సంక్షేమాన్ని తగ్గిస్తున్న ప్రభుత్వ వినియోగం

ABN , First Publish Date - 2022-01-25T06:27:00+05:30 IST

కొవిడ్‌తో ఉద్యోగాలు కోల్పోయి, పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీతో తమ చిన్న, మధ్యతరహా వ్యాపారాలను మూసివేసుకున్న సామాన్యులు ఇప్పుడు ధరల పెరుగుదలతో సతమతమవుతున్నారు...

సంక్షేమాన్ని తగ్గిస్తున్న ప్రభుత్వ వినియోగం

కొవిడ్‌తో ఉద్యోగాలు కోల్పోయి, పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీతో తమ చిన్న, మధ్యతరహా వ్యాపారాలను మూసివేసుకున్న సామాన్యులు ఇప్పుడు ధరల పెరుగుదలతో సతమతమవుతున్నారు. ఉద్యోగాలు లేక ఆదాయాలు తగ్గిపోయినప్పుడు మార్కెట్‌లో డిమాండ్ తగ్గిపోయి, ధరలూ తగ్గిపోతాయనేది అర్థశాస్త్ర వివేకం. అయితే ఇప్పుడు పరిస్థితి భిన్నంగా ఉంది. ప్రజల కొనుగోలు శక్తి బాగా తగ్గిపోయింది. అయినా మార్కెట్‌లో సరుకుల ధరలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి!


ఈ విచిత్ర పరిస్థితికి రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి- ప్రజలు తమ ఉద్యోగాలు, వ్యాపారాలను కోల్పోవడంతో పాటు ప్రభుత్వ వ్యయాలు అంతకంతకూ అధికమవడం. ప్రభుత్వాధికారులకు ఎస్‌యువి (స్పోర్ట్ యుటిలిటీ వెహికల్)లు సమకూర్చడంతో పాటు సెంట్రల్ విస్టా లాంటి వైభవోపేత నిర్మాణాలకు పూనుకోవడం, ప్రభుత్వోద్యోగుల వేతన భత్యాల పెరుగుదల ప్రభుత్వ వ్యయాలను ఇతోధికంగా పెంచి వేశాయి. ప్రజల నుంచి తగ్గిన డిమాండ్ (వినియోగదారు తనకు కావాల్సిన వస్తువును కొనాలనే కోరికనూ, కొనుగోలు శక్తినీ కలిగి ఉండటమే డిమాండ్) కంటే ప్రభుత్వ వినియోగంతో పెరిగిన డిమాండ్ అత్యధికంగా ఉంది. ఈ కారణంగా మార్కెట్‌లో మొత్తం మీద డిమాండ్ పెరుగుతుండడంతో ధరలూ పెరుగుతున్నాయి.


ధరల పెరుగుదలకు రెండో కారణం పర్యావరణ సంబంధితమైనది. ఇటీవల దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాలలో ఒకేసారి వరదలు, దుర్భిక్షాలు మొదలైన ప్రకృతి వైపరీత్యాలు సంభవించాయి. తీవ్రమవుతున్న భూతాపం ఈ విపత్తులకు దారితీస్తోంది. భూగోళం వేడెక్కడమనేది ప్రపంచవ్యాప్త పరిణామమే అయినప్పటికీ స్థానికంగా పర్యావరణ విధ్వంసం ఆ విపత్తులను నిత్య ఘటనలుగా మార్చివేస్తోంది. ఉదాహరణకు హైవేల నిర్మాణానికి అడవులను నరికివేస్తున్నారు. దీనివల్ల కాలుష్య కారక వాయువుల ఉద్గారాల నిరోధం తగ్గిపోతోంది. వన్యప్రాణులు అంతరించిపోతున్నాయి. సాగునీటికి, విద్యుదుత్పత్తికి నదీజలాలను వినియోగించుకునేందుకై ఆనకట్టల నిర్మాణం పెరిగిపోతోంది. దీనివల్ల నదుల్లో చేపలు ఎగువ, దిగువ ప్రాంతాలకు వలస వెళ్ళలేకపోతున్నాయి. అవి క్రమంగా చనిపోతున్నాయి. జలచరాలు తగ్గిపోతుండడంతో నదీజలాల నాణ్యత కూడా తగ్గిపోతోంది. చేపలతో చాలా సులభంగా పరిశుభ్రమయ్యే నీటిని ఇప్పుడు మనం మురుగునీటి శుద్ధి కేంద్రాల ద్వారా శుభ్రపరచుకోవలసివస్తోంది.


