పాలన: వ్యక్తులు, సంస్థలు, ప్రక్రియలు

ABN , First Publish Date - 2020-08-02T06:28:10+05:30 IST

పాలన సాధారణంగా వ్యక్తుల, సంస్థల, ప్రక్రియల ప్రకార్యం. యోగ్యత గల వ్యక్తులు, దృఢ, మానవీయ ప్రక్రియలు, నైతిక నిష్ఠ ఉన్న సంస్థలు పాలనా నాణ్యతను నిర్ణయించడంలో...

పాలన: వ్యక్తులు, సంస్థలు, ప్రక్రియలు

పరిస్థితులకు అనుగుణమైన ప్రక్రియలను నిర్దేశించడమనేది ఏ సంస్థకైనా ఒక కష్టతరమైన విధి. దీన్ని సక్రమంగా నిర్వర్తించేందుకు సంబంధిత సంస్థకు బాధ్యుడైన వ్యక్తి సరైన నిర్ణయం తీసుకోవాలి. ఇలా జరగాలంటే సంస్థలకు బాధ్యులైన వ్యక్తులకు సాధికారత కల్పించడమే సరైన మార్గం. వారు తమ విచక్షణతో సమస్యల పరిష్కారానికి పూనుకునేందుకు అవసరమైన స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు, అధికారాలు కల్పించాలి. వ్యక్తులలో విశ్వాసముంచకపోతే ఆశిస్తున్న ఫలితాలు సిద్ధించవు.


పాలన సాధారణంగా వ్యక్తుల, సంస్థల, ప్రక్రియల ప్రకార్యం. యోగ్యత గల వ్యక్తులు, దృఢ, మానవీయ ప్రక్రియలు, నైతిక నిష్ఠ ఉన్న సంస్థలు పాలనా నాణ్యతను నిర్ణయించడంలో బృహత్తర పాత్ర నిర్వహిస్తాయి. ప్రజా హితానికి ఇతోధికంగా తోడ్పడే విధంగా పాలనా నాణ్యతను పెంపొందిస్తాయి. పాలనా విధులలో అంతర్భాగాలయిన వ్యక్తులు, ప్రక్రియలు, సంస్థలు పరస్పర ఆలంబనతో పెంపొందుతాయి. బలహీన, అసమర్థ, ఉదాసీన వ్యక్తుల వల్ల అత్యుత్తమ సంస్థలు సైతం నాశనమవుతాయి. ఉత్కృష్ట సంస్థలు సమర్థులైన వ్యక్తులను ఆకట్టుకుంటాయి. బాధ్యతలను అప్పగిస్తాయి. వారు ఆ సంస్థల పేరు ప్రతిష్ఠలను మరింతగా సమున్నతం చేయగలుగుతారు. అదే విధంగా క్రోడీకరించిన లేదా లాంఛన ప్రాయమైన ప్రక్రియలు సత్ఫలితాల సాధనకు అత్యంతావశ్యకాలు. 


నిర్దేశించిన ప్రక్రియలను అనుసరించడం వల్ల వ్యక్తిగత బాధ్యత నుంచి కొంత మేరకు తప్పించుకోవడం సాధ్యమవుతుందనేది వాస్తవం. ఆ ప్రకారం తమ అంతిమ కర్తవ్యం ప్రక్రియలను తు.చ. తప్పకుండా పాటించడమేనని, దానివల్ల మెరుగైన ఫలితాలు తప్పక సమకూరతాయని పలువురు వ్యక్తులు భావిస్తున్నారు. అనేక సంస్థల ఆలోచనా అదే విధంగా ఉన్నది. అయితే ఇది సరికాదు. వాస్తవిక పరిస్థితులు భిన్నమైనవి. తుది లక్ష్యాలను నిశ్చితంగా మనస్సులో పెట్టుకోకుండా కేవలం ప్రక్రియలను అనుసరించడమంటే గమ్యమేమిటో తెలియని లక్ష్యరహిత సంచారకుల వైనమే అవుతుంది. పాలన తరచు లక్ష్యాలను ఉపేక్షించి ఆచార ప్రాయంగా ప్రక్రియలను ఆచరించడానికి అలవాటు పడిపోతుంది. ఉద్దేశించిన ఫలితాలను సాధించేందుకు ప్రక్రియలు విధిగా లక్ష్యాధారితమై వుండాలి. చురుకుగా అమలు కావాలి. నిత్య క్రియాశీలంగా ఉండాలి. వివిధ సవాళ్ళను సమర్థంగా ఎదుర్కొని సకాలంలో ఫలితాలను సాధించగలిగేవిగా ఉండాలి. 


