నుంచి 2500 ఉపాధ్యాయ పోస్టులు అదనంగా ఉన్నట్లు తేలింది. అంటే దాదాపు 25 వేల పోస్టులకు పైగా రద్దు అయ్యే పరిస్థితి ఏర్పడింది. జాతీయ విద్యా విధానానికి భిన్నంగా చేపట్టిన విలీన ప్రక్రియ, హేతుబద్ధీకరణ ప్రక్రియల అంతిమ లక్ష్యం ఉపాధ్యాయ పోస్టుల రద్దు అనేది స్పష్టమవుతున్నది. నాణ్యమైన విద్యను అందిస్తామని ప్రభుత్వ పెద్దలు పదే పదే ప్రకటిస్తున్నారు. ఉపాధ్యాయ పోస్టులను తగ్గించడం ద్వారా, రద్దు చేయడం ద్వారా విద్యా ప్రమాణాలు, నాణ్యత ఏవిధంగా పెరుగుతాయి?


ప్రభుత్వ పాఠశాలలు ఈ రోజు (జూన్‌ 28) నుంచి విద్యార్థులు లేకుండా ప్రారంభం కానున్నాయి. విద్యార్థులకు జూలై 5 నుంచి ప్రారంభం అవుతాయి. పాఠశాల సంసిద్ధత కోసం వారం రోజులు ముందుగానే ఉపాధ్యాయులను రప్పిస్తున్నామని చెబుతున్నారు. కాని ప్రైవేటు పాఠశాలలు జూన్‌ 13 నుంచి ప్రారంభమయ్యాయి. ప్రభుత్వ పాఠశాలలను 3వారాలు ఆలస్యంగా ప్రారంభించడంలో గల ఆంతర్యం ఏమిటి? మూడు వారాల పాటు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు నష్టపోవడం లేదా? విద్యా రంగానికి సంబంధించిన ఏ వర్గమూ పాఠశాలలను జూన్‌లో పునఃప్రారంభించవద్దని కోరలేదు. ఏ బలమైన కారణం ఈ నిర్ణయానికి దారితీసింది? ప్రభుత్వ పాఠశాలల నుంచి దాదాపు లక్షమంది విద్యార్థులు ఈ రెండు వారాలలో ప్రైవేట్‌ పాఠశాలలో చేరినట్లుగా చెబుతున్నారు. పాఠశాల విద్య ప్రైవేటుపరం కావడానికి ప్రభుత్వ నిర్ణయాలు దోహదపడుతున్నాయి. ప్రైవేటు విద్యాసంస్థలలో చదివే విద్యార్థులకు ‘అమ్మఒడి’ వర్తింపచేయడం, ‘అమ్మఒడి’ డబ్బు విద్యాసంవత్సరం ప్రారంభంలో జమచేయడం, ప్రభుత్వ పాఠశాలలను ఆలస్యంగా ప్రారంభించడం, వేలాది గ్రామాలలో 3, 4, 5 తరగతులు అందుబాటులో లేకపోవడం తల్లిదండ్రుల దృష్టి ప్రైవేటు పాఠశాలల వైపు మరలే విధంగా చేస్తున్నాయి.


పాఠశాలలో ఏ మాధ్యమంలో చేరాలో తెలియని సందిగ్ధ స్థితి విద్యార్థులకు ఉంటే, తల్లిదండ్రులకు ఏమని సమాధానం చెప్పాలో తెలియని స్థితిలో ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు వున్నారు. ప్రతి సంవత్సరం పాఠశాలల ప్రారంభంలో ఇచ్చే అకడమిక్‌ క్యాలెండర్లో సంవత్సరం తిరిగేసరికి అనేకసార్లు మార్పులు చేస్తారు. ప్రభుత్వ పాఠశాలలో చేరితే తమ బిడ్డల భవిష్యత్తు ఏమవుతుందోననే ఆందోళన తల్లిదండ్రులలో కలిగే పరిస్థితి ఏర్పడింది. ఒకరిద్దరు ఉపాధ్యాయులు మాత్రమే ఉన్న పాఠశాలలో తమ బిడ్డలను చేర్పించటానికి ఎంత మంది సిద్ధపడతారు. ఉన్నత పాఠశాలల్లో కూడా ఉపాధ్యాయులపై అధిక పని భారం మోపుతూ జీవో నెంబర్‌ 117ను రూపొందించారు. ప్రపంచ వ్యాప్తంగా ఉపాధ్యాయులు వారానికి 24 నుండి 32 పీరియడ్లు మాత్రమే బోధిస్తారు. కాని ఈ ఉత్తర్వుల ప్రకారం వారానికి 42 నుండి 48 పీరియడ్‌లు బోధించాలి. హిందీ పండితులు 18 సెక్షన్లకు ఒకరు మాత్రమే ఉంటారు. ఈ జీవోను అశాస్త్రీయంగా, హేతురహితంగా రూపొందించారు. ఈ పని భారంతో నాణ్యమైన విద్యను అందించడం ఉపాధ్యాయులకు అసాధ్యమవుతుంది.