మన ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలు పర్యావరణ విధ్వంసానికి దారితీస్తున్నాయి. వరదల మూలంగా టొమాటోల ఉత్పత్తి తగ్గిపోయింది. పర్యవసానంగా మార్కెట్‌లో టొమాటోల ధర పెరిగింది. ధరల పెరుగుదలను నివారించేందుకు ప్రభుత్వం తన వినియోగాన్ని తగ్గించుకోవాలి. ప్రస్తుతం ప్రజల నుంచి రూ.100 మేరకు డిమాండ్ తగ్గిపోతే అదే సమయంలో రూ.120 ప్రభుత్వ వినియోగంలో పెరుగుదల సంభవిస్తుంది. దీన్ని తలకిందులు చేయవలసిన అవసరముంది. ప్రభుత్వం నుంచి రూ.100 మేరకు డిమాండ్ తగ్గించడంతో పాటు అదే సమయంలో ప్రజల రూ.100 వినియోగంలో పెరుగుదల సాధించాలి. ఇది జరిగినప్పుడు మాత్రమే మార్కెట్‌లో మొత్తం డిమాండ్‌లో ఎటువంటి మార్పు ఉండకపోవడంతో పాటు ధరలు నిలకడగా ఉంటాయి. ఇదే సమయంలో ప్రజలకు సంక్షేమాన్ని సమకూర్చాలి. ప్రజల శ్రేయస్సే ప్రభుత్వ లక్ష్యం కదా. ప్రభుత్వ వినియోగంలో పెరుగుదల ప్రజల సంక్షేమాన్ని మరో విధంగా దెబ్బ తీస్తోంది. ప్రభుత్వ డిమాండ్‌ను బడా కంపెనీలు మాత్రమే తీర్చగలుగుతున్నాయి. ఉదాహరణకు హైవేల నిర్మాణానికి అవసరమైన సరుకులను భారీ వస్తువుల తయారీదారులు, ఉక్కు ఫ్యాక్టరీల నుంచి కొనుగోలు చేయవలసి ఉంటుంది. ఈ డిమాండ్‌లో కొంత భాగం వాస్తవంగా విదేశాలకు లబ్ధిని సమకూరుస్తుంది. భారీ నిర్మాణ పరికరాల దిగుమతి ఇందుకొక ఉదాహరణ. ఈ దిగుమతుల వల్ల దేశంలో ఉత్పత్తి కార్యకలాపాలు తగ్గిపోతున్నాయి. ఫలితంగా ఆర్థికాభివృద్ధి తగ్గి, ప్రజలకు ఉద్యోగాలూ తగ్గిపోతున్నాయి. ఈ వాస్తవాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం తన వ్యయాలను తగ్గించుకుని, ప్రజలకు మరింత నగదును బదిలీ చేయాలి. వైభవోపేత నిర్మాణాలకు వ్యయపరుస్తున్న ధనాన్ని సామాన్యులకు బదిలీ చేస్తే వారి కొనుగోలు సామర్థ్యం పెరుగుతుంది. ఆహార సామగ్రి, వస్ర్తాలు మొదలైన వాటి కొనుగోళ్ల పెరుగుదల వల్ల స్థానిక ఉత్పత్తి కార్యకలాపాలు ఇతోధికమవుతాయి. తద్వారా ధరల పెరుగుదల లేకుండానే ప్రజలకు సంక్షేమం సమకూరుతుంది.


ప్రభుత్వ వినియోగం తగ్గుదల ప్రజలపై మరో సానుకూల ప్రభావానికి దారితీస్తుంది. ఆర్థిక వ్యవస్థ ఎదుగుదల సజావుగా ఉందనే విశ్వాసం ప్రజల్లో నెలకొనడమే ఆ అనుకూల ప్రభావం. ఆర్థిక వ్యవస్థ పురోగమన బాటలో ఉందని విశ్వసించినప్పుడు ప్రజలు తమ ఆదాయాలను మరింతగా ఖర్చుపెట్టడానికి సిద్ధమవుతారు. 1960 దశకంలో దేశం కరువు కాటకాలతో విలవిలలాడుతున్నప్పుడు ప్రతి పౌరుడు ఒక రోజు ఉపవాసం ఉండాలని నాటి ప్రధానమంత్రి లాల్ బహదూర్‌శాస్త్రి పిలుపునిచ్చారు. ఆయన స్వయంగా ఆ ఆదర్శాన్ని పాటించారు. ఆసేతు హిమాచలం అశేష ప్రజలు శాస్త్రిని అనుసరించారు. ఫలితంగా ఆహారధాన్యాల వినియోగంలో తగ్గుదల స్పష్టంగా కనిపించింది. ప్రజలు తమ ఆదాయాలను పొదుపు చేయకుండా ఖర్చు చేయాలని ప్రభుత్వం భావిస్తే ఆర్థిక వ్యవస్థ పరిస్థితి సజావుగా ఉందనే నమ్మకాన్ని వారిలో నెలకొల్పి తీరాలి. ప్రభుత్వాధికారులకు ఎస్‌యువిలు సమకూర్చేందుకు రుణం తీసుకోవడంవల్ల అదెలా సాధ్యమవుతుంది? పర్యావరణ పరిరక్షణకు ప్రభుత్వం అగ్ర ప్రాధాన్యమివ్వాలి. వ్యక్తిగత వాహనాల వినియోగాన్ని నిరుత్సాహపరచి ప్రజారవాణా వ్యవస్థను మరింతగా ఉపయోగించుకోవడాన్ని ప్రోత్సహించాలి. మన నదులు, అడవులను సంపూర్ణంగా సంరక్షించాలి. ఇది జరిగినప్పుడు మాత్రమే పర్యావరణ విధ్వంసం తగ్గిపోవడంతో పాటు ధరల పెరుగుదల అదుపు చేయడం సాధ్యమవుతుంది.


భరత్ ఝున్‌ఝున్‌వాలా

(వ్యాసకర్త ఆర్థికవేత్త, బెంగుళూరు ఐఐఎం రిటైర్‌్డ ప్రొఫెసర్‌)

Updated Date - 2022-01-25T06:27:00+05:30 IST