పరిస్థితులకు అనుగుణమైన ప్రక్రియలను నిర్దేశించడమనేది ఏ సంస్థకైనా ఒక కష్టతరమైన విధి. దీన్ని సక్రమంగా నిర్వర్తించేందుకు సంబంధిత సంస్థకు బాధ్యుడైన వ్యక్తి సరైన నిర్ణయం తీసుకోవాలి. ఇలా జరగాలంటే సంస్థలకు బాధ్యులైన వ్యక్తులకు సాధికారత కల్పించడమే సరైన మార్గం. వారు తమ విచక్షణతో సమస్యల పరిష్కారానికి పూనుకునేందుకు అవసరమైన స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు, అధికారాలు కల్పించాలి. ఇందుకు వ్యక్తుల స్వతఃస్సిద్ధ సామర్థ్యాలలో నిండు నమ్మకం కలిగివుండాలి. వ్యక్తులలో విశ్వాసముంచకపోతే ఆశిస్తున్న ఫలితాలు సిద్ధించవు. 


సమాచారాన్ని ఒకరి నుంచి ఒకరు తెలుసుకోవడానికి ప్రజాప్రియమైన రెండు పద్ధతులు వున్నాయి. ఒకటి లిఖితం, రెండోది మౌఖికం. ఒక సమర్థమైన సంస్థ మౌఖిక సమాచారంపై ఆధారపడుతుంది. అవసరమైతే దాన్ని లిఖిత పూర్వకంగా ధ్రువీకరిస్తుంది. సమాచారాన్ని ఇచ్చేవాడు, తీసుకునేవాడు పరస్పర విశ్వాసమున్న బాధ్యతాయుత వ్యక్తులు అనే భావంతో అలా వ్యవహరించడం జరుగుతుంది. అలా పరస్పర విశ్వాసం లేకపోవడమనేది అసమర్థ సంస్థల లక్షణం. మరో శ్రేణి ప్రభుత్వ సంస్థలు కూడా ఉన్నాయి. ఇవి, మౌఖికంగా అడిగినా లేదా లిఖిత పూర్వకంగా అడిగినా ఎటువంటి సమాచారాన్ని సమకూర్చవు! ప్రతిబంధకమైన ప్రక్రియలు తరచు ఆశిస్తున్న ఫలితాల సాధనను అడ్డుకుంటాయి. అంతేకాదు వ్యవస్థలను వికృతం చేయగలుగుతాయి. పాలనా వ్యవహారాలు చాల వరకు అప్రామాణికమైన భోగట్టా, అవాస్తవిక లక్ష్యాలు, సాధించిన ఫలితాల విషయమై అవిశ్వసనీయ నివేదికల ప్రాతిపదికన జరుగుతుండడం కద్దు. నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధించడం జరిగిందని చూపడానికి వాస్తవాలు, అంకెలు, అనుసరించిన విధానాలు, పద్ధతుల పరంగా మాయపుచ్చడం జరుగుతున్నది. ఇటువంటి లక్ష్య కేంద్రిత దృక్పథం ఆధారంగా పలువురు తెలివైన యువతీ యువకులు ప్రభుత్వ వ్యవస్థలో తమ వృత్తి జీవితాలను నిర్మించుకుంటున్నారు. 


