పెట్టుబడులకు అనువైన రాష్ట్రంగా తీర్దిదిద్దుతాం

ABN , First Publish Date - 2022-01-06T15:54:25+05:30 IST

తమిళనాడును దక్షిణాసియాలోనే పారిశ్రామిక పెట్టుబడులకు అనువైన రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి ప్రకటించారు. చేపాక్‌ కలైవానర్‌ అరంగం హాలులో బుధవారం ఉదయం ప్రారంభమైన శాసనసభ

పెట్టుబడులకు అనువైన రాష్ట్రంగా తీర్దిదిద్దుతాం

- నీట్‌ వద్దు

- ఒమైక్రాన్‌ కట్టడికి చర్యలు

- ద్విభాషా విధానం కొనసాగింపు

- అసెంబ్లీలో గవర్నర్‌ ప్రకటన

- ఈ ఏడాది అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం


చెన్నై: తమిళనాడును దక్షిణాసియాలోనే పారిశ్రామిక పెట్టుబడులకు అనువైన రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి ప్రకటించారు. చేపాక్‌ కలైవానర్‌ అరంగం హాలులో బుధవారం ఉదయం ప్రారంభమైన శాసనసభ సమావేశాల్లో ఆయన ప్రసంగిస్తూ... డీఎంకే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోపే మూడు పారిశ్రామిక పెట్టుబడుల మహానాడులు నిర్వహించి కొత్త పరిశ్రమలు నెలకొల్పేం దుకు శ్రీకారం చుట్టిందన్నారు. లక్షా 74 వేలమందికి పైగా ఉద్యోగావకాశాలు కల్పించేందుకు అనువుగా రూ.56,230 కోట్ల విలువైన పెట్టుబడుల సమీ కరణకు సంబంధించి పలు సంస్థలతో అవగాహన ఒప్పందాలు కుదుర్చు కుందని ఆయన ప్రశంసించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచేందుకు డీఎంకే ప్రభుత్వం నడుం బిగించిందని, ఆ మేరకు ఎనిమిదేళ్లలోపు లక్షకోట్ల డాలర్ల ఆదాయ సముపార్జనే లక్ష్యంగా పెట్టుకుందన్నారు. రాష్ట్రంలో వైద్యరంగంలో సంపూర్ణ అభివృద్ధిని సాధిస్తోందని, ఒరగడం వద్ద 150 ఎకరాల విస్తీర్ణంలో వైద్య పరికరాల ఉత్పత్తి కర్మాగారాన్ని నిర్మిస్తోందన్నారు. రాష్ట్ర చిన్న మధ్యతరహా పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో కొత్తగా ఐదు పారి శ్రామికవాడలను ఏర్పాటు చేయనుందన్నారు. ఇక డీఎంకే అధికారంలోకి రాగానే కరోనా వైరస్‌ను కట్టడి చేయడంలో మెరుగైన చర్యలు చేపట్టి అన్ని రాష్ట్రాలకు ఆదర్శ రాష్ట్రంగా నిలిచిందంటూ గవర్నర్‌ ప్రశంసించారు.


‘నీట్‌’ రద్దుకు చర్యలు...

