డీవీసీ ట్రస్ట్‌ స్వాధీనానికి సర్కారు యత్నం

ABN , First Publish Date - 2022-06-26T07:35:22+05:30 IST

డీవీసీ ట్రస్ట్‌ స్వాధీనానికి సర్కారు యత్నం

డీవీసీ ట్రస్ట్‌ స్వాధీనానికి సర్కారు యత్నం

దేవదాయ చట్టం కింద రిజిస్టర్‌ చేస్తూ ఉత్తర్వులు

చేబ్రోలు, జూన్‌ 25: ధూళిపాళ్ల వీరయ్యచౌదరి(డీవీసీ) మోమోరియల్‌ చారిటబుల్‌ ట్రస్టు స్వాధీనానికి ప్రభుత్వం మరోసారి ప్రయత్నించింది. ట్రస్టును దేవదాయశాఖ చట్టం కింద రిజిస్టర్‌ చేస్తూ ఆ శాఖ కమిషనర్‌ హరి జవహర్‌లాల్‌ ఉత్తర్వులు జారీ చేయడం పట్ల జిల్లాలోని పాడి రైతులలో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. డీవీసీ ట్రస్టు ఆధ్వర్యంలో సంగం డెయిరీ పరిధిలోని వడ్లమూడిలో అధునాతన హాస్పిటల్‌ను నిర్మించి పాడి రైతులకు, పేదలకు కార్పొరేట్‌ వైద్యాన్ని రాయితీపై అందిస్తున్నారు. గత ఏడాది ఏప్రిల్‌లో సంగం డెయిరీలో అక్రమాలు జరిగాయంటూ మాజీ ఎమ్మే ల్యే, సంగం డెయిరీ చైర్మన్‌ ధూళిపాళ్ల నరేంద్రపై ఏసీబీ కేసు నమోదు చేసి అరెస్టు చేసింది. ఆనాటి నుంచి ప్రభుత్వం కన్ను డీవీసీ హాస్పిటల్‌పై పడింది. డీవీసీ హాస్పిటల్‌ను నిర్వహించే ట్రస్టులో నిబంధలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారం టూ.. విచారణ జరపాలని ప్రభుత్వం ప్రయత్నించినప్పటికీ కుదరలేదు. అయితే దేవదాయశాఖ చట్టంలోని సెక్షన్‌ 44 ద్వారా ట్రస్టును ప్రభుత్వం పరిధిలో రిజిస్టేషన్‌ చేయాలం టూ గత ఏడాది సెప్టెంబరులో విజయవాడ దేవదాయ శాఖ అధికారులు.. ట్రస్టు నిర్వాహకులు ధూళిపాళ్ల నరేంద్రకు నోటీసులు జారీ చేశారు. దీనిపై ట్రస్టు సభ్యులు కోర్టును ఆశ్రయించగా కేసు పెండింగ్‌లో ఉంది. ట్రస్టును ప్రస్తుత విధానంలోనే కొనసాగించాలని జిల్లాలోని 8 వేల మందికి పైగా పాడి రైతులు దేవదాయ శాఖ కమిషనర్‌కు, ప్రభుత్వానికి వినతులు పంపారు. తాజాగా కోర్టు తీర్పుకు అనుగుణంగా వ్యవహరిస్తామంటూనే ట్రస్టును దేవదాయశాఖ పరిధిలోకి రిజిస్టే్ట్రషన్‌ చేస్తున్నామంటూ కమిషనర్‌ హరిజవహర్‌లాల్‌ ఉత్తర్వులివ్వడం తీవ్ర చర్చనీయాంశమైంది. గ్రామీణ ప్రాంతంలో అతితక్కువ ధరకు వైద్యం అందిస్తున్న డీవీసీ హాస్పిటల్‌ను నిర్వీర్యం చేసేందుకు రాజకీయ వైరంతో ప్రభుత్వం కుట్ర పన్నుతోందని రైతులు ఆరోపిస్తున్నారు. 


Updated Date - 2022-06-26T07:35:22+05:30 IST