ప్రభుత్వ బస్సు దారెటు?

ABN , First Publish Date - 2020-02-24T09:38:41+05:30 IST

‘మీ సంక్షేమం ప్రభుత్వం చూసుకుంటుంది. మీరు సంస్థను లాభాల బాటలోకి తీసుకొచ్చేందుకు శ్రమించండి’ ప్రజా రవాణా శాఖ ఉద్యోగులకు గత ఏడాది జూన్‌లో సీఎం జగన్‌ చేసిన సూచన ఇది.

ప్రభుత్వ బస్సు దారెటు?

ప్రైవేటు బస్సుల వైపు ఎండీ చూపు

ఎలా కుదురుతుందన్న మంత్రి, సిబ్బంది

సీఎం సూచనకు భిన్నంగా యాజమాన్యం వైఖరి

మండి పడుతున్న అధికారులు, సిబ్బంది


అమరావతి, ఫిబ్రవరి 23(ఆంధ్రజ్యోతి): ‘మీ సంక్షేమం ప్రభుత్వం చూసుకుంటుంది. మీరు సంస్థను లాభాల బాటలోకి తీసుకొచ్చేందుకు శ్రమించండి’ ప్రజా రవాణా శాఖ ఉద్యోగులకు గత ఏడాది జూన్‌లో సీఎం జగన్‌ చేసిన సూచన ఇది.

‘పాత బస్సులు తీసేస్తాం. కొత్తవి కొంటాం. ప్రయాణికులకు మరింత మెరుగైన సేవలందించి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురండి’ రవాణాశాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య(నాని) పీటీడీ సిబ్బందిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలివి.

‘సంస్థ కోసం కష్టపడి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నాం. కొత్త బస్సులు మరిన్ని కొనుగోలు చేయండి. అద్దె బస్సులు పూర్తిగా తీసేయండి’ కార్మికులు చెబుతున్న మాట ఇది.

‘కొత్త బస్సులు వెయ్యి కొందామని ఆర్డర్‌ ఇచ్చాం. బీఎస్‌ 4 రిజిస్ట్రేషన్‌ సమస్య ఉంది. దీంతో 300కు కుదించాం. ప్రయాణికులు వేలాడుతూ వెళుతున్నారు. సమస్య తీర్చేందుకు ప్రైవేటు విద్యాసంస్థలు, పరిశ్రమల బస్సులను అద్దెకు తీసుకొంటున్నాం’ ఎండీ మాదిరెడ్డి ప్రతాప్‌ నిర్ణయమిది.


రాష్ట్ర వ్యాప్తంగా 12 వెల బస్సులతో నిత్యం 45 లక్షల కిలోమీటర్లు ప్రయాణిస్తూ 69 లక్షల మందిని గమ్యస్థానాలకు చేరుస్తున్న ప్రజా రవాణా సంస్థ తన గమ్యం ఏమిటో తెలియని స్థితిలోకి పయనిస్తోంది. పెరుగుతున్న డీజిల్‌ ధరలు, ప్రైవేటు రవాణా, పల్లె వెలుగు బస్సులపై భారీ నష్టాల కారణంగా కుదేలవుతున్న ఆర్టీసీని గాడిలో పెట్టేందుకు ప్రభుత్వం సిబ్బందిని సర్కారులో విలీనం చేసి ప్రతి నెలా రూ.270 కోట్ల వరకు జీతాలు భరిస్తోంది. ఏడాదికి ఆర్టీసీకి రూ.1200 కోట్లు నష్టం వాటిల్లుతుండగా రూ.3 వేల కోట్ల జీతాలు ప్రభుత్వం చెల్లిస్తోంది. మిగిలే రూ.2 వేల కోట్ల మొత్తంతో కొంత మేర అప్పులు తీర్చుకుని మరికొంత సొమ్ముతో కొత్త బస్సులు కొనుగోలు చేసి సంస్థను బలోపేతం చేయాలని స్పష్టంగా సూచించింది. ఇంత మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన ఆర్టీసీ యాజమాన్యం ‘ఇన్నోవేటివ్‌’ ఆలోచనల పేరుతో రూటు మారుస్తోంది. సొంత బస్సులు పెంచుకోవడానికి రిజిస్ట్రేషన్‌ ఇబ్బందులను చూపుతూ ప్రైవేటు వాహనాలను గంటల ప్రకారం అద్దెకు తీసుకోవడానికి చర్చలు జరిపింది. ఆర్టీసీ బస్టాండ్‌లోకి వచ్చి నేరుగా ప్రయాణికులను తీసుకెళ్లవచ్చని, ఆర్టీఏతో ఇబ్బంది లేకుండా తాము టోకెన్లు ఇస్తామని ఎండీ మాదిరెడ్డి ప్రతాప్‌ భరోసా ఇచ్చారు. దీనిపై ఆర్టీసీ అధికారులు, సిబ్బంది అభ్యంతరం చెబుతున్నా ఎండీ ముందుకే అంటున్నారు. దీంతో కార్మిక సంఘాల నేతలు సమస్యను మంత్రి పేర్ని నాని దృష్టికి తీసుకెళ్లారు. ఈ నిర్ణయాలు ఆర్టీసీ ఉనికికే ప్రమాదమని వివరించడంతో ప్రైవేటు బస్సులను ఎట్టి పరిస్థితుల్లోనూ తమ బస్టాండ్లలోకి రానివ్వబోమని మంత్రి ప్రకటించారు.


మన బస్సులు మూలన పెట్టి?

ప్రైవేటు విద్యా సంస్థల బస్సులు 4 గంటలు మాత్రమే తిరుగుతాయని, మిగిలిన 20 గంటలు నిలిచే ఉంటున్నాయని, అలాంటి నిరర్ధక ఆస్తులను ప్రజల ప్రయాణ సౌకర్యం మెరుగు పరిచేందుకు వాడుకుంటే తప్పేంటని ఎండీ ప్రశ్నిస్తున్నారు. అయితే, దీనిపై సంస్థ సిబ్బందే పెదవి విరుస్తున్నారు. ప్రైవేటు వాళ్లపై అంత ప్రేమ చూపించే ఎండీకి సొంత బస్సులు నిరర్ధకంగా ఉన్నా ఎందుకు కనిపించలేదని ప్రశ్నిస్తున్నారు.

Updated Date - 2020-02-24T09:38:41+05:30 IST