గవర్నర్‌ను రీకాల్‌ చేయండి

ABN , First Publish Date - 2022-02-06T15:00:49+05:30 IST

నీట్‌ మినహాయింపు బిల్లును తిరస్కరించిన రాష్ట్ర గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి వైఖరిని ఖండిస్తూ, ఆయన్ని తక్షణమే రీకాల్‌ చేయాలని కేంద్రాన్ని డిమాండ్‌ చేస్తూ తమిళగ వాళ్వురిమై కట్చి శనివారం ఉదయం రాస్తారోకో నిర్వహించింది.

గవర్నర్‌ను రీకాల్‌ చేయండి

- తమిళగ వాళ్వురిమై కట్చి రాస్తారోకో 

-  రాజ్‌భవన్‌ ముట్టడి యత్నం


చెన్నై: నీట్‌ మినహాయింపు బిల్లును తిరస్కరించిన రాష్ట్ర గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి వైఖరిని ఖండిస్తూ, ఆయన్ని తక్షణమే రీకాల్‌ చేయాలని కేంద్రాన్ని డిమాండ్‌ చేస్తూ తమిళగ వాళ్వురిమై కట్చి శనివారం ఉదయం రాస్తారోకో నిర్వహించింది. పార్టీ నేతలు, కార్యకర్తలంతా కలిసి రాజ్‌భవన్‌ను ముట్టడించేందుకు ప్రయత్నించడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. తమిళగ వాళ్వురిమై కట్చి నాయకుడు వేల్‌మురుగన్‌ నేతృత్వంలో వేలాదిమంది కార్యకర్తలు సైదాపేట వంతెన రహదారిపై రాస్తారోకోకు దిగారు. అనంతరం రాజ్‌భవన్‌ వైపు ర్యాలీ నిర్వహించారు. రాజ్‌భవన్‌ను సమీపిస్తుండగానే పోలీసులు కార్యకర్తలను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులకు, కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. రాస్తారోకోలో గవర్నర్‌కు వ్యతిరేకంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు నినాదాలు చేశారు. గవర్నర్‌ను రీకాల్‌ చేయాలంటూ పార్టీ నాయకుడు వేల్‌ మురుగన్‌ డిమాండ్‌ చేశారు. కార్యకర్తలనుద్దేశించి ఆయన మాట్లాడుతూ...నీట్‌ మినహాయింపు బిల్లును,దానితోపాటు జతచేసిన జస్టిస్‌ ఏకే రాజన్‌ కమిటీ సిఫారసులను పరిశీలించకుండా ఆ బిల్లులను నెలల తరబడి పెండింగ్‌లో ఉంచి తిప్పిపంపటం గర్హనీయమని దుయ్యబట్టారు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్న గవర్నర్‌ను కేంద్ర ప్రభుత్వం రీకాల్‌ చేయాలని డిమాండ్‌ చేశారు.

Updated Date - 2022-02-06T15:00:49+05:30 IST