నదులు.. దైవ స్వరూపాలు

ABN , First Publish Date - 2022-06-30T13:13:50+05:30 IST

నదులను పరిరక్షించడం అందరి బాధ్యత అని, నదులను దైవంగా పూజించాలని రాష్ట్ర గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి పిలుపునిచ్చారు. అఖిల భారత సన్యాసుల సంఘం,

నదులు.. దైవ స్వరూపాలు

                    - పాలారు వేడుక ప్రారంభోత్సవంలో గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి


వేలూరు(చెన్నై), జూన్‌ 29: నదులను పరిరక్షించడం అందరి బాధ్యత అని, నదులను దైవంగా పూజించాలని రాష్ట్ర గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి పిలుపునిచ్చారు. అఖిల భారత సన్యాసుల సంఘం, వేలూరు నారాయణి పీఠం సంయుక్త ఆధ్వర్యంలో ఆ పీఠం ప్రాంగణంలో పాలారు వేడుకలు బుధవారం ప్రారంభమయ్యాయి. కార్యక్రమానికి శక్తి అమ్మ అధ్యక్షత వహించగా, గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా గవర్నర్‌ మాట్లాడుతూ... సముద్రపు అలలు, సూర్యరశ్మి ద్వారా విద్యుదుత్పత్తికి 2016లో ప్రధాన నరేంద్ర మోదీ ప్రారంభించారన్నారు. ఈ పథకం వల్ల 2025 నాటికి 100 జిగావాట్స్‌ విద్యుదుత్పత్తి చేయాలని లక్ష్యం పెట్టుకోగా, 2021 సెప్టెంబరులోనే నిర్దేశిత లక్ష్యాన్ని చేరుకుందన్నారు. 2030 నాటికి 500 జిగావాట్స్‌కు ఉత్పత్తి పెంచాలని లక్ష్యంగా నిర్ణయించారని తెలిపారు. వాతావరణంలో సంభవిస్తున్న మార్పుల కారణంగా రానున్న 30-40 సంవత్సరాల్లో చిన్న దీవులు నీటమునిగే ప్రమాదముందని పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నారన్నారు. దేశవ్యాప్తంగా కొలనులు పరిరక్షించుకొనేలా ప్రధాని మోదీ ‘అమృత్‌ సరోవర్‌’ పథకాన్ని పారంభించారని, ఈ పథకం ద్వారా 2023 ఆగస్టు నాటికి 50 వేల కొలనుల్లో పూడికతీత చేపట్టి, అవి ప్రజల అవసరాలు తీర్చే జలవనరులుగా తీర్చిదిద్దనున్నారన్నారు. స్వాతంత్య్రం లభించి 75 ఏళ్లు పూర్తికాగా, వచ్చే 25 సంవత్సరాలు ఎంతో ముఖ్యమని అని గవర్నర్‌ పేర్కొన్నారు. కార్యక్రమంలో అఖిల భారత సన్యాసుల సంఘం అధ్యక్షుడు శాంతలింగమరుదాల అడిగళ్‌, ఉపాధ్యక్షుడు రామానంద, జనరల్‌ సెక్రటరీ ఆత్మానంద సరస్వతి స్వామి, రత్నగిరి బాలమురుగన్‌ అడిమై స్వామి, కలవై సచ్చిదానంద స్వామి సహా దేశంలో పలు రాష్ట్రాలకు చెందిన వేయి మందికి పైగా సన్యాసులు పాల్గొన్నారు.



Updated Date - 2022-06-30T13:13:50+05:30 IST