గవర్నర్‌ ఆమోదించేనా?

ABN , First Publish Date - 2022-04-27T13:56:59+05:30 IST

రాష్ట్రంలో విశ్వవిద్యాలయాలకు వైస్‌ ఛాన్సలర్లను ప్రభుత్వ మే నియమించేలా శాసనసభలో ఆమోదించిన ముసాయిదా చట్టానికి సంబంధించిన పత్రాలు మంగళవారం

గవర్నర్‌ ఆమోదించేనా?

                      - రాజ్‌భవన్‌ చేరిన వీసీల బిల్లు


చెన్నై: రాష్ట్రంలో విశ్వవిద్యాలయాలకు వైస్‌ ఛాన్సలర్లను ప్రభుత్వ మే నియమించేలా శాసనసభలో ఆమోదించిన ముసాయిదా చట్టానికి సంబంధించిన పత్రాలు మంగళవారం రాజ్‌భవన్‌ చేరాయి. అయితే ఈ చట్టానికి గవర్నర్‌ ఆమోదం తెలుపుతారా? లేక తిప్పి పంపుతా రా అన్నదానిపై అన్ని వర్గాలు ఉత్కంఠతో ఎదురు చూస్తున్నాయి. గుజరాత్‌, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణా, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల్లో వీసీలను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే నియమిస్తున్నాయి. ఆ కోవలోనే రాష్ట్రంలోనూ వీసీలను ప్రభుత్వమే నియమించుకునేలా ముసాయిదా చట్టాన్ని శాసనసభలో ఉన్నత విద్యాశాఖ మంత్రి పొన్ముడి సోమవారం ప్రవేశపెట్టారు. ఈ బిల్లును ప్రధాన ప్రతిపక్షమైన అన్నాడీఎంకే, దాని మిత్రపక్షమైన బీజేపీ ప్రారంభ దశలోనే వ్యతిరేకించాయి. ఆ తర్వాత శాసనసభలో ఉన్న సభ్యుల మెజారిటీ ప్రకారం ఈ ముసాయిదా చట్టం ఆమోదించినట్లు స్పీకర్‌ అప్పావు ప్రకటించారు. ఆ తర్వాత ఈ చట్టానికి సంబంధించిన దస్తావేజులను శాసనసభ కార్యదర్శి, ఇతర అధికారులు సమగ్రంగా రూపొందించారు. మంగళవారం సాయంత్రం గవర్నర్‌ పరిశీలనకు ఈ బిల్లును పంపించారు. ఇప్పటివరకూ వీసీల నియామకానికిగాను రాష్ట్ర ప్రభుత్వం సెర్చ్‌కమిటీ ద్వారా ముగ్గురి పేర్లను గవర్నర్‌ పరిశీలనకు పంపటం, వారిలో ఒకరిని ఆయన నియమించడం, లేదా సెర్చ్‌కమిటీ ప్రతిపాదనలను తిరస్కరించ డం, ఆ తర్వాత మరో ముగ్గురి పేర్లను ప్రతిపాదించటం జరుగుతుండేది. ప్రభుత్వ సెర్చ్‌కమిటీల ప్రతిపాదనలను గవర్నర్‌ తోసిపుచ్చి ఆయనే వీసీలను నియమించిన సందర్భాలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన చట్టం ప్రకారం విశ్వవిద్యాలయాలకు వీసీలను ప్రభుత్వమే నియమించుకోగలుగుతుంది. ప్రస్తుతం గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి ఆ ముసాయిదా చట్టాన్ని ఆమోదించాల్సి వుంది. ఈ విషయ మై రాష్ట్ర న్యాయవిభాగానికి చెందిన ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ.. వీసీల నియామక చట్టాన్ని గవర్నర్‌ ఆమోదించాల్సి వుందని, అయితే ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్న బిల్లులతోపాటు దీనిని కూడా ఎక్కువ కాలం పెండింగ్‌లో ఉంచలేరని తెలిపారు. నీట్‌ మినహాయింపు బిల్లు, ఆర్థిక అంశాలకు సంబంధించిన బిల్లులు మాత్రమే ప్రస్తుతం పెండింగ్‌లో ఉంచారని, వీసీల నియామక బిల్లుపై ఆయన వీలైనంత త్వరగానే ఆమోదం తెలుపుతారని చెప్పారు. ఎవరైనా వీసీ పదవీ కాలం పూర్తయ్యే సమయం దగ్గరపడేలా ఉంటే గవర్నర్‌ బిల్లుపై త్వరితగతిన నిర్ణయాన్ని ప్రకటించాల్సి వుంటుందని చెప్పారు.


29న చెన్నై రాక...

ప్రస్తుతం నీలగిరి జిల్లాలో పర్యటిస్తున్న గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి ఈ నెల 29న చెన్నైకి రానున్నారు. సోమవారం ఊటీలో ప్రారంభమైన వీసీల మహానాడు మంగళవారం నాడు కూడా కొనసాగింది. బుధ, గురువారాలు గవర్నర్‌ ఊటీ రాజ్‌భవన్‌లోనే బసచేసి కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆ తర్వాత 29న చెన్నైకి తిరిగివస్తారు. చెన్నై చేరిన తర్వాతే వీసీల నియమాక కొత్త ముసాయిదా చట్టం బిల్లును ఆయన పరిశీలించనున్నారు.

Updated Date - 2022-04-27T13:56:59+05:30 IST