ఢిల్లీ వెళ్లిన గవర్నర్‌

ABN , First Publish Date - 2022-02-27T14:57:21+05:30 IST

రాష్ట్ర గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి ఆకస్మికంగా ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. ఉన్నట్టుండి ఆయన హస్తినకు బయలుదేరి వెళ్ళడంతో రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. వైద్య కాలేజీల్లో సీట్ల భర్తీ కోసం కేంద్రం తీసుకొచ్చిన నీట్‌

ఢిల్లీ వెళ్లిన గవర్నర్‌

                   - రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ!


అడయార్‌(చెన్నై): రాష్ట్ర గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి ఆకస్మికంగా ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. ఉన్నట్టుండి ఆయన హస్తినకు బయలుదేరి వెళ్ళడంతో రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. వైద్య కాలేజీల్లో సీట్ల భర్తీ కోసం కేంద్రం తీసుకొచ్చిన నీట్‌ ప్రవేశ పరీక్షా విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ప్రయోజనం చేకూరేందుకు, వైద్య కోర్సుల్లో గ్రామీణ ప్రాంత విద్యార్థులు మరింతమంది చేరేందుకు వీలుగా ఈ నీట్‌ పరీక్షా విధానాన్ని రద్దు చేయాలని ప్రభుత్వం బలంగా డిమాండ్‌ చేస్తోంది. ఇదే అంశంపై గత ఏడాది సెప్టెంబరు 18వ తేదీన అసెంబ్లీలో తీర్మానం చేసి ఒక ముసాయిదా చట్టాన్ని గవర్నర్‌కు పంపించింది. ఆ తరువాత ఈ చట్టానికి ఆమోదం తెలిపి రాష్ట్రపతి ఆమోదానికి పంపించాలని ముఖ్యమంత్రి స్టాలిన్‌ స్వయంగా గవర్నరును కలిసి విజ్ఞప్తి చేశారు. అయితే, ఈ ముసాయిదా బిల్లును గవర్నర్‌ ఐదు నెలలపాటు తన వద్దే ఉంచుకుని ప్రభుత్వానికే తిరిగి పంపించారు. ఈ చర్యను అన్ని పార్టీల నేతలు ముక్తకంఠంతో ఖండించారు. ఆ తర్వాత ప్రభుత్వం రాష్ట్ర శాసనసభను ఈ నెల 8వ తేదీన ప్రత్యేకంగా సమావేశపరిచి నీట్‌ వ్యవహారంపై మరోసారి తీర్మానం చేసిన మళ్ళీ గవర్నర్‌కు పంపించింది. ప్రస్తుతం ఇది గవర్నర్‌ వద్ద పెండింగ్‌లో ఉంది. పైగా ఈ బిల్లును వెంటనే రాష్ట్రపతి ఆమోదానికి పంపించాలని రాష్ట్ర రాజకీయ పార్టీల నేతలు కోరుతున్నారు. ఇదిలావుంటే, ఈ నెల 7వ తేదీన మూడు రోజుల పర్యటన కోసం గవర్నర్‌ ఢిల్లీ వెళ్ళాల్సి ఉంది. ఆ సమయంలో కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా వంటి వారిని కలిసేలా పర్యటన ఏర్పాటు చేసుకున్నారు. అయితే, ఈ పర్యటన అర్ధాంతరంగా రద్దయింది. ఈ నేపథ్యంలో గవర్నర్‌ ఆర్‌ఎన్‌. రవి శనివారం ఆకస్మికంగా హస్తినకు బయలుదేరి వెళ్ళారు. అక్కడ ఆయన ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర హోమంత్రి అమిత్‌షా తదితరులతో భేటీ కానున్నట్లు రాజ్‌భవన్‌ వర్గాలు తెలిపాయి. వీలైతే రాష్ట్రపతిని కూడా ఆయన కలుసుకోవచ్చని సమాచారం. 


Updated Date - 2022-02-27T14:57:21+05:30 IST