జిల్లా ఆసుపత్రిలో భయానకం

ABN , First Publish Date - 2021-05-16T06:33:29+05:30 IST

మచిలీపట్నంలోని జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో కొవిడ్‌ బాధితులకు బెడ్లు దొరకని పరిస్థితి ఏర్పడింది. ఓపీలో పనిచేసే జూనియర్‌ కేడర్‌ ఉద్యోగులు, ఒకరిద్దరు నర్సుల హవానే ఇక్కడ కొనసాగుతోంది.

జిల్లా ఆసుపత్రిలో భయానకం

బాధితులకు ఊపిరందకున్నా బెడ్‌ కేటాయించరు

జూనియర్‌ ఉద్యోగులదే హవా ప్రసన్నం

చేసుకుంటేనే బెడ్.. లేదంటే ఓ మూలనే

మచిలీపట్నం, ఆంధ్రజ్యోతి : మచిలీపట్నంలోని జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో కొవిడ్‌ బాధితులకు బెడ్లు దొరకని పరిస్థితి ఏర్పడింది. ఓపీలో పనిచేసే జూనియర్‌ కేడర్‌ ఉద్యోగులు, ఒకరిద్దరు నర్సుల హవానే ఇక్కడ కొనసాగుతోంది. బాధితులు ఊపిరందక  అల్లాడుతుంటే వారి వెంట వచ్చిన బంధువుల మాట వినేందుకు ఓపీలో పనిచేస్తున్న ఉద్యోగులకు తీరిక ఉండట్లేదు. ముందు బయటకు వెళ్లండి.. తరువాత చూద్దాం.. అంటూ బంధువులను తరిమేసేంత పని చేస్తున్నారు. తాయిలం సమర్పించిన వారికి మాత్రం బెడ్లు కేటాయిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. తమ వారి ఆరోగ్య పరిస్థితి క్షీణించిపోతోందని ఓపీలో ఉన్న ఉద్యోగులను బతిమాలుకుని, వారికి ఎంతో కొంత సమర్పిస్తేనే బెడ్లు కేటాయిస్తున్నారనే విమర్శలు ఆసుపత్రి ఆవరణలో వస్తున్నాయి. ఓపీలో ఇంతా జరుగుతున్నా ఆసుపత్రి సూపరింటెండెంట్‌ గానీ, ఆర్‌ఎంవో గానీ కన్నెత్తి చూడట్లేదు. పరిస్థితిని చక్కదిద్దడం లేదని కరోనా బాధితులు, వారి బంధువులు ఆరోపిస్తున్నారు. గుడ్లవల్లేరుకు చెందిన ఓ మహిళ పేరు ఆన్‌లైన్‌లో నమోదు కాలేదనే కారణం చూపి చికిత్స ప్రారంభించకపోవడంతో ఆమె శుక్రవారం తెల్లవారుజామున మరణించింది. ఆమెకు వైద్యం చేయాలని శాసనసభ్యుడొకరు ప్రతిపాదన చేసినా ఫలితం లేకుండా పోయిందని మృతురాలి బంధువులు కన్నీటి పర్యంతమయ్యారు. 

 పనిచేయని ఆక్సిజన్‌ ఫ్లోబ్‌లు

ఆసుపత్రిలో 350 పడకల ద్వారా కొవిడ్‌ బాదితులకు వైద్యసేవలు అందిస్తున్నామని అధికారికంగా చెబుతున్నారు. ఈ 350 బెడ్లకు ఆక్సిజన్‌ సౌకర్యం ఉంది. ఇటీవల అత్యవసర బాధితుల కోసం కంటివార్డులో ఆక్సిజన్‌ పైపులైన్లను ఏర్పాటు చేశారు. ఆక్సిజన్‌ పైపులకు బిగించే ఫ్లోబ్‌లు చాలావరకు పనిచేయట్లేదు. ఫ్లోబ్‌కు ఉన్న గాజుబీకరులో ఉన్న నీటిలో నురగలు వస్తున్నా పట్టించుకోవట్లేదు. బాధితుడి వెంట ఉన్నవారు ఈ విషయాన్ని గమనించి ఎంఎన్‌వోలు, నర్సులకు చెబితే, వారు వచ్చి ఆక్సిజన్‌ ఫ్లోబ్‌లను మారుస్తున్నారు. ఆ సమయంలో బాధితులకు ఆక్సిజన్‌ అందే పరిస్థితి లేదు. స్టోర్‌రూమ్‌లో నూతన ఫ్లోబ్‌లు చాలా ఉన్నాయని, వాటిని మాత్రం బయటకు తీయడం లేదని సిబ్బంది చెప్పడం గమనార్హం. పాడైన ఫ్లోబ్‌లకు కనీస మరమ్మతులు చేయడంలేదని ఉద్యోగులు అంటున్నారు. 

పారిశుధ్యం అంతంతమాత్రమే..

ఆసుపత్రిలో పారిశుధ్యం అంతంతమాత్రగానే ఉంటోంది. ఎక్కడి చెత్త అక్కడే పేరుకుపోతోంది. ఉద యం మాత్రమే చెత్తను తీసుకెళ్తున్నారు. ఏదైనా వార్డులో పారిశుధ్య సిబ్బం ది రాకుంటే మరుసటి రోజు వరకు చెత్తాచెదారం పేరుకుపోతోంది. ఐసీయూ వార్డుకు సమీపంలో ఉన్న జనరల్‌ వార్డులోని బాత్‌రూమ్‌లలో కనీసం విద్యుత్‌ లైట్లు లేకపోవడంతో కరోనా బాధితులు చీకట్లో అవస్థలు పడుతున్నారు. 

ఆహారంలో పోషకాల విలువెంత..?

ఆసుపత్రిలో కరోనా బాధితులకు పెట్టే భోజనంలోనూ లోపం కనిపిస్తోంది. రోజూ పప్పు, ములక్కాయ కూర, దోసకాయగూరతో భోజనం, అరగ్లాసు రాగిజావ, అప్పుడప్పుడూ అరటిపండు మాత్రమే ఇస్తున్నారు. ఈ భోజనంలో ఎంతమేరకు పోషక విలువలు ఉన్నాయో ఆసుపత్రి అధికారులకే తెలియాలి. దూరప్రాంతాల నుంచి వచ్చిచ కరోనా బాధితులు ఈ ఆహారాన్నే తిని సరిపెట్టుకుంటున్నారు. వడ్డించే సిబ్బంది కరోనా బాధితుల బంధువులతో దురుసుగా మాట్లాడటం రివాజుగా మారింది. 

Updated Date - 2021-05-16T06:33:29+05:30 IST