గ్రామీణ విద్యార్థులకు నష్టం కలిగించే నీట్‌ రద్దు చేయాలన్నదే ప్రభుత్వ ఆశయమని, ఆ దిశగానే చర్యలు చేపడుతోందని గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి పేర్కొన్నారు. వైద్య, ఇంజనీరింగ్‌ కోర్సులలో ప్లస్‌-2 పరీక్షల మార్కుల ఆధారంగానే అడ్మిషన్లు కల్పించాలని ప్రభుత్వం భావిస్తోందన్నారు. కార్పొరేషన్‌, మునిసిపాలిటీలకు త్వరలో ఎన్నికలు నిర్వహించి స్థానిక ఎన్నికల ప్రక్రియను ముగించనున్నదని చెప్పారు. రాష్ట్రంలో ఎప్పటివలెనే ద్విభాషా విద్యా విధానాన్నే కొనసాగించనున్నట్లు తెలిపారు. ‘అంతటా తమిళం - అన్నింటా తమిళం’ అనే నినాదంతో తమిళభాషాభివృద్ధికి ప్రభుత్వం శాయశక్తులా కృషి చేస్తోందన్నారు. ఆ మేరకు ప్రభుత్వ కార్యక్రమాల్లో తమిళ్‌తాయ్‌ ప్రార్థనగీతాన్ని ఆలాపించాలంటూ ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. రూ.500 కోట్లతో సింగార చెన్నై 2.0 పథకాన్ని అమలు చేయనున్నట్లు సభ్యుల హర్షద్వానాల మధ్య ప్రకటించారు. పొరుగు రాష్ట్రాలతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉండాలన్నదే ప్రభుత్వ విధానమని చెప్పారు. ముల్లై పెరియార్‌ డ్యామ్‌ నీటిమట్టాన్ని 152 అడుగులకు పెంచేందుకు చర్యలు తీసుకుంటా మని, కర్ణాటకలో కావేరి నదిపై మెకెదాటు వద్ద ఆనకట్ట నిర్మించకుండా అడ్డుకుంటామని ఆయన చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 145 పెరియార్‌ సమత్తువపురాల్లో మరిన్ని సదుపాయాలు కల్పించి అభివృద్ధి పరచనున్నామని తెలిపారు. ఉదయం పది గంటలకు గవర్నర్‌ తన ప్రసంగాన్ని ప్రారంభిం చగా 43 నిమిషాలపాటు కొనసాగింది. శాసనసభలో తొలిసారిగా తమిళ్‌ తాయ్‌ ప్రార్థనా గీతాన్ని రికార్డుద్వారా వినిపించకుండా సంగీత కళాశాల విద్యార్థినులచేత పాడించారు. గవర్నర్‌ ఆంగ్ల ప్రసంగం తర్వాత సభాపతి అప్పావు గవర్నర్‌ దాని తమిళ అనువాదాన్ని సభ్యులకు చదివి వినిపిం చారు. అనంతరం సభ గురువారానికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. అంతకు ముందు కలైవానర్‌ అరంగం వద్దకు వచ్చిన గవర్నర్‌ కు స్పీకర్‌, డిప్యూటీ స్పీకర్‌ తదితరులు స్వాగతం పలికారు. అక్కడి నుంచి ప్రత్యేక గదిలో భేటీ అయ్యారు. అక్కడ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌, సీనియర్‌ మంత్రులు గవర్నర్‌ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. 


కొత్త పథకాల ఊసులేని ప్రసంగం....

సాధారణంగా యేడాది ప్రారంభంలో గవర్నర్‌ శాసనసభలో చేసే ప్రసంగంలో ప్రజాకర్షణీయమైన పథకాల గురించి ప్రకటన చేయడం ఆనవాయితీ. అయితే బుధవారం జరిగిన శాసనసభ సమావేశంలో కొత్త పథకాల ప్రస్తావనే లేకుండా ఏడుమాసాల డీఎంకే పాలనలో జరిగిన అభివృద్ధి పథకాలు గురించి, కరోనా నిరోధక చర్యల గురించిన అంశాలు మాత్రమే గవర్నర్‌ ప్రసంగంలో అధికంగా చోటుచేసుకున్నాయి. గవర్నర్‌ తన ప్రసంగంలో దేశంలో అత్యంత సమర్థవంతుడైన ముఖ్యమంత్రిగా స్టాలిన్‌ను రాష్ట్ర ప్రజలు ఎన్నుకున్నారంటూ ప్రశంసించడం విశేషం. సభ్యులందరికీ, రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సరాది, పొంగల్‌ శుభాకాంక్షలు తెలిపి గవర్నర్‌ తన ప్రసంగాన్ని ముగించారు.

Updated Date - 2022-01-06T15:54:25+05:30 IST