Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement

ఉద్యమం ఉధృతం

twitter-iconwatsapp-iconfb-icon
ఉద్యమం ఉధృతంజిల్లా పరిషత్‌ సెంటర్లో జరిగిన ధర్నాలో భారీగా పాల్గొన్న ఉద్యోగులు, ఉపాధ్యాయులు

పీఆర్సీకి వ్యతిరేకంగా ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల ఆందోళన తీవ్రం

జిల్లా నలుమూలల నుంచి ఏడు వేల మందికిపైగా కలెక్టరేట్‌ ముట్టడి

 ‘మాయదారి పీఆర్సీ మాకొద్దు’ అంటూ దిక్కులు పిక్కటిల్లేలా నినాదాలు

జగన్‌ డౌన్‌డౌన్‌ అంటూ నిరసన.. సమ్మెతో సత్తా చూపిస్తామని హెచ్చరిక

151 సీట్లకు బీటలు పడ్డాయి.. కోట కూలే రోజు దగ్గర్లోనే ఉందంటూ ధ్వజం

ఆందోళనకు మద్దతు తెలిపిన సీపీఎం, సీఐటీయూ, ఇతర ప్రజా సంఘాలు

కలెక్టరేట్‌ ముట్టడిని అడ్డుకునేందుకు బారికేడ్‌లు, ఫైరింజన్లు మోహరింపు 

మండలాల నుంచి కాకినాడకు తరలిరాకుండా ఎక్కడికక్కడ అడ్డగింత

అయినా అడ్డంకులు దాటుకుని ధర్నాను విజయవంతం చేసిన ఉద్యోగులు


పీఆర్సీకి వ్యతిరేకంగా జిల్లాలో ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల ఆందోళన మరింత ఉధృతమైంది. ప్రభుత్వ తీరును నిరసిస్తూ వేలమంది ఉద్యోగులు పోరు తీవ్రత పెంచారు. డిమాండ్ల సాధన కోసం ఉమ్మడిగా పోరాట గళం వినిపిస్తున్నారు. పోలీసు ఆటంకాలను ఎదుర్కొని మరీ కదన  రంగంలోకి కదులుతున్నారు. అందుకు నిదర్శనమే కాకినాడలో మంగళవారం ఏడు వేల మందికిపైగా ఉద్యోగుల కలెక్టరేట్‌ ముట్టడి. ఒకపక్క పోలీసులు అడ్డగింతలు, బారికేడ్లు, ఫైరింజన్ల మోహరింపుతో ఉద్యమాన్ని అణిచివేయడానికి ప్రయత్నించినా ఏమాత్రం తగ్గలేదు. ఆంక్షలను సైతం కాదని జిల్లా నలుమూలల నుంచి భారీగా తరలివచ్చి ఆందోళనను విజయవంతం చేశారు. మాయదారి పీఆర్సీ మాకొద్దు... సీఎం జగన్‌ డౌన్‌డౌన్‌ అంటూ పెద్దఎత్తున నినాదాలు చేశారు. కోట కూలే రోజులు ఎంతోదూరంలో లేవు అంటూ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. దీంతో కలెక్టరేట్‌ పరిసర ప్రాంతాలు దద్దరిల్లాయి. కాగా ఈ ఆందోళనకు సీపీఎం, సీఐటీయూ, ఐఎఫ్‌టీయూ, ఏఐఎఫ్‌టీయూ, పలు ప్రజాసంఘాలు మద్దతు పలికాయి. 


(కాకినాడ-ఆంధ్రజ్యోతి) 

ప్రభుత్వం ప్రకటించిన తిరోగమన పీఆర్సీకి వ్యతిరేకంగా రాష్ట్ర సంఘాల పిలుపు మేరకు జిల్లావ్యాప్తంగా ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లు ఆందోళన తీవ్రత పెంచారు. గడచిన కొన్ని రోజులుగా దశల వారీగా ఆందోళన కొనసాగిస్తున్న ఉద్యోగులు మంగళవారం నుంచి ఉద్య మాన్ని మరింత ఉధృతం చేశారు. అందులో భాగంగా సుమారు ఏడు వేల మంది కాకినాడ కలెక్టరేట్‌ను ముట్టడించారు. పీఆర్సీకి వ్యతిరేకంగా అర్ధరాత్రి జారీచేసిన జీవోలకు వ్యతిరేకంగా అంతా నినదించారు. సీఎం డౌన్‌డౌన్‌ అంటూ కలెక్టరేట్‌ ధర్నా చౌక్‌ వద్ద నిరసనలతో హోరె త్తించారు. ఏడో తేదీ నుంచి జరగబోయే సమ్మెతో తమ సత్తా ఏంటో చూపిస్తామని హెచ్చ రించారు. అసంబద్ధ పీఆర్సీ, చీకటి జీవోలను రద్దు చేయాలని, అశుతోష్‌ మిశ్రా కమిటీల నివే దికలను బహిర్గతం చేయాలని ఈ సందర్భంగా ఉద్యోగ సంఘాలు డిమాండ్‌ చేశాయి.


