అమరావతిలో అల్లర్లకు ప్రభుత్వం కుట్ర!

ABN , First Publish Date - 2020-10-24T09:04:13+05:30 IST

అమరావతి రైతులు చేస్తున్న ఉద్యమాన్ని అవహేళనగా మాట్లాడిన ప్రభుత్వం.. ఇప్పుడు కొత్తగా తమకు వ్యతిరేకంగా పెయిడ్‌ ఉద్యమాన్ని మొదలు పెట్టించిందని అమరావతి పరిరక్షణ సమితి

అమరావతిలో అల్లర్లకు ప్రభుత్వం కుట్ర!

‘పెయిడ్‌’ ఉద్యమానికి అందుకే అనుమతి

మోదీ ఇటు వైపు చూసేలా చేస్తాం

అమరావతి జేఏసీ నేతల వెల్లడి

మహిళల చీరల సంగతి నీకెందుకు?

విష్ణువర్థన్‌రెడ్డిపై మహిళా జేఏసీ ఫైర్‌


విజయవాడ/గుంటూరు, అక్టోబరు 23(ఆంధ్రజ్యోతి): అమరావతి రైతులు చేస్తున్న ఉద్యమాన్ని అవహేళనగా మాట్లాడిన ప్రభుత్వం.. ఇప్పుడు కొత్తగా తమకు వ్యతిరేకంగా పెయిడ్‌ ఉద్యమాన్ని మొదలు పెట్టించిందని అమరావతి పరిరక్షణ సమితి నాయకులు విమర్శించారు. విజయవాడ ఆటోనగర్‌లోని అమరావతి జేఏసీ కార్యాలయంలో నాయకులు శివారెడ్డి, సుధాకర్‌, శిరీష, అన్నపూర్ణ మీడియాతో మాట్లాడారు. పోలీసు కవాతు సహాయంతో పెయిడ్‌ ఆర్టిస్టులు తమ సభావేదిక వద్దకు వచ్చి పోటీగా మరో కార్యక్రమం పెట్టడం నీచమైన చర్యని అన్నారు.


బీజేపీ నేత విష్ణువర్థన్‌రెడ్డి నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని సూచించారు. మహిళల వస్త్రధారణతో ఆయనకు సంబంధం ఏమిటని వారు ప్రశ్నించారు. రాజధానికి ప్రధాని మోదీ శంకుస్థాపన చేసినందున ఆయన చూపును అమరావతి వైపు ఉండేలా చేసి తీరతామని స్పష్టం చేశారు. అమరావతి ఉద్యమానికి మద్దతు పెరుగుతుందన్న భయం ప్రభుత్వంలో మొదలైందన్నారు. అందుకే అమరావతి ఉద్యమాన్ని విచ్ఛన్నం చేయడానికి మూడు రాజధానుల ఉద్యమాన్ని చేయిస్తోందని మండిపడ్డారు. తమకు పోటీగా ఆందోళన చేసిన వారిలో ఒక్కరైనా భూమి ఇచ్చారా? అని ప్రశ్నించారు.


కాగా,  రాష్ట్ర పాలనంతా అమరావతి నుంచే కొనసాగాలన్న డిమాండ్‌తో ఆ ప్రాంత రైతులు చేస్తున్న ఉద్యమం శుక్రవారానికి 311వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా రైతులు, మహిళలు మాట్లాడుతూ.. ‘‘ఎన్ని మాటలైనా పడతాం.. అమరావతిని కాపాడుకుంటాం’’అని స్పష్టం చేశారు. 




మహిళలన్న గౌరవం లేదా?!

రాజధాని కోసం ఉద్యమం చేస్తున్న మహిళలు కొందరు రూ.50 వేల ఖరీదు చేసే చీరలు కడుతున్నారంటూ బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్థన్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై అమరావతి మహిళా జేఏసీ మండిపడింది. మహిళల చీరల గురించి విష్ణువర్థన్‌రెడ్డికి ఎందుకని జేఏసీ నేత సుంకర పద్మశ్రీ శుక్రవారం ఓ ప్రకటనలో నిలదీశారు.


ప్రధాని చేతుల మీదుగా ఊపిరిపోసుకున్న అమరావతిని సీఎం జగన్‌ చంపేస్తుంటే విష్ణువర్థన్‌రెడ్డి ఎక్కడ దాక్కున్నారని ప్రశ్నించారు. జగన్‌ నిర్ణయాన్ని వ్యతిరేకించలేని వారు ఉద్యమంలో ఉన్న మహిళలపై మాత్రం నోరు జారుతున్నారన్నారు. మహిళలన్న గౌరవం లేకుండా వాళ్ల వస్త్రధారణ గురించి మాట్లాడడం సిగ్గు చేటన్నారు. విష్ణువర్థన్‌రెడ్డి ఇకనైనా నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని హితవు పలికారు.


Updated Date - 2020-10-24T09:04:13+05:30 IST