Governor: మరో బిల్లు వెనక్కి..!

ABN , First Publish Date - 2022-09-04T13:37:58+05:30 IST

మాధవరం వద్ద సిద్ధ వైద్య విశ్వవిద్యాలయం ఏర్పాటుకు సంబంధించిన బిల్లును రాష్ట్ర గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి(Governor RN Ravi) ప్రభుత్వానికి

Governor: మరో బిల్లు వెనక్కి..!

                      - సిద్ధవైద్య విశ్వవిద్యాలయ ఏర్పాటు బిల్లును తిప్పి పంపిన గవర్నర్‌


చెన్నై, సెప్టెంబరు 3 (ఆంధ్రజ్యోతి): మాధవరం వద్ద సిద్ధ వైద్య విశ్వవిద్యాలయం ఏర్పాటుకు సంబంధించిన బిల్లును రాష్ట్ర గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి(Governor RN Ravi) ప్రభుత్వానికి తిప్పిపంపారు. ఈ విషయాన్ని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి ఎం.సుబ్రమణ్యం(Minister M. Subramaniam) ధ్రువీకరించారు. మాధవరంలో సిద్ధ వైద్య విశ్వవిద్యాలయానికి ఏర్పాటు చేసేందుకుగాను శాసనసభలో నాలుగు మాసాలకు ముందు ఓ బిల్లును ప్రవేశపెట్టి ఏకగ్రీవంగా ఆమోదించారు. ఆ బిల్లును గవర్నర్‌ ఆమోదం కోసం పంపారు. నాలుగు మాసాలపాటు ఆ బిల్లులోని అంశాలపై చట్టనిపుణులతో సంప్రదింపులు జరిపారు. ఆ బిల్లులో కొన్ని అంశాలపై సందేహాలు కలగటంతో వివరణ కోరుతూ ఆయన దానిని తిప్పిపంపారు. గవర్నర్‌ లేవనెత్తిన సందేహాలపై తాము న్యాయనిపుణులతో చర్చలు జరిపి, తగిన వివరణలతో గవర్నర్‌కు ఆ బిల్లును మళ్లీ పంపిస్తామని మంత్రి సుబ్రమణ్యం చెప్పారు. ప్రస్తుతం గవర్నర్‌కు పంపనున్న వివరణలను ముఖ్యమంత్రి స్టాలిన్‌ పరిశీలన జరపాల్సి ఉందని, ఆ తర్వాతనే బిల్లును పంపుతామని చెప్పారు. గవర్నర్‌ ఆమోదం తప్పకుండా లభిస్తుందని, ఆ తర్వాత 20 ఎకరాల విస్తీర్ణంలో మాధవరం సిద్ద వైద్య విశ్వవిద్యాలయం నిర్మాణ పనులను శరవేగంగా ప్రారంభిస్తామని మంత్రి సుబ్రమణ్యం తెలిపారు. అప్పటివరకు ఈ విశ్వవిద్యాలయానికి సంబంధించిన కార్యాలయాలు అరుంబాక్కంలోని అరింజర్‌ అన్నా ఆసుపత్రిలో పనిచేస్తాయని ఆయన చెప్పారు.

Updated Date - 2022-09-04T13:37:58+05:30 IST