ఏపీ జేఏసీ జిల్లా చైర్మన్‌ గుద్దటి మోహన్‌రావు, ఏపీ జేఏసీ అమరావతి జిల్లా చైర్మన్‌ త్రినాథరావు, ఏపీజీఈఏ చైర్మన్‌ జగన్నాథం, ఏపీజీఐఎఫ్‌ జిల్లా చైర్మన్‌ వెంకటరత్నం తదిదరులు ఆందో ళనకు నాయకత్వం వహించారు. కాగా ఉద్యోగుల ఆందోళనకు సీఐటీయూ, ఏఐటీయూసీ, ఎస్‌ఎఫ్‌ఐ తదితర సంఘాలు మద్దతు ప్రకటించాయి. తొలుత వేలాది మంది ఉద్యోగులు కలెక్టరేట్‌ ధర్నాచౌక్‌ నుంచి జిల్లా పరిషత్‌ సెంటర్‌ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అయితే ర్యాలీని అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించారు. ఎక్కడికక్కడ దారిపొడవునా బారికేడ్లు ఏర్పాటుచేశారు. అవసరాన్ని బట్టి ఉద్యోగులపై వాటర్‌క్యాన్లు ప్రయోగించడానికి ఫైరింజన్లు సైతం మోహరించారు. అయినా ఇవేవీ కాదని వేలాదిమంది ఉద్యోగులు తమ నిరసన కొనసాగించారు. ఈ సందర్భంగా ఉద్యోగులను ఉద్దేశించి పీడీఎఫ్‌ ఎమ్మెల్సీ ఐ.వెంకటేశ్వర రావు ప్రసంగించారు. ప్రభుత్వం చేతిలో ఉద్యోగులు మోసపోయిన చరిత్ర ఇప్పటివరకు చూడలేదన్నారు. 13 లక్షల మంది ఉద్యోగులు ఏకమై చేస్తున్న ఉద్యమం చరిత్రలో నిలిచిపోతుందన్నారు. కొంతమంది ఉద్దేశపూర్వకంగా ఉద్యోగులను సోషల్‌ మీడియాలో ట్రోల్‌ చేస్తున్నారని ధ్వజమెత్తారు. దీనికి కచ్చితంగా ప్రతిస్పందన ఉంటుందని హెచ్చరించారు.


సీఐటీయూ, ఏఐటీయూసీ నాయకులు మాట్లాడుతూ జీతాలు పెరిగితే ఉద్యోగులు రోడ్డు ఎందుకు ఎక్కుతారన్నారు. పోరాడి సాధించుకున్న రాయితీలను తుంగలో తొక్కడం సరి కాదన్నారు. తాము క్రమశిక్షణతోనే ఉద్యమం చేస్తామని, ప్రభుత్వాన్ని, సీఎంను ఎక్కడా విమర్శించబోమని స్పష్టం చేశారు. ప్రభుత్వం ఉద్యోగులకు మేలు చేస్తుందని మూడేళ్లు ఎదురుచూస్తే చివరకు మూడు చీకటి జీవోలతో భవిష్యత్తును అంధకారం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు సైతం న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. ఎన్జీవో అసోసియేషన్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పసుపులేటి శ్రీనివాస్‌, జిల్లా కార్యదర్శి మూర్తిబాబు, జేఏసీ అమరావతి జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గాప్రసాద్‌, ఫ్యాప్టో చైర్మన్‌ చెవ్వూరి రవి, ఏపీజీఈఏ జిల్లా కార్యదర్శి తోకల ప్రసాద్‌, ట్రెజరీ సర్వీసెస్‌ అసోసియేషన్‌ జిల్లా నాయకుడు పాము శ్రీనివాస్‌, యునైటెడ్‌ మెడికల్‌ ఎంప్లాయిస్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు పలివెల శ్రీనివాస్‌, ఎన్జీవో సంఘ మాజీ అధ్యక్షుడు ఆచంట రామానాయుడు, ఆర్టీసీ ఎంప్లాయిస్‌ అఽసోషియన్‌ జిల్లా అధ్యక్షుడు సత్యానందం తదితరులు మాట్లాడుతూ ఉద్యోగులను నమ్మించి ప్రభుత్వం మోసం చేయడం సరికాదన్నారు. ఉద్యోగుల జీతాలు పెంచాల్సిన సమయం వస్తే ఆదాయం తక్కువగా ఉందని సాకు చూపించడం ఏంటని ప్రశ్నించారు. తిరోగమన పీఆర్సీతో జీతాలు తగ్గే పరిస్థితి వస్తే.. పెరుగుతున్నాయని ప్రభుత్వం ప్రచారం చేయడం దారుణం అన్నారు. ఇదిలాఉంటే కలెక్టరేట్‌ ముట్టడికి జిల్లానలుమూలల నుంచి వస్తున్న ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలను పోలీసులు అనేకచోట్ల అడ్డుకున్నారు. కాకినాడకు వెళ్లడానికి వీల్లేదని హెచ్చరించారు. సామర్లకోట, పిఠాపురం, పెద్దాపురం, జగ్గంపేట, కాకినాడ రూరల్‌, యు.కొత్తపల్లి, తుని, మండపేట, కోనసీమ తదితర ప్రాంతాల నుంచి వస్తున్న ఉద్యోగులను వెళ్లనీయకుండా ఆపేశారు. అయినా వీటన్నింటిని దాటుకుని కలెక్టరేట్‌ ముట్టడికి ఉద్యోగులంతా వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. 

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.