Governor: హస్తిన వెళ్లిన గవర్నర్‌

ABN , First Publish Date - 2022-09-27T13:14:45+05:30 IST

రాష్ట్ర గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి(Governor RN Ravi) సోమవారం సాయంత్రం ఢిల్లీ బయలుదేరివెళ్లారు. పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా సంస్థ నేత

Governor: హస్తిన వెళ్లిన గవర్నర్‌

- నేడు అమిత్‌షాతో భేటీ

- పెట్రోల్‌ బాంబు దాడులపై నివేదిక?


చెన్నై, సెప్టెంబరు 26 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి(Governor RN Ravi) సోమవారం సాయంత్రం ఢిల్లీ బయలుదేరివెళ్లారు. పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా సంస్థ నేతల నివాసాలు, కార్యాలయాల్లో ఎన్‌ఐఏ, ఈడీ దాడులు జరిపిన నేపథ్యంలో కోయంబత్తూరు, తిరుప్పూరు, మదురై(Coimbatore, Tiruppur, Madurai) తదితర నగరాల్లో బీజేపీ, ఆర్‌ఎ్‌సఎస్‌, హిందూమున్నని నేతల ఇళ్ళపై పెట్రోలు బాంబు దాడులు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ విషయమై బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు అన్నామలై హోం మంత్రి అమిత్‌షాకు ఓ లేఖ కూడా రాశారు. ఈ పరిస్థితుల్లో గవర్నర్‌ ఆకస్మికంగా ఢిల్లీ వెళ్లడం చర్చనీయాంశమైంది. మంగళవారం ఆయన కేంద్ర హోం మంత్రి అమిత్‌షాతో భేటీ కానున్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు సంబంధించి ఓ నివేదికను ఆయన అమిత్‌షా(Amit Shah)కు సమర్పించనున్నట్లు సమాచారం. అదే సమయంలో హోంశాఖ సీనియర్‌ అధికారులను కూడా ఆయన కలుసుకోనున్నట్టు తెలుస్తోంది. ఇదిలా వుండగా కేంద్రమే గవర్నర్‌ను రప్పించిందా? లేక గవర్నరే తనకు తానుగా కేంద్ర హోమంత్రితో భేటీకి అపాయింట్‌మెంట్‌ కోరారా అన్నదానిపై స్పష్టత రాలేదు. ఒకవేళ కేంద్రం గవర్నర్‌ను పిలిపించి పెట్రోల్‌ బాంబుదాడులపై వివరణ కోరేటట్లయితే.. ఈ వ్యవహారాన్ని కేంద్రం సీరియ్‌సగా పరిగణిస్తున్నట్లు భావించాల్సివుంటుంది. ఒకవేళ గవర్నరే దీనిపై వివరణ ఇచ్చేందుకు కేంద్రాన్ని కలిస్తే మాత్రం అంత సీరియ్‌సగా తీసుకోవాల్సిన విషయం కాదని ఓ రాజకీయవిశ్లేషకుడు వ్యాఖ్యానించారు. ఏది ఏమైనప్పటికీ గవర్నర్‌ ఢిల్లీ పయనం అధికారపక్షంలో గుబులు రేపుతోంది.

Updated Date - 2022-09-27T13:14:45+05:30 IST