అసైన్‌మెంట్‌ భూములపై ప్రభుత్వ పంజా!

ABN , First Publish Date - 2022-04-08T07:07:11+05:30 IST

నిరుపేదలకు పంచిన అసైన్‌మెంట్‌ భూములను ఉభయ తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు తిరిగి స్వాధీనం చేసుకునే ప్రయత్నాలు మొదలుపెట్టాయి. భూములు అన్యాక్రాంతమవుతున్నాయనే నెపంతోను...

అసైన్‌మెంట్‌ భూములపై ప్రభుత్వ పంజా!

నిరుపేదలకు పంచిన అసైన్‌మెంట్‌ భూములను ఉభయ తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు తిరిగి స్వాధీనం చేసుకునే ప్రయత్నాలు మొదలుపెట్టాయి. భూములు అన్యాక్రాంతమవుతున్నాయనే నెపంతోను, పట్టాదారులు ఆ భూములను వ్యవసాయేతర పనులకి వాడుతున్నారనే అభియోగాలతోను వాటిని ప్రభుత్వ ఖాతాలో జమ వేసుకొని, వేలం వేసి, నిధులను సమకూర్చుకోవాలని చూస్తున్నాయి. కొన్నిచోట్ల సంపన్నులు అసైన్‌్డ భూములను కొనుగోలు చేసారు. వాటిని రెగ్యులరైజ్‌ చేసుకునేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నారు. దీనివల్ల ఇటు ప్రభుత్వానికి, సంపన్నులకు లాభం చేకూరుతుంది. 


అసైన్‍మెంట్ భూమిపై హక్కును ప్రభుత్వం తన దగ్గరే ఉంచుకొని, పట్టా సర్టిఫికెట్‌లో ‘అనుభవించే అర్హత’ మాత్రమే ఇస్తుంది. ఆ భూమిని పట్టా పొందిన వ్యక్తి, అతని వారసులు వంశపారంపర్యంగా దానిని అనుభవించవచ్చు. కానీ ఏ రకమైన భూమి బదలాయింపు గానీ, భూమి స్వభావాన్ని మార్చడం గానీ చేయకూడదు. వ్యవసాయేతర భూమిగా మార్చకూడదు. అమ్మటం, కొనటం రెండూ చెల్లవు.  


పట్టా సర్టిఫికెట్టుకు తెలంగాణ ప్రాంతమైతే ‘డి ఫారం’, ఆంధ్ర, రాయలసీమల్లో అయితే ‘డికెటి’ సర్టిఫికెట్‌ ఇచ్చారు. ఈ సర్టిఫికెట్ జారీ చేసే ముందు భూమి స్వభావం, అతను వాస్తవ సాగుదారా కాదా, అతని సామాజికార్థిక స్థితిగతులేమిటన్నవి అంచనావేస్తారు. మండలంలోని ఒక గ్రామంలో కొందరికి అసైన్‌మెంట్‌ పట్టాలు ఇవ్వాలంటే ఎవరూ స్వయంగా నిర్ణయం తీసుకునే వెసులుబాటు లేదు. కేవలం రెవెన్యూ అధికారులు స్థానిక ప్రజాప్రతినిధుల ప్రమేయంతో ఈ ప్రక్రియ జరిగేది. పట్టా ఎవరికి ఇవ్వాలి, ఎంత ఇవ్వాలి అన్నది కలిసి నిర్ణయించి ఆమోదించేవారు. అసైన్‌మెంటు రిజిస్టరులో అర్హత పొందినవారి పేర్లను నమోదు చేసి, అందరి ఆమోదం పొందిన వారికి అసైన్‌మెంటు పట్టా జారీ చేసేవారు. ఇదంతా ఒక సంక్షేమ కార్యంలా ఉండేది. ఇలాగే మండల వారీగా జిల్లాల వారీగా రాష్ట్రం మొత్తంగా జరిగేది. ఇలా వ్యవసాయ వృత్తిదారులు, వ్యవసాయ ఆధారిత కుటుంబాలు జీవనోపాధిని పొందడం ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు 2013 వరకు కొనసాగింది. రెండు రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత ఒక్కసారి కూడా అసైన్‌మెంటు కమిటీలు కూర్చోలేదు. ఎవరికీ ఎకరం అసైన్‌మెంట్‌ పట్టా సర్టిఫికెట్ ఇవ్వలేదు.


1951 నుంచి 2014 చివరి వరకు– అంటే భూ పంపిణీ మొదటి విడత, రెండవ విడత, ఏడవ విడత అంటూ కాంగ్రెసు ప్రభుత్వం జారీ చేసేనాటికి– ఉమ్మడి రాష్ట్రంలో పంపిణీ చేసిన భూమి మొత్తం అరవై మూడు లక్షల ఎకరాలు. తెలంగాణలో ముప్పై లక్షల ఎకరాలు, ఆంధ్ర రాయలసీమల్లో దాదాపుగా ముప్పై మూడు లక్షల ఎకరాలు పంపకాలు జరిగాయి. ఇంతటి ఉన్నతమైన కార్యాచరణకు చట్టం లేదు. ఎప్పుడో తయారు కాబడిన కార్యనిర్వాహక ఆదేశాలు మాత్రమే ఉన్నాయి. 2001 వరకు ఉన్న సమాచారం ప్రకారం ఉభయ రాష్ట్రాల్లో 42,45,607 ఎకరాల బంజరు భూమి, 1,26,007 ఎకరాల భూదాన భూమి, మిగులు సీలింగ్‌ 5,82,319... ఇలా మొత్తంగా 50 లక్షల ఎకరాల వరకు, తర్వాతి పన్నెండేళ్లలో దాదాపుగా పది–పన్నెండు లక్షల ఎకరాల వరకు, తహశీల్దారు ప్రొసీడింగ్స్ ద్వారా విడిగా పట్టాలు ఇచ్చారు.  