క్షేత్రస్థాయిలో చోటు చేసుకొంటున్న పురోగతి పరిమాణాత్మకంగా గానీ, గుణాత్మకంగా గానీ ప్రకటిత ప్రగతికి అనుగుణంగా వుండదు. మామూలు ప్రభుత్వాలు తమ మనుగడకు అతిశయోక్తులతో కూడిన ప్రచారంపై ఆధారపడుతాయి. అయితే ఇటువంటి పాలకుల మాటలను ప్రజలు ఎంతకాలం నమ్ముతారు? బోలు ప్రచారం ఎన్నికల పరీక్షలో ప్రయోజన శూన్యమవుతుంది. తిరస్కరణకు గురైన ప్రభుత్వాలు ఓటర్లను నిందించడం పరిపాటి. లక్ష్యాలను సాధించేందుకు ఎటువంటి పటిష్ఠ వ్యూహం లేకుండా కేవలం అభిలషితాలోచనతో వ్యవహరించడం వల్ల ఎటువంటి ప్రయోజనముండబోదు. సాపేక్షంగా ఒక మెరుగైన పాలనలో అవసరాల ప్రాతిపదికన ప్రమేయాలపై ఆధారపడవచ్చు. మంచిదేగానీ కేవలం అవసరాల ప్రాతిపదికన సాగే ప్రక్రియలు సైతం ఆశించిన ఫలితాల నిస్తాయని గ్యారంటీగా చెప్పలేము. చెప్పవచ్చినదేమిటంటే సుపరిపాలనను సరైన, నిరూపిత ఫలితాల ప్రాతిపదికన అంచనా వేయాలి. 


ప్రాథమిక విద్య ఉదాహరణగా తీసుకుందాం. ఒక సరళీకృత నమూనా పాఠశాలను ఒక సంస్థగాను; ఉపాధ్యాయులు, విద్యార్థులను వ్యక్తులుగాను, బోధనను ప్రక్రియగాను పరిగణిస్తుంది. అవసరాల ప్రాతిపదిక విధానం కేవలం పాఠశాలల సంఖ్య, ఉపాధ్యాయుల- విద్యార్థుల మధ్య నిష్పత్తి గురించి మాట్లాడుతుంది. అయితే ఫలితాల ప్రాతిపదిక విధానం ఎంతమంది విద్యార్థులు పఠనం, లేఖనం, గణితంలో ప్రావీణ్యం ఏ మేరకు సాధించారనే అంశానికి ప్రాధాన్యమిస్తుంది. పాలన మౌలిక లక్ష్యమేమిటి? ఒక సమాజంలోని ప్రజలలో అత్యధికులకు గరిష్ఠస్థాయిలో సంక్షేమాన్ని సమకూర్చడమే. ఈ విషయాన్ని అందరూ అంగీకరిస్తున్నారు. అయినప్పటికీ వాస్తవంగా పాలనా రీతులు అంతకంతకూ పాలక వర్గాలకు మరింత సంక్షేమాన్ని సమకూర్చే విధంగా పరిణమిస్తున్నాయి. ఇదెంతైనా ఆందోళనకరమైన విషయం. ప్రస్తుత వ్యవస్థలో ప్రజలు విశ్వాసాన్ని కోల్పోయే ప్రమాదం ఎంతైనా ఉన్నది. అటువంటి పరిస్థితి నెలకొనకూడదు. అది సంభవించకుండా వుండాలంటే పాలక వర్గాల వారు, సామాన్య ప్రజలకు సంక్షేమాన్ని సమకూర్చే విధంగా పాలనా ప్రక్రియలు అమలయ్యేలా జాగ్రత్త వహించాలి. ప్రజలకు మేలు చేసే అభివృద్ధి పనులు చేపట్టి సత్వరమే పూర్తయ్యేందుకు పూచీ పడాలి.


డాక్టర్ శైలేంద్ర కుమార్ జోషీ 

విశ్రాంత ఐఏఎస్ అధికారి, 

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ మాజీ ముఖ్య కార్యదర్శి.

(ఇటీవలే ప్రచురితమైన ‘ఎకో టి కాలింగ్: టువర్డ్స్ పీపుల్ సెంట్రిక్ గవర్నెన్స్’లోని ఒక అధ్యాయానికి స్వేచ్ఛానువాదం)

Updated Date - 2020-08-02T06:28:10+05:30 IST