Abn logo
May 11 2021 @ 00:40AM

అధికారులు అప్రమత్తంగా ఉండాలి.. రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌

 కరోనా ఉధృతి నేపథ్యంలో ప్రజలకు అందుబాటులో ఉండాలి

 నివారణపై మరింత అవగాహన కల్పించాలి

 ఖమ్మం, భద్రాద్రి జిల్లా వైద్యాధికారులతో సమీక్ష సమావేశాలు

ఖమ్మం(ఆంధ్రజ్యోతి ప్రతినిధి)/కొత్తగూడెం, మే 10: రోజురోజుకీ కొవిడ్‌ ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో ఈ మహమ్మారి నుంచి ప్రజలను కాపాడేందుకు అధికారులు, సిబ్బంది నిత్యం అప్రమత్తంగా ఉండాలని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో ప్రజలకు మరింత అవగాహన కల్పించి కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. సోమవారం ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో కొవిడ్‌ వ్యాప్తి నివారణ చర్యలు, వ్యాక్సినేషన్‌పై వేర్వేరుగా సమీక్షలు నిర్వహించారు. తొలుత ఖమ్మం జడ్పీ సమావేశ మందిరంలో కలెక్టర్‌ ఆర్వీకర్ణన్‌, పోలీస్‌ కమిషనర్‌ విష్ణు యస్‌ వారియర్‌, జడ్పీ చైర్మన్‌ లింగాల కమల్‌రాజ్‌, నగర మేయర్‌ పునుకొల్లు నీరజతో కలిసి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో సమావేశమయ్యారు. కొవిడ్‌పై క్షేత్రస్థాయిలో అవగాహన కార్యక్రమాలు, వాక్సినేషన్‌ ఏర్పాట్లు చేయాలన్నారు. జ్వర సర్వే ద్వారా గ్రామాల్లో ఇంటింటికీ కరోనాపై అవగాహన కల్పించాలన్నారు. ఆక్సిజన్‌ లభ్యత మందుల నిల్వలు, టెస్ట్‌ కిట్ల కొరత రాకుండా చూడాలని వైద్యాధికారులను ఆదేశించారు. నగరంలో పాత బస్టాండులోని కొవిడ్‌ పరీక్షల కేంద్ర నిర్వహణ తీరుపై కలెక్టర్‌ ఆర్వీకర్ణన్‌ను అభినందించారు. రెమిడెసివర్‌ ఇంజక్షన్లు బ్లాక్‌ మార్కెట్‌కు వెళ్లకుండా పోలీస్‌ వ్యవస్థ పకడ్బందీగా పనిచేస్తోందన్న మంత్రి సీపీ విష్ణు వారియర్‌ను అభినందించారు. సమావేశంలో సుడా చైర్మన్‌ బచ్చు విజయ్‌కుమార్‌, నగరపాలక సంస్థ కమిషనర్‌ అనురాగ్‌ జయంతి, అదనపు కలెక్టర్‌ ఎన్‌.మధుసూదన్‌, డీఎంహెచ్‌వో డాక్టర్‌ మాలతి, జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి సూపరిన్‌టెండెంట్‌ డాక్టర్‌ వి.వెంకటేశ్వర్లు, డిప్యూటీ మేయర్‌ ఎస్కే ఫాతిమా జోహరా, వివిధ శాఖల జిల్లాస్థాయి అధికారులు పాల్గొన్నారు. 

ఆక్సిజన్‌ అందుబాటులో ఉంచండి : మంత్రి

అత్యవసర పరిస్థితుల్లో ఉన్నవారికి ప్రాణ వాయువు అందించేందుకు ప్రతీ పీహెచ్‌సీ, కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రంలో ఆక్సిజన్‌ సిలిండర్లు అందుబాటులో ఉంచాలని మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ వైద్యాధికారులను ఆదేశించారు. భద్రాద్రి కొత్తగూడెం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో కొవిడ్‌ నివారణ చర్యలు, ఇంటింటి సర్వేపై వైద్య అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. గ్రామస్థాయిలో కరోనాను నియంత్రించేందుకు ప్రభుత్వం ఇంటింటి సర్వే నిర్వహిస్తోందని తెలిపారు. కొవిడ్‌ బాధితులు ఖమ్మం, హైదరాబాద్‌, వరంగల్‌ వంటి ప్రాంతాలకు వెళ్లకుండా జిల్లాల్లోనే మెరుగైన వైద్య సేవలందిస్తు న్నారని కలెక్టర్‌ ఎంవీ రెడ్డిని, వైద్య సిబ్బందిని అభినందించారు. ప్రైవేట్‌ వైద్యులు కూడా ప్రజల కష్టాలను గమనించి ఇబ్బడి ముబ్బడిగా ఫీజులు వసూలు చేయకుండా చికిత్సకయ్యే ఖర్చు ఛార్టులు ఏర్పాటు చేయడం చాలా సంతోషమన్నారు. జిల్లా కేంద్రానికి దూరంగా ఉన్న మండలాల నుంచి అత్యవసర వైద్యసేవలకు ప్రజలు రావడానికి ఇబ్బంది పడే అవకాశమున్నందున అశ్వారావుపేట, ఇల్లెందు, మణుగూరు, భద్రాచలం, కొత్తగూడెం ఆసుపత్రుల్లో కొవిడ్‌ చికిత్స కేంద్రాలు ఏర్పాటుచేసి, ఆక్సిజన్‌ సిద్ధంగా ఉంచామన్నారు. ప్రాణవాయువు కొరత రాకుండా భద్రాచలం, కొత్తగూడెం ఆసుపత్రుల్లో లిక్విడ్‌ఆక్సిజన్‌ ట్యాంకులు ఏర్పాటుచేశామన్నారు. జిల్లాలోని ఐటీసీ పేపరు పరిశ్రమ నుంచి రాష్ట్రానికి ప్రాణ వాయువు సరఫరా చేస్తుండటం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతూ మరణించిన వ్యక్తుల కేషీట్‌ ఆధారంగా విచారణ నిర్వహించి సమగ్ర నివేదికలు అందజేయాలని వైద్య అధికారులను ఆదేశిం చారు. ఆక్సిజన్‌ కొరత ఏర్పడకుండా వినియోగంలో జాగ్రత్త లు వహిస్తూ ఆక్సిజన్‌ అవసరమైతే సంబంధిత వైద్యాధికారి ధ్రువీకరణతో ఉప వైద్యాధికారి చొరవతో మాత్రమే సరఫరా చేయడం వల్ల ఆక్సిజన్‌ కొరతను అధిగమించామని తెలిపారు. రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్ల వినియోగంపై పర్యవేక్షణ పట్ల మంత్రి హర్షం వ్యక్తం చేశారు. జిల్లాలో 80శాతం మేర ఇంటింటి సర్వే నిర్వహణ ప్రక్రియను పూర్తిచేశామని, సర్వే ప్రక్రియ నిరంతరం జరుగుతూనే ఉంటుందని తెలిపారు. కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకేటశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో విప్‌ రేగా కాంతారావు, కలెక్టర్‌ ఎంవీ రెడ్డి, జడ్పీ చైర్మన్‌ కోరం కనకయ్య, తదితరులు పాల్గొన్నారు. 


Advertisement