రాను రాను భూమి విలువ పెరిగిపోవడం, ఖాళీ భూముల విస్తీర్ణం తగ్గిపోవడం, ప్రభుత్వాలకు ఇతరత్రా అవసరాలు పెరగటంతో ఈ భూ పంపిణీ ప్రక్రియ మందగించింది. అంతేగాక, అసైన్‌మెంటు పట్టాదారులు ఈ భూములను అమ్ముకోవడం, బదలాయించడం, రూపాన్ని మార్చడం జరుగుతూ వచ్చింది. వాటి స్థానంలో బోగస్‌ పట్టా సర్టిఫికెట్లు వచ్చాయి. పట్టా ఒకరి పేరున ఉంటుంది, పట్టా సర్టిఫికెటు మీద ఇతరుల ఫోటో ఉంటుంది. వాస్తవ సాగుదారు ఎవరనేది కనుక్కునే పరిస్థితి లేదు. ఈ ఒడుదుడుకులే కాకుండా ఎన్నో ఎకరాలు రిజిస్ట్రారు దగ్గర లావాదేవీలతోపాటు అడంగల్‌, పహాణీలలో మార్పులు జరిగిపోయాయి. దీనికి కారణం ఒక చట్టంగా రూపుదిద్దుకోకపోవడమే. 


ఎంత లేదన్నా నలభైశాతం అసైన్‌మెంటు భూములు అన్యాక్రాంతమయ్యాయి. అతితక్కువగా ఇరవై శాతం అనుకున్నా పన్నెండు లక్షల ఎకరాలు ఖచ్చితంగా అన్యాక్రాంతమయ్యాయి. ఇదంతా దృష్టిలో ఉంచుకొని, చాలా సంవత్సరాల క్రితం, అంటే జనవరి 21, 1977లో, అసైన్‌మెంటు భూముల అన్యాక్రాంత నిషేధ చట్టం వచ్చింది (చట్టం 1/77). ఈ చట్టం ప్రకారం అసైన్‌మెంటు భూములను కొన్నా, అమ్మినా చెల్లదు. పై చట్టంతో అన్యాక్రాంతం అనే పదానికి విస్తృతమైన అర్థాన్ని ఇచ్చారు. అమ్మినా, కొన్నా భూమిని స్వాధీనం చేసుకొని అదే పట్టాదారుకు లేదా అతని వారసులకు తిరిగి అప్పగించాలి. ఆ భూమిని కొన్న వ్యక్తికి రెండువేల రూపాయల జరిమానా లేదా ఆరు నెలలు జైలు శిక్ష విధించవచ్చు లేదా రెండు శిక్షలనూ వేయవచ్చును. కానీ, గత నలభై తొమ్మిదేళ్ళుగా ఈ చట్టం ఎక్కడా అమలయ్యింది లేదు. ఏ ఉద్యమాలు జరగలేదు, ఏ వామపక్షీయులు అడగలేదు. కనీసం తహశీల్దారు వద్ద వివరాలు సేకరించి ఉల్లంఘనలపై చర్య తీసుకొమ్మని ఎవ్వరూ డిమాండ్‌ చేయలేదు.  


ఒక్క ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోనే ఇరవై అయిదు వేల ఎకరాల అసైన్‌మెంటు భూములు అన్యాక్రాంతం అయినట్లు ప్రభుత్వం ప్రకటించింది. 1969 నుంచి 2014 వరకు అసైన్‌ చేసిన బంజరు, భూదాన, మిగులు సీలింగ్‌ భూములన్నీ కలిపి కేవలం ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోనే 1,50,000 మంది అసైన్‌మెంటు పట్టాలు పొంది ఉన్నారు. అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడైనా ఉమ్మడి రంగారెడ్డి జిల్లా భూములు ‘బంగారు గనులు’. అందుకనే ముందుగా తెలంగాణ రాష్ట్రంలో పాత రంగారెడ్డి జిల్లాలో కొని దాచుకున్న పెద్దవాళ్ళందరి భూములను కాపాడేందుకు, రెగ్యులరైజ్‌ చేయాలనుకునే గ్రామాలను, అసైన్‌మెంటు భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని అంతా అనుకుంటున్నారు. 


ఇలా స్వాధీనం చేసుకున్న భూములను ప్రభుత్వం తన భూములుగా ప్రకటించుకుంటున్నది. అసలు అసైనీలు ఎంత మొత్తుకున్నా ఎక్కడా చెప్పుకోవడానికి ఆస్కారం లేదు. సాధారణ పౌరుడు అసైన్‌మెంటు కండిషన్స్‌ ఉల్లంఘిస్తే శిక్ష ఉంటుందని చట్టం 1/77 చెపుతుంది. కాని ఇక్కడ భూమిని అన్యాక్రాంతం చేస్తున్నది స్వయంగా ప్రభుత్వమే కదా! పూట గడవని రైతు తప్పుకు శిక్ష ఉంటుంది. మరి అసైన్‌మెంటు భూములను బహిరంగంగా వేలం వేయాలనుకుంటున్న ప్రభుత్వ పెద్దల వైఖరికి ఏ శిక్ష విధించాలి? ప్రజా సంఘాలవాళ్ళు, హక్కుల సంఘాల వాళ్ళు, సామాజిక కార్యకర్తలు, న్యాయవాదులు అంతా కలిసి ఈ అన్యాయమైన ప్రక్రియను ఆపమని కోరుదాం. పేదల భూముల వేలాన్ని అడ్డుకుందాం. 

వి. బాలరాజు

రిటైర్డు తహశీల్దారు

Updated Date - 2022-04-08T07:07:11+05:30 IST