Governor: ఆర్‌ఎస్ఎస్‌ ర్యాలీకి అనుమతి ఎందుకివ్వరు?

ABN , First Publish Date - 2022-09-28T13:21:42+05:30 IST

గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్‌ 2న ఆర్‌ఎస్ఎస్‌ తలపెట్టిన ర్యాలీకి ఎందుకు అనుమతివ్వరని తెలంగాణ, పుదుచ్చేరి రాష్ట్రాల గవర్నర్‌ డా

Governor: ఆర్‌ఎస్ఎస్‌ ర్యాలీకి అనుమతి ఎందుకివ్వరు?

                                - తెలంగాణ గవర్నర్‌ తమిళిసై


చెన్నై, సెప్టెంబరు 27 (ఆంధ్రజ్యోతి): గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్‌ 2న ఆర్‌ఎస్ఎస్‌ తలపెట్టిన ర్యాలీకి ఎందుకు అనుమతివ్వరని తెలంగాణ, పుదుచ్చేరి రాష్ట్రాల గవర్నర్‌ డాక్టర్‌ తమిళిసై సౌందరరాజన్‌(Governor Dr. Tamilisai Soundararajan) ప్రశ్నించారు. చెన్నైలో మంగళవారం ఉదయం విలేఖరులతో మాట్లాడుతూ ఆర్‌ఎస్ఎస్‌ ఎన్నో సామాజిక కార్యక్రమాలను నిర్వహిస్తోందని, ఆ సంస్థ నిర్వహించే ర్యాలీలు ప్రశాంతంగానే జరుగుతాయన్నారు. గతంలో తాను కూడా ఆర్‌ఎస్ఎస్‏లో సేవలందించానని చెప్పారు. ఆర్‌ఎస్ఎస్‌(RSS) శాంతియుతంగా, ప్రశాంతంగా జరుపతలపెట్టిన ర్యాలీపై నిషేధం విధించాల్సిన అవసరం లేదని, ర్యాలీకి అనుమతివ్వడమే సమంజసంగా ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. గాంధీ జయంతి రోజు ఎలా ర్యాలీ నిర్వహిస్తారంటూ కొందరు ప్రశ్నించడం కూడా విడ్డూరంగా ఉందన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న పెట్రోల్‌ బాంబు దాడులపై స్పందిస్తూ తమిళనాట బాంబుల సంస్కృతికి ఎన్నడూ తావులేదని, ఏ రాష్ట్రంలోనూ బాంబుల సంస్కృతిని ప్రోత్సహించకూడదని వ్యాఖ్యానించారు. మతసామరస్యం నెలకొల్పే విషయంలో రాజీకి తావులేదన్నారు. ప్రభుత్వం అన్ని మతాలవారికి భద్రత కల్పించి నిష్పక్షపాతంగా వ్యవహరించాలని ఆమె సూచించారు.


ర్యాలీకి వ్యతిరేకంగా డీపీఐ అప్పీలు...

అక్టోబర్‌ రెండున ఆర్‌ఎస్ఎస్‌ ర్యాలీకి అనుమతిస్తూ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ జీకే ఇలందిరియన్‌ ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ డీపీఐ నేత తొల్‌ తిరుమావళవన్‌ అప్పీలు చేశారు. తొలుత సోమవారం ఉదయం ఆయన సింగిల్‌ జడ్జి ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలని కోరుతూ పిటిషన్‌ వేశారు. దానిని అత్యవసర కేసుగా పరిగణించి విచారణ జరపాలని కోరారు. ఈ పిటిషన్‌ను పరిశీలించిన న్యాయమూర్తి ఇలందిరియన్‌ ర్యాలీ కేసుతో తిరుమావళవన్‌ ఎలాంటి సంబంధం లేనప్పుడు తానెలా విచారణ జరుపుతానని ప్రశ్నించారు. అంతేగాక తానిచ్చిన ఉత్తర్వులపై అప్పీలుకు వెళ్లవచ్చని సూచించారు. ఆ మేరకు తిరుమావళవన్‌ అప్పీలు దాఖలు చేశారు. ఈ అప్పీలుపై తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి డి.రాజా, న్యాయమూర్తి కృష్ణకుమార్‌ విచారణ జరుపనున్నారు.

Updated Date - 2022-09-28T13:21:42+05:30 IST