గ్రీన్‌సిగ్నల్‌!

ABN , First Publish Date - 2020-07-10T10:09:50+05:30 IST

మునిసిపాలిటీల్లో కో ఆప్షన్‌ సభ్యుల పదవులను భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

గ్రీన్‌సిగ్నల్‌!

మునిసిపాలిటీల్లో కోఆప్షన్‌ పదవుల ఎన్నికకు సర్కార్‌ నిర్ణయం 

ఒక్కో మునిసిపాలిటీలో నాలుగు స్థానాలు 

అనుభవం ఉన్నవారికి, మైనార్టీలకు రెండు చొప్పున

సగం స్థానాలు మహిళలకు కేటాయింపు 

ఈ నెలాఖరులోగా ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే అవకాశం 

అవకాశం కోసం తీవ్ర ప్రయత్నాల్లో ఆశావహులు


(ఆంధ్రజ్యోతి, వికారాబాద్‌) : మునిసిపాలిటీల్లో కో ఆప్షన్‌ సభ్యుల పదవులను భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సాధ్యమైనంత త్వరగా వీటిని భర్తీ చేసేలా చర్యలు తీసుకోవాలని మునిసిపల్‌ శాఖ ఉన్నతాధికారులను ఆదేశించింది. మునిసిపాలిటీల్లో పాలకవర్గాలు కొలువుదీరిన 60రోజుల్లోగా కోఆప్షన్‌ సభ్యులను ఎన్నుకోవాల్సి ఉండగా, ఆ సమయంలో అధికార యంత్రాంగం కరోనా విపత్తును ఎదుర్కొనే చర్యల్లో నిమగ్నం కావడం వల్ల నిర్ణీత గడువులోగా కోఆప్షన్‌ పదవులకు ఎన్నికలు నిర్వహించలేకపోయారు. తాజాగా మునిసిపాలిటీల్లో కోఆప్షన్‌ సభ్యుల పదవుల ఎంపిక చేపట్టాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో ఆశావహుల దృష్టి ఆ పదవులపై పడింది. మునిసిపల్‌ ఎన్నికల్లో పార్టీ కోసం పనిచేసిన తమకు కోఆప్షన్‌ సభ్యులుగా అవకాశం కల్పించాలంటూ పలువురు నాయకులు ఎమ్మెల్యేల చుట్టూ ప్రదక్షణలు చేస్తున్నారు.


మునిసిపల్‌ ఎన్నికల్లో అధికార పార్టీ తరఫున పోటీ చేసేందుకు ప్రతి వార్డులో ముగ్గురు, నలుగురు నాయకులు పోటీ పడ్డారు. విజయావకాశాలు ఎక్కువగా ఉన్నవారినే పార్టీ అభ్యర్థులుగా ఎమ్మెల్యేలు ఎంపికచేసి పోటీ చేసే అవకాశం కల్పించారు. పార్టీ తరఫున పోటీచేసే అవకాశం లభించక తిరుగుబాటు అభ్యర్థులుగా ఎన్నికల బరిలోకి దిగిన పలువురు నాయకులకు మునిసిపల్‌ కోఆప్షన్‌ పదవుల్లో అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చి పోటీ నుంచి విరమింపజేశారు. కొత్త పాలకవర్గాలు కొలువుదీరిన 60 రోజుల్లో కో ఆప్షన్‌ సభ్యుల ఎన్నికల ప్రక్రియ పూర్తిచేయాలి. అయితే ఫిబ్రవరి చివరివారంలో పది రోజులపాటు కొనసాగిన పట్టణ ప్రగతి కార్యక్రమం అనంతరం కోఆప్షన్‌ సభ్యుల ఎన్నిక నిర్వహించవచ్చని భావించారు.


అంతలోనే కరోనా విపత్తు ముంచుకురావడం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ ప్రకటించడంతో ఈ పదవుల ఎంపిక వాయిదా పడింది. మునిసిపాలిటీల్లో కొత్తపాలక వర్గాలు కొలువుదీరినప్పటి నుంచి ఆశావహులు కోఆప్షన్‌ పదవుల నోటిఫికేషన్‌ కోసం ఎదురుచూస్తున్నారు. ఎన్నికలు నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించడంతో మళ్లీ మునిసిపాలిటీల్లో సందడి ప్రారంభమైంది. కో ఆప్షన్‌ పదవులకు మాజీ కౌన్సిలర్లు, ఎన్నికల్లో ఓటమి చెందిన వారు, ఎమ్మెల్యేల హామీతో ఎన్నికల పోటీ నుంచి విరమించుకున్న నాయకులు పోటీ పడుతున్నారు.


