సర్కారు బడి.. సమస్యల ఒడి

ABN , First Publish Date - 2022-06-13T05:54:38+05:30 IST

వేసవి సెలవులు ముగిసి పాఠశాలలు నేటి నుంచి ప్రారంభమవుతున్నాయి.

సర్కారు బడి.. సమస్యల ఒడి


  • అరకొర వసతులు..  నేటి నుంచి పాఠశాలల పునఃప్రారంభం
  • ప్రభుత్వ బడుల్లో కొరవడిన వసతులు
  • కొత్త విద్యా సంవత్సరంలోనూ పాత సమస్యల స్వాగతం
  • విద్యార్థులకు, సిబ్బందికి సరిపడా లేని ఫర్నిచర్‌
  • వసతులు కల్పించేందుకు మన ఊరు-మన బడి కార్యక్రమం
  • ప్రతి మండలంలో రెండేసి పాఠశాలల ఎంపిక 
  • వాటిల్లోనూ పూర్తికాని పనులు

వేసవి సెలవులు ముగిసి పాఠశాలలు నేటి నుంచి ప్రారంభమవుతున్నాయి. సోమవారం బడిగంట మోగనుండడంతో అన్ని ఏర్పాట్లతో విద్యార్థులు, తల్లిదండ్రులు సిద్ధమవుతున్నారు. ఇదిలా ఉంటే ప్రభుత్వ పాఠశాలల్లో ఏళ్లుగా నెలకొన్న సమస్యలు విద్యార్థులకు స్వాగతం పలకనున్నాయి. ఉపాధ్యాయుల కొరత, స్కూళ్లలో వసతుల లేమి, పాత భవనాలు, పెచ్చులూడుతున్న   పైకప్పులు, తాగునీటి సౌకర్యం లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. పాఠశాలల్లో అన్ని వసతులూ కల్పిస్తామని ప్రభుత్వం చేపట్టిన మన ఊరు-మన బడి కార్యక్రమ మొదటి దశలో మండలానికి రెండు చొప్పున పాఠశాలలను ఎంపిక చేసినా పనులు పూర్తికాలేదు. మొత్తం ప్రభుత్వ పాఠశాలల్లో వీటి సంఖ్య చాలా స్వల్పం. మెజార్టీ విద్యార్థులు అరకొర వసతుల మధ్యే విద్యా సంవత్సరాన్ని పూర్తి చేయాల్సిన పరిస్థితి ఉంది.

ఆంధ్రజ్యోతి, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నెట్‌వర్క్‌, జూన్‌ 12: వేసవి సెలవుల అనంతరం సోమవారం నుంచి బడులు ప్రారంభం అవుతున్నాయి. ఉత్సాహంగా పాఠశాలలకు చేరుతున్న విద్యార్థులకు ఉమ్మడి జిల్లాలో శిథిలావస్థలోని భవనాలు, పెచ్చులూడుతున్న పైకప్పులు, చెత్తతో నిండిన ప్రాంగణాలు, కళావిహీనంగా ఉన్న పాఠశాల ఆవరణలు స్వాగతం పలుకుతు న్నాయి. దీంతో పిల్లల్లో ఉత్సాహం ఆవిరైపోతోంది. అధిక శాతం ప్రభుత్వ స్కూళ్లలో ఏళ్లు గతిస్తున్నా సౌకర్యాలు మెరుగుపడడం లేదు. విద్యార్థులు కూర్చునేందుకు సరిపడా బెంచీలు లేవు. విరిగిన బల్లలు, కుర్చీలతో వారు సరిపెట్టుకుంటున్నారు. ఉపాధ్యాయ సిబ్బంది కొరతా తప్పడం లేదు.

