మళ్లీ ఢిల్లీకి గవర్నర్‌

ABN , First Publish Date - 2022-04-21T14:21:34+05:30 IST

రాష్ట్ర గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి మళ్లీ ఢిల్లీ వెళ్లారు. ఇటీవలే హడావుడిగా ఢిల్లీ వెళ్లి గప్‌చు్‌పగా చెన్నై తిరిగొచ్చిన ఆయన.. ఇంతలోనే హస్తిన బాట పట్టడంతో రాజకీయవర్గాల్లో

మళ్లీ ఢిల్లీకి గవర్నర్‌

- ‘నీట్‌’ వివాదంపై సలహా కోసమా?, ‘నిరసన’లపై ఫిర్యాదుకా? 

- రాజకీయవర్గాల్లో ఉత్కంఠ


చెన్నై: రాష్ట్ర గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి మళ్లీ ఢిల్లీ వెళ్లారు. ఇటీవలే హడావుడిగా ఢిల్లీ వెళ్లి గప్‌చు్‌పగా చెన్నై తిరిగొచ్చిన ఆయన.. ఇంతలోనే హస్తిన బాట పట్టడంతో రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమైంది. నీట్‌ మినహాయింపు  సహా పలు బిల్లులను పెండింగ్‌లో ఉంచడంపై ముఖ్యమంత్రి స్టాలిన్‌ శాసనసభలో ప్రకటన చేయడం, మంగళవారం మైలాడుదురై పర్యటన సందర్భంగా వివిధ పార్టీల కార్యకర్తలు నల్లజెండాలతో నిరసన తెలపడం తదితరాల నేపథ్యంలో బుధవారం ఉదయం గవర్నర్‌ హడావుడిగా ఢిల్లీ వెళ్లడం రాజకీయాల్లో ఉత్కంఠ రేపుతోంది. ఈ నెల 7న ఢిల్లీ వెళ్ళిన ఆయన మూడు రోజులపాటు అక్కడే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఊహించని విధంగా వారం రోజుల వ్యవధిలోనే ఆయన మరోమారు ఢిల్లీకి వెళ్లడం గమనార్హం. గవర్నర్‌ ఢిల్లీ పర్యటనకు సంబంధించిన వివరాలను వెల్లడించకపోయినా వ్యక్తిగత పర్యటనలో భాగంగానే ఆయన ఢిల్లీకి వెళ్లినట్లు రాజ్‌భవన్‌ వర్గాలు వ్యాఖ్యానించాయి. ఢిల్లీలో ఆయన కొత్త ఇల్లు నిర్మిస్తున్నారని, ఆ పనులను పరిశీలించడానికి వెళ్ళారని చెబుతున్నారు. అయితే ఈ పర్యటనలో ఆయన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా సహా కేంద్ర మంత్రులు పలువురిని కలుసుకునే అవకాశముంది. అమిత్‌షాతో నీట్‌ మినహాయింపు బిల్లును రాష్ట్రపతి ఆమోదానికి పంపాలా వద్దా అనే విషయంపై సమగ్రంగా చర్చలు జరుపుతారని తెలుస్తోంది. అదే సమయంలో మైలాడుదురై పర్యటన సందర్భంగా తన కాన్వాయ్‌లో నల్లజెండాల ప్రదర్శన జరిగిన విషయాన్ని కూడా అమిత్‌షా దృష్టికి తీసుకెళతారని సమాచారం. గురువారం రాత్రి ఆయన ఢిల్లీ నుంచి చెన్నైకి తిరిగొస్తారని తెలుస్తోంది. 

Updated Date - 2022-04-21T14:21:34+05:30 IST