ఆటగాళ్లెక్కువ.. సిబ్బంది తక్కువ!

ABN , First Publish Date - 2020-08-01T08:39:21+05:30 IST

కొవిడ్‌-19 వైర్‌సను దృష్టిలో ఉంచుకుని ఐపీఎల్‌ను అత్యంత సురక్షితంగా నిర్వహించే విషయమై బీసీసీఐ సమాలోచనలు చేస్తోంది. ఈ నేపథ్యంలో సమగ్ర ...

ఆటగాళ్లెక్కువ.. సిబ్బంది తక్కువ!

ఐపీఎల్‌పై పాలక మండలి సమాలోచన

ప్రేక్షకుల ఎంట్రీకి ప్రయత్నిస్తాం: యూఏఈ బోర్డు


న్యూఢిల్లీ: కొవిడ్‌-19 వైర్‌సను దృష్టిలో ఉంచుకుని ఐపీఎల్‌ను అత్యంత సురక్షితంగా నిర్వహించే విషయమై  బీసీసీఐ సమాలోచనలు చేస్తోంది. ఈ నేపథ్యంలో సమగ్ర విధివిధానాల (ఎస్‌ఓపీ) కోసం ఆదివారం జరిగే ఐపీఎల్‌ పాలకమండలి సమావేశంలో చర్చించనున్నారు. దీనిలో భాగంగా ఒక్కో జట్టు తరఫున హాజరయ్యే భారీ సిబ్బందిని కూడా గణనీయంగా తగ్గించే ఆలోచనలో ఉన్నారు. మామూలుగానైతే ప్రతి జట్టులో 25 నుంచి 28 మంది ఆటగాళ్లుంటారు. వీరితో పాటు కనీసం 15 మంది సహాయక సిబ్బందితో పాటు ఎగ్జిక్యూటివ్‌ అధికారులు అదనంగా ఉంటారు. అయితే యూఏఈలో అడుగుపెట్టాక ప్రతీ జట్టు సొంతంగా బయో బబుల్‌ను ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో సిబ్బంది పరిమితంగా ఉంటేనే అన్ని విధాలా క్షేమమని భావిస్తున్నాయి. 2014లో కూడా యూఏఈలో ఐపీఎల్‌ జరిగినప్పుడు అన్ని జట్లు పరిమిత సంఖ్యలోనే సిబ్బందిని తీసుకెళ్లాయి. తమ జట్లలో 20మందికి మించకుండా ఆటగాళ్లు ఉండేలా చూడాలని బోర్డు ఇప్పటికే ఫ్రాంచైజీలకు సూచించింది. దీంతో డ్రెస్సింగ్‌ రూమ్‌లో సందడి తగ్గుతుంది. కానీ ఆటగాళ్ల విషయంలో మాత్రం రాజీ పడేది లేదని ఫ్రాంచైజీలు భావిస్తున్నాయి. ‘జట్టు ఆటగాళ్ల సంఖ్యపై ఏమైనా సూచనలు వస్తే మాత్రం సహాయక సిబ్బందిని తగ్గించుకునేందుకే మొగ్గు చూపుతాం. కొన్ని ఫ్రాంచైజీలు ఈ విషయాన్ని కోచ్‌, టీమ్‌ మేనేజ్‌మెంట్‌కు వదిలేయనున్నాయి. ఇక మ్యాచ్‌ జరిగే రోజుల్లో మైదానంలో ఉండే సిబ్బందిపై కూడా పరిమితి ఉండే అవకాశం ఉంది. కొంత మంది సిబ్బంది హోటళ్లలోనే ఉండాల్సి రావచ్చు’ అని ఓ ఫ్రాంచైజీ సీనియర్‌ అధికారి పేర్కొన్నాడు. 