విద్యార్థులకు సమస్యల స్వాగతం

ఉమ్మడి జిల్లాలో చాలా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు సరైన తాగునీటి వసతి లేదు. వారు ఇళ్లనుంచే బాటిళ్లలో నీటిని తెచ్చుకుంటున్నారు. కాలకృత్యాలకు బాత్రూంలు, టాయ్‌లెట్ల సౌకర్యం లేదు. అలాంటి పరిస్థితుల్లో వారు ఇళ్లకు పరుగెత్తుతున్నారు. అరకొరగా మరుగుదొడ్లు ఉన్నా వాటికి నీటి సౌకర్యం లేక వినియోగంలో లేవు. స్కూళ్ల ఆవరణలు చెత్తతో నిండాయి. వేసవి సెలవుల్లో నిర్వహణ లేక పారిశుధ్యం లోపించింది. కొన్ని చోట్ల పాఠశాలలకు ప్రహరీ లేకపోవడం, ఉన్నా గేట్లు పెట్టకపోవడం తదితర కారణాలలో ప్రాంగణాల్లో మద్యం తాగి సీసాలు పడేశారు. తరగతి గదుల్లో చిందరవందర చేశారు. పాఠశాలల ఆవరణల్లోకి పశువుల వచ్చి పేడ నింపేశాయి. కొన్ని చోట్ల పొదలు కప్పేశాయి. ఉదాహరణకు వికారాబాద్‌ జిల్లా పెద్దేముల్‌ మండలం జనగామ పాఠశాలలో పాఠశాల భవనం వెనక ముళ్లపొదలు పరుచుకున్నా వాటిని తొలగించలేదు. ప్రభుత్వ పాఠశాలల్లో పుస్తకాలు, డ్రెస్సులు అందజేస్తున్నా వాటిని విద్యా సంవత్సరం ప్రారంభంలో ఇవ్వడం లేదు. పూర్తిస్థాయిలో అందించేందుకు నెలన్నర వరకు పడుతోంది. మొత్తానికి నూతన విద్యా సంవత్సరంలోకి అడుగుపెడుతున్న విద్యార్థులకు పాత  సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి.

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అవే ఇబ్బందులు

ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో మొత్తం 197 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా.. మన ఊరు-మన బడి కింద 62 పాఠశాలలు ఎంపికయ్యాయి. 12 అంశాలతో పాఠశాలల్లో అదనపు తరగతి గదులు, నీటి వసతి, ప్రహరీల నిర్మాణం, విద్యుదీకరణ, పాత గదుల మరమ్మతులు, పెయింటింగ్‌, ఫర్నిచర్‌, డిజిటల్‌ క్లాస్‌ రూం, గ్రీన్‌ బోర్డుల ఏర్పాటు తదితర పనులు చేపట్టాల్సి ఉంది. అయితే ఎంపికైన 21 పాఠశాలల్లో కేవలం తరగతి గదుల మరమ్మతులు, నీటి వసతి పనులు మాత్రమే చేస్తున్నారు. కొన్ని పాఠశాలల ఆవరణలు చెత్తతో నిండాయి. ఆమనగల్లు, కడ్తాల్‌, తలకొండపల్లి, మాడ్గుల మండలాల్లో ప్రభుత్వ పాఠశాలల్లో వసతుల్లేవు. విద్యార్థుల సంఖ్యకు సరిపడా తరగతి గదులు, మరుగుదొడ్లు, మూత్రశాలలు లేవు. కొన్ని చోట్ల మురుగుదొడ్లు, మూత్రశాలలు ఉన్నా నీటి వసతి లేక వాటిని వినియోగించడం లేదు. పాఠశాలల ఆవరణల్లో పిచ్చి మొక్కలు, చెత్తతో నిండిపోయాయి. ఈ మండలాల్లో మన ఊరు-మన బడి పనులు ప్రారంభమే కాలేదు. ఆమనగల్లు బస్టాండ్‌ ఉన్నత పాఠశాల భవనం శిథిలావస్థకు చేరింది. చేవెళ్ల డివిజన్‌లో మన ఊరు-మన బడికి ఎంపికైన పాఠశాలల్లో ఏ ఒక్క దగ్గరా పనులు పూర్తి కాలేదు. క్రీడామైదానాలు, వంట గదుల నిర్మాణం, అదనపు తరగతి గదులకు స్థలాల ఎంపిక చేపట్టినట్టు ఎంఈవోలు తెలిపారు. మేడ్చల్‌ నియోజకవర్గంలో ఉన్న 193 ప్రభుత్వ పాఠశాలల్లో మన ఊరు-మన బడికి 77స్కూళ్లు ఎంపికయ్యాయి. మండలానికి రెండేసి పాఠశాలల్లో చేపట్టిన పనుల్లో ఏ ఒక్క స్కూల్లోనూ సగమైనా పనులు కాలేదు. వికారాబాద్‌ జిల్లా ధారూరు మండలం నాగారం ప్రాథమిక పాఠశాల శిథిలావస్థకు చేరింది. ఈ స్కూలు విద్యార్థులను ఉన్నత పాఠశాల భవనంలోకి మార్చారు. ప్రైమరీ స్కూలుకు కొత్త భవనాన్ని నిర్మించలేదు. ఇదే జిల్లా మర్పల్లి మండలం జంషెడ్‌పూర్‌లో పాఠశాల రెండు భవనాలు శిథిలావస్థకు చేరుకున్నా మన ఊరు-మన బడికి ఎంపిక చేయలేదు. చాలా పాఠశాలల్లో నీటి సరఫరా లేక మరుగుదొడ్ల నిర్వహణ సమస్యగా మారింది. వర్షం కురిస్తే తరగతి గదుల్లోకి నీరొచ్చి ఇబ్బందులు పడే పరిస్థితి మర్పల్లి మండలంలో ఎక్కువ స్కూళ్లలో నెలకొంది.

