ప్రభుత్వం, ఆనందయ్య కొట్లాటగా చూడొద్దు!

ABN , First Publish Date - 2021-10-26T08:45:57+05:30 IST

ఆయుర్వేద మందు పంపిణీ విషయాన్ని ప్రభుత్వానికి, ఆనందయ్యకి మధ్య కొట్లాటగా చూడొద్దని రాష్ట్ర

ప్రభుత్వం, ఆనందయ్య కొట్లాటగా చూడొద్దు!

సాయానికి ముందుకొచ్చే వైద్యులను స్వాగతించాలి

కరోనాకు ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఎంతమంది మరణించారు

ఆనందయ్య చికిత్స తర్వాత ఎంతమంది చనిపోయారు 

ఆ నివేదిక కోరితే ప్రభుత్వమే ఇబ్బందుల్లో పడుతుంది

రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు

మందు ఆమోదం కోసం  ప్రత్యామ్నాయ 

మార్గాలను ఆశ్రయించేందుకు 

ఆనందయ్యకు స్వేచ్ఛనిస్తూ ఆదేశాలు

అమరావతి, అక్టోబరు 25 (ఆంధ్రజ్యోతి): ఆయుర్వేద మందు పంపిణీ విషయాన్ని ప్రభుత్వానికి, ఆనందయ్యకి మధ్య కొట్లాటగా చూడొద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి హైకోర్టు వ్యాఖ్యానించింది. కరోనాకు చికిత్స తీసుకుంటూ ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఎంతమంది చనిపోయారు? ఆనందయ్య ఆయుర్వేద చికిత్స తర్వాత ఎంతమంది మరణించారో వివరాలు కోరితే ప్రభుత్వమే ఇబ్బందుల్లో పడుతుందని హెచ్చరించింది. ఆయుర్వేద మందు పంపిణీ విషయంలో దాఖలైన పలు వ్యాజ్యాలు సోమవారం హైకోర్టు ధర్మాసనం ముందుకు విచారణకు వచ్చాయి. ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్‌జీపీ) సుమన్‌ స్పందిస్తూ.. ఆనందయ్య చుక్కల మందును దేశవ్యాప్తంగా 14 లేబోరేటరీల్లో పరీక్షలు చేయించామన్నారు. ఈ మందు వినియోగం వల్ల కంటిచూపు కోల్పోయే ప్రమాదం ఉందని నివేదికల్లో తేలిందన్నారు. ఆనందయ్య తన రోగులకే మందు ఇవ్వాలి తప్ప.. వేలాది మందికి పంపిణీ చేసేందుకు చట్టనిబంధనలు ఒప్పుకోవన్నారు. మందు అనుమతి కోసం ప్రభుత్వానికి ఎలాంటి ధరఖాస్తు చేసుకోలేదన్నారు. ధర్మాసనం స్పందిస్తూ.. ఆనందయ్య దగ్గరకు వచ్చేవారందరినీ ఆయన పేషెంట్లుగానే పరిగణించాలని స్పష్టం చేసింది. కొవిడ్‌ లాంటి విపత్తుల్లో సాయం చేసేందుకు ముందుకొచ్చే వైద్యులందరినీ స్వాగతించాలని, సాంకేతిక కారణాలు చూపుతూ వారిని అడ్డుకోవడం సరికాదని వ్యాఖ్యానించింది.


ఆనందయ్య లాంటి స్థానిక వైద్యులను అడ్డుకోవడం వల్ల ప్రభుత్వంపైనే ఒత్తిడి పెరుగుతుందని, కరోనా కట్టడి మరింత క్లిష్టంగా మారుతుందని వ్యాఖ్యానించింది. మందు పంపిణీ విషయంలో అనుమతులు పొందేందుకు సంబంధిత అథారిటీని ఆశ్రయించేందుకు పిటిషనర్‌కు స్వేచ్ఛనిచ్చింది.  ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా, జస్టిస్‌ ఏవీ.శేషసాయితో కూడిన ధర్మాసనం సోమవారం ఆదేశాలిచ్చింది. ఆయుర్వేద మందు పంపిణీ విషయంలో జోక్యం చేసుకోకుండా అధికారులను నిలువరించాలని కోరుతూ నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం, కృష్ణపట్నం గ్రామానికి చెందిన ఆనందయ్య హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేసిన సంగతి తెలిసిందే. అలాగే ఆనందయ్య మందు పంపిణీని కొనసాగించేలా ఆదేశాలివ్వాలంటూ పలువురు హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేశారు. ఆనందయ్య తరఫు న్యాయవాది ఎన్‌. అశ్వనీకుమార్‌ వాదనలు వినిపిస్తూ.. ఆయన తయారుచేసిన నాలుగు మందుల పంపిణీకి అనుమతించినట్లు ప్రభుత్వం ఇప్పటికే కోర్టుకు తెలిపిందన్నారు. కంటి చుక్కల మందు పంపిణీకి అనుమతి కోసం అధికారుల వద్ద ధరఖాస్తు చేశామని, అది పెండింగ్‌ లో ఉందని చెప్పారు.

Updated Date - 2021-10-26T08:45:57+05:30 IST