   నెట్‌ బౌలర్ల సమస్య: కరోనా గైడ్‌లైన్స్‌ కఠినంగా పాటించాల్సి    

రావడంతో నెట్‌ బౌలర్ల కొరత కూడా ఏర్పడనుంది. అందుకే ఆటగాళ్లు ఎక్కువగా ఉంటే ఈ సమస్య ఉండదని జట్లు భావిస్తున్నాయి. రెండున్నర నెలలపాటు యూఏఈలో ఉండాల్సి వస్తుండడంతో నెట్‌ బౌలర్లను పొందడం అన్ని జట్లకు సవాల్‌గా మారనుంది. దుబాయ్‌లోని ఐసీసీ అకాడమీకి రెండు గ్రౌండ్లతో పాటు 40 పిచ్‌లున్నాయి. అయితే ఇవన్నీ ఉన్నా వనరులు ముఖ్యమని, ఎస్‌ఓపీని అతిక్రమిస్తూ నెట్‌ బౌలర్లను బయటి నుంచి తీసుకురాలేమని ఫ్రాంచైజీలు భావిస్తున్నాయి. ఇదిలావుండగా ఆగస్టు 10నే యూఏఈకి వెళ్లేందుకు చెన్నై సూపర్‌కింగ్స్‌ సిద్ధమవుతోంది. ఇప్పటికే ఈ విషయాన్ని తమ ఆటగాళ్లకు తెలియజేసింది.

మానసిక ఆరోగ్యంపై అవగాహన: బయో సెక్యూర్‌ వాతావరణంలో ఆటగాళ్లంతా సౌకర్యవంతంగా ఉండేలా బీసీసీఐ ప్రయత్నాలు చేస్తోంది. ఒకవేళ ఇందులో ఇమడలేక మానసికంగా ఇబ్బంది పడే ఆటగాళ్లకు, సహాయక సిబ్బంది కోసం హెల్ప్‌లైన్‌ను ఏర్పాటు చేయాలనుకుంటోంది. ఈ నెంబర్‌కు డయల్‌ చేసిన వారికి వైద్య నిపుణులు ఒత్తిడి, ఆందోళనను తగ్గించే ప్రయత్నం చేస్తారు. 

సగం స్టేడియాలు నిండేలా...: ఐపీఎల్‌కు అభిమానులను స్టేడియాల్లోకి రప్పించాలని యూఏఈ క్రికెట్‌ బోర్డు భావిస్తోంది. అయితే దీని కి తమ ప్రభుత్వ అనుమతి కావాల్సి ఉంది. ‘భారత ప్రభుత్వం నుంచి ఐపీఎల్‌పై తుది నిర్ణయం వచ్చాక బీసీసీఐ మాకు సమాచారమిస్తుంది. ఆ వెంటనే మేం ప్రేక్షకుల అనుమతి కోసం మా ప్రభుత్వాన్ని సంప్రదిస్తాం. సగం స్టేడియాలకు మించి ప్రేక్షకులను అనుమతించకుండా  ఉండేందుకు ప్రయత్నిస్తాం.’ అని యూఏఈ బోర్డు కార్యదర్శి తెలిపాడు.


150 రోజులు కుటుంబాలకు దూరంగా...

ఓవైపు క్రికెటర్లు తిరిగి మైదానంలోకి అడుగుపెట్టబోతున్నామని సంతోషిస్తున్నా.. అదే సమయంలో 150 రోజులపాటు కుటుంబాలకు దూరం కావాల్సిరావడాన్ని మాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. ఇన్నాళ్లూ లాక్‌డౌన్‌తో వీరంతా ఇంటికే పరిమితమయ్యారు. కానీ ఇప్పుడు ఒక్కసారిగా సుదీర్ఘకాలం జట్టుతో ఉండాల్సి వస్తోంది. ఆటగాళ్లు తమ ఫ్రాంచైజీలతో కలిసి టోర్నీకి నెల ముందుగానే యూఏఈకి వెళతారు. దాదాపు వంద రోజులు ఇక్కడే గడిపిన తర్వాత నవంబరులో ఆస్ర్టేలియాకు వెళ్లి 14 రోజులు క్వారంటైన్‌లో ఉంటారు. డిసెంబరు 3 నుంచి జనవరి 17 వరకు టెస్టు, వన్డే సిరీస్‌లు ఆడి భారత్‌కు చేరతారు. భారత జట్టు నవంబరు 12న ఆసీ్‌సలోకి అడుగుపెడితే 68 రోజులపాటు ఉండాల్సి ఉంటుంది. దీంతో ఓవరాల్‌గా విరాట్‌ కోహ్లీ సేన ఐదు నెలల పాటు తమ కుటుంబాలకు దూరంగా గడపాల్సి వస్తోంది. 

Updated Date - 2020-08-01T08:39:21+05:30 IST