పూర్తికాని ‘మన ఊరు-మన బడి’ పనులు

కొడంగల్‌ నియోజకవర్గంలో మన ఊరు-మన బడి కింద 24 పాఠశాలలు ఎంపికయ్యాయి. నియోజకవర్గంలో మొత్తం 69 పాఠశాలలుండగా 14 పాఠశాలలు ఉపాధ్యాయుల కొరతతో మూతపడ్డాయి. అంగడిరైచూర్‌, హస్నాబాద్‌ గ్రామాల్లో మన ఊరు-మన బడి పనులు చేస్తున్నారు. తాండూరు నియోజకవర్గంలో మన ఊరు-మన బడి కింద మండలానికి రెండు స్కూళ్ల చొప్పున ఎంపికచేశారు. ఏ పాఠశాలలోనూ పనులు పూర్తిచేయలేదు. పెద్దేముల్‌ మండలం కందనెల్లి, మంబాపూర్‌, తాండూరు మండలం కరన్‌కోట్‌, గౌతాపూర్‌, బషీరాబాద్‌ మండలం మంతట్టి, కొర్విచెడ్‌, యాలాల మండలం రాస్నం, నాగసముందర్‌, తాండూరు పట్టణ మల్‌రెడ్డిపల్లి పాఠశాలల్లో పనులు ప్రారంభ దశలోనే ఉన్నాయి. మోమిన్‌పేట్‌ మండలంలో 19 పాఠశాలలను ఎంపిక చేయగా చంద్రాయన్‌పల్లి, చీమల్‌దరిలో పనులు ప్రారంభించారు. బంట్వారం మండలంలో 7 పాఠశాలలను ఎంపిక చేయగా.. ఒక్క తోర్మామిడి ఉర్దూ మీడియం పాఠశాలలోనే పనులు ప్రారంభించారు. కోట్‌పల్లి మండలంలో 9 పాఠశాలలను ఎంపిక చేస్తే అన్నసాగర్‌, మల్‌శెట్టిపల్లి తండాలో పనులు ప్రారంభమయ్యాయి. నవాబుపేట మండలంలో 15 పాఠశాలలను ఎంపిక చేయగా చించల్‌పేట్‌ స్కూల్‌లో పనులకు శంకుస్థాపన చేశారు. షాద్‌నగర్‌ నియోజకవర్గంలో 89 పాఠశాలలను మన ఊరు-మన బడికి ఎంపిక చేశారు. కొత్తూరు, ఫరూఖ్‌నగర్‌ మండలం మధురాపూర్‌, కొత్తూరు మండలం పెంజర్ల, ఎస్బీపల్లి స్కూళ్లలో పనులు చేపట్టారు. నందిగామ, కొందుర్గు, చౌదరిగూడ, కేశంపేట మండలాల్లోని పాఠశాలల్లో పనులు చేపట్టలేదు. మన ఊరు-మన బడి కింద నిర్ణయించిన పనులన్నీ ఈ సారే పూర్తిచేస్తామని షాద్‌నగర్‌ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్‌ తెలిపారు. చేవెళ్ల మండలంలో 24 పాఠశాలలు, శంకర్‌పల్లి మండలంలో 20, మొయునాబాద్‌లో 18, షాబాద్‌ మండలంలో 21 పాఠశాలలను ఎంపిక చేశారు. రూ.30లక్షల లోపు విలువైన పనులే వివిధ దశల్లో ఉన్నాయి. ఒక స్కూలులో రూ.30లక్షలకుపైగా వెచ్చించే పనులు చేయాల్సి వస్తే టెండర్లు కాల్‌ఫర్‌ చేయాల్సిందేనని అధికారులు పేర్కొంటున్నారు. వికారాబాద్‌ పట్ణణంతో పాటు మండల పరిధి 24 పాఠశాలలను మన ఊరు-మన బడికి ఎంపిక చేశారు. పులుమద్దిలోని తెలుగు మీడియం, ఉర్దూ మీడియం పాఠశాలల్లో పనులు చేపట్టారు. ధారూరు మండలంలో 19 పాఠశాలలు ఎంపిక చేయగా.. ఎక్కడా పనులు ప్రారంభం కాలేదు.

Updated Date - 2022-06-13T05:54:38+05:30 IST