రాజకీయ జోక్యంతో గాడితప్పిన పాలన

ABN , First Publish Date - 2022-07-05T06:02:42+05:30 IST

సింగరేణి వ్యవహారాల్లో రాజకీయ జోక్యం పెరగడంతో పాలన గాడితప్పిందని సీఐటీయూ అనుబంధ సింగరేణి ఎంప్లాయీస్‌ యూనియన్‌ అధ్యక్షుడు రాజారెడ్డి పేర్కొన్నారు.

రాజకీయ జోక్యంతో గాడితప్పిన పాలన
మాట్లాడుతున్న తుమ్మల రాజారెడ్డి

- సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు  రాజారెడ్డి 

యైటింక్లయిన్‌కాలనీ, జూలై 4: సింగరేణి వ్యవహారాల్లో రాజకీయ జోక్యం పెరగడంతో పాలన గాడితప్పిందని సీఐటీయూ అనుబంధ సింగరేణి ఎంప్లాయీస్‌ యూనియన్‌ అధ్యక్షుడు రాజారెడ్డి పేర్కొన్నారు. సోమవారం ఓసీపీ-3 కృషి భవన్‌లో జరిగిన గేట్‌మీటింగ్‌లో ఆయన మాట్లాడారు. కోట్లాది రూపాయల సింగరేణి నిధులు దారి మళ్లించడంతో సంస్థ ఆర్థిక పరిస్థితి దిగజారిందన్నారు. సింగరేణి స్థలాల్లో ఇతరులకు పట్టాలు ఇవ్వడమే కాకుండా క్వార్టర్లను సైతం బయటవారికి అప్పగించాలని చూస్తున్నట్టు ఆరోపించారు. క్వార్టర్‌ ఉన్న కార్మికుడు నీరు, కరెంట్‌ చార్జీల పేరిట టాక్స్‌ కడుతున్నందున ఎవరి క్వార్టర్‌ వారికే ఇవ్వాలని రాజారెడ్డి డిమాండ్‌ చేశారు. క్వార్టర్‌ లేని కార్మికుడికి 250 గజాల ఇంటి స్థలాన్ని కేటాయించాలని అన్నారు. ఈరెండు డిమాండ్లతో వచ్చే నెలా సీఐటీయూ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టనున్నట్టు పేర్కొన్నారు. క్వార్టర్‌లు ఎక్కువగా ఉన్నాయని చెప్తున్న యాజమాన్యం మంచి క్వార్టర్‌లను కార్మికేతరులకు ఇస్తూ, పనిచేస్తు న్న కార్మికులకు ఇంటి కిరాయి ఇవ్వకుండా మోసం చేస్తున్నట్టు రాజారెడ్డి తెలిపారు. ఎక్కువ క్వార్టర్‌లు ఉంటే రిటైర్డ్‌ కార్మికులకు, కాంట్రాక్టు కార్మికులకు కేటాయించాలని రాజారెడ్డి డిమాండ్‌ చేశారు. వేతన ఒప్పంద విషయంలో యాజమాన్యం ఉద్దేశ పూర్వకంగా ఆలస్యం చేస్తూ కార్మిక సంఘాలను దోషులుగా చూపే ప్రయత్నం చేస్తున్నదని అన్నారు. కేంద్రం అమల్లోకి తెచ్చిన నూతన లేబర్‌ కోడ్‌లను కార్మికవర్గం వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. పోరాటాల ద్వారానే వేజ్‌బోర్డు సాధ్యమవుతుందని అన్నారు. ఆర్‌ఎల్‌సీ సమక్షంలో జరిగిన చర్చల్లో సింగరేణి యాజమాన్యం అంగీకరించిన డిమాండ్ల సర్క్యులర్‌లను జారీ చేయాలని రాజారెడ్డి డిమాండ్‌ చేశారు. సమావేశంలో ఎస్‌ వెంకన్న, రాజన్న, భూమయ్య, ఓదేలు, లక్ష్మీనారాయణ, మల్లేష్‌, సంతో ష్‌, కార్మికలు పాల్గొన్నారు. 


Updated Date - 2022-07-05T06:02:42+05:30 IST