‘రాష్ట్రంలో పాలన భ్రష్టుపట్టింది’

ABN , First Publish Date - 2022-01-22T05:00:01+05:30 IST

రాష్ట్రంలో గత మూడు సంవత్సరాల నుంచి పరిపాలన భ్రష్టు పట్టిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు, రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్‌ అన్నారు.

‘రాష్ట్రంలో పాలన భ్రష్టుపట్టింది’
కర్నూలులో ఏర్పాట్లను పరిశీలిస్తున్న బీజేపీ నాయకులు

కర్నూలు(ఎడ్యుకేషన్‌), జనవరి 21: రాష్ట్రంలో గత మూడు సంవత్సరాల నుంచి పరిపాలన భ్రష్టు పట్టిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు, రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్‌ అన్నారు. బీజేపీ ఆధ్వర్యంలో కర్నూలు ఎస్టీబీసీ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన  ప్రజా నిరసన బహిరంగ సభ ఏర్పాట్లను శుక్రవారం వారు పరిశీలించారు. నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై నిరసన తెలియజేస్తూ శనివారం బీజేపీ ఆధ్వర్యంలో నిరసన సభను నిర్వహిస్తున్నామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు ప్రజా నిరసన సభ పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా నిరసన సభలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. బీజేపీ రాష్ట్ర కార్యదర్శులు విష్ణువర్థన్‌ రెడ్డి, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు హరీష్‌బాబు, డా.పార్థసారధి, జిల్లా అధ్యక్షడు రామస్వామి, రంగస్వామి, కాళింగి నరసింహవర్మ తదితరులు పాల్గొన్నారు. 


‘వైసీపీ దౌర్జన్యాలను సహించం’


వెల్దుర్తి: మండలంలోని ఎల్‌.నగరం గ్రామంలో వైసీపీ నాయకుల దౌర్జన్యాలు మితిమీరాయని, సహించబోమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. మండలంలోని ఎల్‌.నగరం గ్రామంలో  శుక్రవారం బీజేపీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం విలేకరులతో సమావేశం నిర్వహించారు. సోము వీర్రాజు మాట్లాడుతూ అధికారం ఎవరికీ శాశ్వతం కాదన్న విషయాన్ని వైసీపీ నాయకులు తెలుసుకోవాలన్నారు. స్థానిక వైసీపీ నాయకుడి దౌర్జన్యాలు పెరిగాయని, బీజేపీ కార్యకర్తలపై దాడులు చేయడం తగదని హెచ్చరించారు. మరోసారి దాడులు జరిగితే తామే గ్రామంలో తిష్ఠ వేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఇన్‌చార్జి రావెల కిశోర్‌బాబు, ఓబీసీ మోర్చా కార్యదర్శి డా.పార్థసారఽథి, బీజేపీ నాయకులు పోలంకి రామస్వామి, అంకమ్మ విజయ, చంద్రమౌలి, రంజిత్‌ కుమార్‌, కోటి యాదవ్‌, రాఘవేంద్ర పాల్గొన్నారు. 


Updated Date - 2022-01-22T05:00:01+05:30 IST