ఆరు రకాల పాఠశాలలను ప్రతిపాదించిన ప్రభుత్వం అకడమిక్‌ క్యాలెండర్‌ను మాత్రం రెండు రకాల పాఠశాలలకు మాత్రమే విడుదల చేయడం విచిత్రం. ప్రభుత్వ పాఠశాలలో చేరదలుచుకున్న విద్యార్థికి అనేక సమస్యలు ఎదురవుతున్నాయి. గ్రామంలో పాఠశాల ఉంటుందో లేదో తెలియదు. గ్రామంలో చదవాలో, మరో గ్రామం వెళ్లాలో తెలియదు. ఏ మాధ్యమంలో చదవాలో తెలియదు. దూర గ్రామం అయితే రవాణా సౌకర్యాలు ఏమిటో తెలియదు. రాష్ట్ర సిలబస్సో, సి.బి.యస్‌.సి. సిలబస్సో ఏ తరగతులకు ఏ సిలబస్‌ చెబుతారో ఇంకా స్పష్టత రాలేదు. తమ పిల్లలను రోజూ దూరాన ఉన్న బడిలో దింపే బాధ్యత తల్లిదండ్రులపై పడుతుంది. కనుక ఏం చేయాలో వారికి అర్థం కాదు. ఉన్నత పాఠశాలలలో 3, 4, 5 తరగతుల విద్యార్థులకు తగిన తరగతి గదులు లేవు. వారిని చేర్చుకోవాలో చేర్చుకుంటే ఏ మాధ్యమంలో బోధించాలో ప్రధానోపాధ్యాయులకు అర్థం కాదు. తెలుగు మాధ్యమం లేదంటే న్యాయస్థానాలు ఏం చేస్తాయో, తెలుగు మాధ్యమం అంటే ప్రభుత్వ పెద్దలు ఆగ్రహిస్తారేమో అనే భయందోళనల మధ్య, సందేహాల మధ్య ఉపాధ్యాయులు ఉన్నారు.


ఇంత గందరగోళం మధ్య విద్యా సంవత్సరం ప్రారంభమవుతున్నది. ఊరి బడిని నామావశిష్టం చేసే ప్రక్రియ మొదలయింది. ప్రైవేటు విద్యా రంగానికి ప్రభుత్వ విధానాలు మరింత ఊతమిస్తున్నాయి. కొఠారి కమిషన్‌ చెప్పిన విధంగా ప్రతి ఆవాస ప్రాంతంలో ప్రభుత్వ పాఠశాల ఉండాలని, అన్ని వర్గాల విద్యార్థులు అదే పాఠశాలలో చదువుకునే విధంగా ఉండాలని విద్యావేత్తలు, మేధావులు అభిలషిస్తున్నారు. ప్రభుత్వం విద్యావేత్తలతో, మేధావులతో, ఉపాధ్యాయ సంఘాలతో చర్చించి, ప్రజోపయోగకరమైన విధానాలను రూపొందించి ఈ గందరగోళానికి తెరదించాలి.


-పి. పాండురంగ వరప్రసాదరావు

ఏపిటియఫ్‌ పూర్వ ప్రధానకార్యదర్శి

Updated Date - 2022-06-28T22:01:40+05:30 IST