టీటీడీ ఉద్యోగులకు ఇళ్లస్థలాలు

ABN , First Publish Date - 2021-02-24T07:05:43+05:30 IST

టీటీడీ ఉద్యోగులకు ఇళ్ళస్థలాలు మంజూరు చేసేందుకు ముఖ్యమంత్రి జగన్‌ అధ్యక్షతన అమరావతిలో జరిగిన మంత్రివర్గ సమావేశం తీర్మానించింది

టీటీడీ ఉద్యోగులకు ఇళ్లస్థలాలు

పెనుమూరు, కార్వేటినగరాల్లో పీహెచ్‌సీల స్థాయి పెంపు


వెదురుకుప్పం, సదుం కేంద్రాల్లో అగ్నిమాపక కేంద్రాలు


మంత్రి వర్గ సమావేశంలో నిర్ణయాలు


తిరుపతి, ఫిబ్రవరి 23(ఆంధ్రజ్యోతి): తిరుమల-తిరుపతి దేవస్థానాల్లో పనిచేస్తున్న రెగ్యులర్‌ ఉద్యోగులకు ఇళ్ళస్థలాలు మంజూరు చేసేందుకు ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. మంగళవారం రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి జగన్‌ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో జిల్లాకు సంబంధించి ఐదు అంశాలపై నిర్ణయాలు వెలువడ్డాయి. వీటిలో టీటీడీ ఉద్యోగులు సుదీర్ఘకాలంగా నిరీక్షిస్తున్న ఇళ్ళ స్థలాల అంశం కీలకమైంది. వారికి స్థలాలు కేటాయించే విషయమై టీటీడీ అధికారులు ప్రభుత్వ అనుమతి కోరిన సంగతి తెలిసిందే. దీనిపై చర్చించిన మంత్రివర్గం ఉద్యోగులకు ఇళ్ళ స్థలాలు కేటాయించడానికి అనుమతి ఇచ్చింది.పెనుమూరు, కార్వేటినగరం మండలాల్లోని ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలను 50 పడకల ఆస్పత్రులుగా స్థాయి పెంచాలని మంత్రివర్గం నిర్ణయించింది. వెదురుకుప్పం, సదుం మండల కేంద్రాల్లో అగ్ని మాపక కేంద్రాలు నిర్మించాలని కూడా మంత్రివర్గం నిర్ణయించింది.


తిరుపతి ఉప ఎన్నికల కోసమే ఇళ్లస్థలాల ఫైల్‌కు కదలిక!

తిరుపతి పార్లమెంటు స్థానానికి త్వరలో జరగనున్న ఉప ఎన్నికల నేపధ్యంలోనే అటు టీటీడీ పెద్దలు, ఇటు రాష్ట్ర ప్రభుత్వం టీటీడీ ఉద్యోగులకు ఇళ్ళ స్థలాల విషయమై వేగంగా చర్యలు తీసుకుంటున్నట్టు సమాచారం. తిరుపతి ఉప ఎన్నికలను అటు టీడీపీ, ఇటు బీజేపీ-జనసేన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. టీడీపీ ఇప్పటికే అభ్యర్థిని ప్రకటించడం, తిరుపతిలో ఉప ఎన్నికల ప్రచార కార్యాలయాన్ని ప్రారంభించడం వంటి చర్యలతో ప్రత్యర్థులను వెనక్కి నెట్టేసింది. మరోవైపు బీజేపీ, జనసేన పార్టీలు దేనికవి తమ అభ్యర్థినే పోటీ పెట్టాలన్న పట్టుదలతో వ్యవహరిస్తున్నాయి. ఉమ్మడి అభ్యర్థిని తమ పార్టీ వైపు నుంచే ఎంపిక చేయాలన్న పంతం నుంచీ ఎవరూ వెనక్కి తగ్గడం లేదు. బీజేపీ ఈ విషయంలో చాలా దూకుడు మీదుంది. ఈ ప్రాంతంలో కార్యకలాపాలు కూడా అమాంతం పెంచేసింది. జనసేన నేతలు, కార్యకర్తలు కూడా అధినేతపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నారు. ఈ పరిస్థితుల్లో అధికార పార్టీ కూడా ఒత్తిడికి లోనవుతోంది. గత సాధారణ ఎన్నికల కంటే ఆధిక్యత తగ్గినా కూడా ప్రతిపక్షాల ఎదుట, జనంలోనూ పలచనవుతామన్న భయం వైసీపీ ముఖ్య నేతల్ని వెంటాడుతోంది. అందుకే తిరుపతి, పరిసరాల్లో వున్న టీటీడీకి చెందిన వేలాది మంది ఉద్యోగుల కుటుంబాలపై వ్యూహాత్మకంగా దృష్టి సారించారు. ఎంత తక్కువగా లెక్కించినా టీటీడీ ఉద్యోగుల కుటుంబాల ఓట్లు పాతిక వేలు దాటుతాయని అంచనా. వీటిని ఆకర్షించే వ్యూహంలో భాగంగానే హఠాత్తుగా టీటీడీ ఉద్యోగుల ఇళ్ళ స్థలాల అంశం తెరమీదకు వచ్చింది.ఉప ఎన్నికల్లో లబ్ధి పొందడానికే ఈ నిర్ణయమన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే టీటీడీలో పనిచేసే ఉద్యోగులకు ఇళ్ళ స్థలాలు కావాలంటే పెద్ద పరిమాణంలో భూములు అవసరం. భూసేకరణ కూడా పెద్ద ప్రహసనం. అవన్నీ నెలా రెండు నెలల్లో పూర్తి కావాలంటే చాలా కష్టం. ప్రతిపాదనలు మొదలుపెట్టి వాటిని నడుపుతూ ప్రచారం పొందుతుంటే ఆలోపు ఉప ఎన్నికలు ముగిసిపోతాయి. అధికార పార్టీకి ఎంతోకొంత లబ్ధి కలుగుతుందేమో కానీ ఎన్నికలు ముగిశాక ఇళ్ళ స్థలాల ప్రక్రియ అంతే వేగంగా కొనసాగుతుందా, ఉద్యోగులకు స్థలాలు దక్కుతాయా అన్నది అనుమానమేనని రాజకీయ ప్రత్యర్థులు భావిస్తున్నారు. తాజాగా రాష్ట్ర మంత్రివర్గం టీటీడీ కోరిన మేరకు ఇళ్ళ స్థలాల కేటాయింపునకు అనుమతి ఇచ్చింది. ఉప ఎన్నికలు జరిగేలోపే కార్యరూపం దాల్చి ఉద్యోగులకు స్థలాలు దక్కితే పర్వాలేదు కానీ ఆలోపు ఉత్తుత్తి ప్రచారంతో ఉద్యోగుల ఓట్లు కొల్లగొట్టే ప్రయత్నమైతే మాత్రం ప్రతిపక్షాల నుంచీ అంతే స్థాయిలో దీనిపై ఎదురుదాడి జరగడం మాత్రం ఖాయమనే చెప్పాలి.

Updated Date - 2021-02-24T07:05:43+05:30 IST