నా అంతానికి ప్రభుత్వం కుట్ర..

ABN , First Publish Date - 2022-05-27T09:07:33+05:30 IST

‘నన్ను ఎన్‌కౌంటర్‌ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కుట్ర పన్నింది. ఇప్పటికే రెండుసార్లు ప్రయత్నించింది.

నా అంతానికి ప్రభుత్వం కుట్ర..

  • రెండుసార్లు ఎన్‌కౌంటర్‌ చేయాలనుకున్నారు
  • సీఎం డైరెక్షన్‌.. సజ్జల యాక్షన్‌ ప్లాన్‌
  • ఏలూరు మొబైల్‌ కోర్టులో చింతమనేని కేసు

ఏలూరు, మే 26 (ఆంధ్రజ్యోతి): ‘నన్ను ఎన్‌కౌంటర్‌ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కుట్ర పన్నింది. ఇప్పటికే రెండుసార్లు ప్రయత్నించింది. టీడీపీ నాయకులు స్పందించకుంటే ఎప్పుడో చనిపోయేవాడ్ని. నా లాయర్‌కు సజ్జల వార్నింగ్‌ ఇచ్చారు. ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని ప్రశ్నించినందుకు నాపై కేసులు పెట్టి వేధిస్తున్నారు. ప్రభుత్వం నుంచి ప్రాణహాని ఉంది. సీఎం జగన్‌తోపాటు సజ్జల రామకృష్ణారెడ్డి, మాజీ డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌, నవ్‌జ్యోత్‌సింగ్‌ గ్రేవల్‌తో పాటు స్థానిక పోలీసులు, అధికారులు, సహకరించిన 21 మందిని శిక్షించాలి’ అంటూ ఏలూరు మొబైల్‌ కోర్టులో దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ ప్రైవేట్‌ కేసు దాఖలు చేశారు. కేసు విచారణకు స్వీకరించిన న్యాయస్థానం తదుపరి ఉత్తర్వులను త్వరలో వెల్లడిస్తుందని సీనియర్‌ న్యాయవాది ఈ .శ్రీనివాసబాబు తెలిపారు.


ఈ సందర్భంగా చింతమనేని విలేకరులతో మాట్లాడుతూ.. 2019లో ఒకసారి, 2021లో మరోసారి ఎన్‌కౌంటర్‌కు ప్రయత్నించారని, ఇందుకు ప్రత్యక్ష సాక్షుల ఆధారాలను న్యాయస్థానానికి సమర్పిస్తున్నానని చెప్పారు. ‘2021 ఆగస్టు 28న దుగ్గిరాల నుంచి బయల్దేరిన మేము దారాలమ్మను దర్శించుకుని 29న తిరుగు ప్రయాణమయ్యాం. నర్సీపట్నం చేరుకునే సరికి పశ్చిమ గోదావరి పోలీసులు నా కారును ఆపి, బలవంతంగా వాళ్ల కారులోకి ఎక్కించి, చింతపల్లి పోలీ్‌సస్టేషన్‌కు తీసుకెళ్లారు.


మరుసటి రోజు రాత్రి 11.30కు కొన్ని ఖాళీ పేపర్లపై  సంతకాలు చేయించుకున్నారు.  ఉదయం 5.30కు చింతపల్లి పోలీస్‌ స్టేషన్‌ నుంచి తీసుకెళ్లారు. దూబచర్ల చేరుకునేసరికి మా వాహనంలో ఉన్న సీఐ ఫోన్లో ఒక అజ్ఞాత వ్యక్తితో ఎన్‌కౌంటర్‌ గురించి వివరిస్తుండటాన్ని గమనించాను. టీడీపీ నేత అచ్చెన్నాయుడు తదితరులు మీడియాకు ముందుకు రావడంతో.. పోలీసులు చివరి నిమిషంలో తమ ప్రయత్నాన్ని విరమించుకున్నారు.


తీవ్రంగా హెచ్చరించిన సజ్జల

‘2019లో మైత్రి బిల్డర్స్‌కు చెందిన బీవీఆర్‌ రావు అనే వ్యక్తి నా క్లర్క్‌ ఆది దుర్గారావును కలిసి చింతమనేనిని ఎన్‌కౌంటర్‌ చేస్తున్నారని, నన్ను కలిస్తే ఆ ఎన్‌కౌంటర్‌ ఆపొచ్చని చెప్పాడు. తర్వాత నేను బీవీఆర్‌ రావును కలవగా, అతను సజ్జల రామకృష్ణారెడ్డికి ఫోన్‌ చేసి నాకు ఇచ్చాడు. సీఎం జగన్‌ చింతమనేనిపై చాలా సీరియ్‌సగా ఉన్నారని, తాము చెప్పినదానికి ఒప్పుకుంటే చింతమనేనిని వదిలేస్తామని, లేకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని, తనను వచ్చి కలవాలని సజ్జల హెచ్చరించారు. ఆ తర్వాత దుగ్గిరాల వచ్చిన చింతమనేనిని అరెస్ట్‌ చేశారు. కోర్టుకు హాజరు పరచకుండా తడికెలపూడి వద్ద గల పోలీసు ఫైరింగ్‌ గ్రౌండ్‌ వైపు తీసుకెళ్లారు. జోగన్నపాలెం వద్ద టీడీపీ కార్యకర్తలు పోలీసులను అడ్డుకున్నారు. ఆ ఘటనలో చింతమనేనితోపాటు పలువురిపై 15 కేసులు పెట్టారు. 65 రోజులపాటు రిమాండ్‌లో ఉంచారు’ అని అడ్వకేట్‌ శ్రీనివాసబాబు తెలిపారు. వీటిపై ఏపీ ప్రభుత్వానికి, కేంద్ర హోం శాఖకు 2021 సెప్టెంబరు 8న ఫిర్యాదు చేశామని వారు పట్టించుకోకపోవడంతో కోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందని చింతమనేని చెప్పారు.

Updated Date - 2022-05-27T09:07:33+05:30 IST