తీవ్రపోటీ

మునిసిపాలిటీల్లో కోఆప్షన్‌ పదవులకు తీవ్ర పోటీ నెలకొంది. ఎన్నికల్లో పోటీ చేసేందుకు టికెట్‌ ఆశించి భంగపడిన మాజీ కౌన్సిలర్లు, పార్టీ నాయకులు ఈ పదవులపై గంపెడాశలు పెట్టుకున్నారు. కోఆప్షన్‌ పదవులు ఎన్నికల్లో గెలిచిన కౌన్సిలర్లతో సమానం కావడంతో తీవ్ర పోటీ ఏర్పడింది. జిల్లాలోని నాలుగు మునిసిపాలిటీలను టీఆర్‌ఎస్‌ కైవసం చేసుకున్న నేపథ్యంలో పలువురు పార్టీ నాయకులు పోటీ పడుతున్నారు. మునిసిపాలిటీల్లో తమ పరపతిని పెంచుకోవడానికి కోఆప్షన్‌ పదవిని ఓ అస్త్రంగా ఉపయోగించుకోవచ్చని భావిస్తున్న నేతలు.. తమ ప్రయత్నాలను వేగవంతం చేశారు.


ఎన్నికల సమయంలో ఎమ్మెల్యేలు హామీ ఇచ్చిన నాయకులు తమకు ఎలాగైనా మునిసిపాలిటీల్లో ప్రాతినిధ్యం దక్కుతుందనే ఆశాభావంతో ఉన్నారు. ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ఒక మునిసిపాలిటీ ఉండడంతో కోఆప్షన్‌ పదవుల పందేరంలో ఎమ్మెల్యేల నిర్ణయమే కీలకం కానుంది. చాలా వరకు వారు నిర్ణయించిన వారే కోఆప్షన్‌ సభ్యులుగా ఎన్నిక కానున్నారు. పరిపాలనపై అనుభవం, అవగాహన కలిగిన నాయకులు, మైనార్టీల్లోనూ తీవ్ర పోటీ నెలకొంది. తమకు ఉన్న పరిచయాలతో కొందరు ఆశావహులు మంత్రులు, పార్టీ అధిష్ఠానంతో సిఫారసు చేయించుకునేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు.


నాలుగు మునిసిపాలిటీల్లో 16 కో ఆప్షన్‌ పదవులు

జిల్లాలోని నాలుగు మునిసిపాలిటీల్లో 16 కోఆప్షన్‌ సభ్యుల పదవులు ఉన్నాయి. వికారాబాద్‌, తాండూరు, పరిగి, కొడంగల్‌ మునిసిపాలిటీల్లో ఒక్కో మునిసిపాలిటీలో నలుగురు వంతున కోఆప్షన్‌ సభ్యులను పాలక మండలి సభ్యులు ఎన్నుకోనున్నారు. నాలుగు కోఆప్షన్‌ పదవుల్లో రెండు పదవులకు ఇంతకుముందు మునిసిపల్‌ పరిపాలనలో అనుభవం కలిగిన మాజీ కౌన్సిలర్లను ఎంపిక చేయనున్నారు. మిగతా రెండు పదవులను మైనార్టీలకు కేటాయించనున్నారు. ఈ రెండు విభాగాల్లో ఒక్కో పదవికి మహిళను ఎన్నుకోవాల్సి ఉంటుంది. 4 మునిసిపాలిటీల్లో 16 మందిని కోఆప్షన్‌ సభ్యులుగా ఎన్నుకుంటే, వారిలో 8 పదవులు పురుషులకు, 8 పదవులు మహిళలకు దక్కనున్నాయి. మునిసిపల్‌ పరిధిలో ఓటరుగా నమోదై ఉండి 21 సంవత్సరాల వయస్సు నిండిన వారినే ఈ పదవులకు అర్హులుగా పరిగణించనున్నారు. 

Updated Date - 2020-07-10T10:09:50+05:30 IST