గోవాడ ఎండీ ఘెరావ్‌

ABN , First Publish Date - 2021-07-25T05:38:06+05:30 IST

బకాయిలు చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ శనివారం గోవాడ చక్కెర కర్మాగారం ఎండీ వి.సన్యాసినాయుడును చెరకు రైతులు ఘెరావ్‌ చేశారు. వ్యవసాయ పెట్టుబడులకు చేతిలో డబ్బులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోకపోవడమేమి టంటూ నిలదీశారు.

గోవాడ ఎండీ ఘెరావ్‌
బకాయిల కోసం ఎండీని నిలదీస్తున్న రైతులు

బకాయిల కోసం రోడ్డెక్కిన రైతులు

ఆగస్టు 10లోగా చెల్లించకపోతే 15 నుంచి ప్రత్యక్ష ఆందోళన

రైతుసంఘాల నిర్ణయం


చోడవరం, జూలై 24: బకాయిలు చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ శనివారం గోవాడ చక్కెర కర్మాగారం ఎండీ వి.సన్యాసినాయుడును చెరకు రైతులు ఘెరావ్‌ చేశారు. వ్యవసాయ పెట్టుబడులకు చేతిలో డబ్బులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోకపోవడమేమి టంటూ నిలదీశారు. క్రషింగ్‌ ముగిసినప్పటి నుంచి బకాయిలపై అదిగో, ఇదిగో...అంటూ కాలక్షేపం చేస్తూ వచ్చారని, మొత్తం రూ.49 కోట్లు ఎప్పటిలోగా చెల్లిస్తారో స్పష్టం చేయాలంటూ  పట్టుబట్టారు. దీనికి గోవాడ షుగర్స్‌ ఎండీ సన్యాసినాయుడు బదులిస్తూ రైతుల బకాయిల గురించి రాష్ట్ర ఉన్నతాధికారులకు నివేదించామన్నారు. ఫ్యాక్టరీ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉందని, ప్రభుత్వం నుంచి సహకారం అందితే తప్ప బకాయిలు చెల్లించలేమని చెప్పారు. ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం అందిన వెంటనే రైతుల బకాయిలు చెల్లిస్తామని వివరించారు. అయితే ఎండీ వివరణతో సంతృప్తి చెందని రైతులు, బకాయిలు ఎప్పుడు చెల్లిస్తారో కచ్చితమైన తేదీ ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. ఈ విషయంలో తానేమీ గడువు తేదీలు ప్రకటించలేనని ఎండీ చెప్పడంతో రైతులు ఆగ్రహం వ్యక్తంచేశారు. 


10లోగా బకాయిలు చెల్లించకపోతే ప్రత్యక్ష ఆందోళన

బకాయిల చెల్లింపు విషయంలో యాజమాన్యంతో పాటు, అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు కూడా నిర్లక్ష్యంగా ఉన్నారని రైతు  సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రితో మాట్లాడి నిధులు తెచ్చి రైతుల బకాయిలు చెల్లిస్తామని ప్రకటించిన స్థానిక ఎమ్మెల్యే ధర్మశ్రీ, ప్రస్తుతం ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. గోవాడ యాజమాన్యం ఆగస్టు పదో తేదీలోగా రైతులకు బకాయిలు చెల్లించాలని, లేనిపక్షంలో ఆగస్టు 15 నుంచి దశలవారీగా ప్రత్యక్ష ఆందోళనకు దిగుతామని రైతు కూలీ సంఘం కార్యదర్శి కోన మోహనరావు ప్రకటించారు. ఈ ఆందోళన కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం నాయకులు గండి నాయనిబాబు, నవయువ సమాఖ్య నాయకులు నందారపు మోహనరావు, రైతు సంఘాల నాయకులు ఎస్‌.వి.నాయుడు, పైలా రమేష్‌, భీశెట్టి సింహాచలం, కొమార వెంకటరమణ, ఏడువాక శంకరరావు తదితరులు పాల్గొన్నారు.





సర్కారు తీరుపై చెరకు రైతు గరం గరం

జిల్లాలో మూడు ఫ్యాక్టరీల్లో రూ.68 కోట్లు బకాయిలు

సంక్షేమానికి రూ.కోట్లు వెచ్చిస్తున్నారు...

రైతుల పేమెంట్లకు డబ్బులు లేవా?...అని ప్రశ్నలు


బకాయిలపై ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తోం దని చెరకు రైతులు ఆగ్రహంతో ఉన్నారు. గోవాడ షుగర్స్‌ పరిధిలోని రైతుల మాదిరిగానే ఏటికొప్పాక, తాండవ ఫ్యాక్టరీల పరిధిలోని రైతాంగం కూడా ఆందోళనకు సన్నద్ధమవుతున్నట్టు తెలిసింది. జిల్లాలోని మూడు సహకార షుగర్‌ ఫ్యాక్టరీల పరిధిలో గత సీజన్‌కు సంబంధించి రైతులకు సుమారు 68 కోట్ల రూపాయలు చెల్లించవలసి ఉంది. నిన్నటి వరకూ ముఖ్యమంత్రిని కలిసి నిధులు తెస్తామంటూ ప్రకటనలు చేసిన అధికార పార్టీ ప్రజాప్రతినిధులు...ప్రస్తుతం బకాయిల చెల్లింపుపై ఏమీ మాట్లాడడం లేదు. మరోవంక షుగర్‌ ఫ్యాక్టరీల స్థితిగతులపై నియమించబడిన మంత్రివర్గ ఉపసంఘం రైతుల బకాయిలు, కార్మికుల వేతనాలపై చర్చ జరిపి ముఖ్యమంత్రికి నివేదిక అందజేసి, రోజులు గడుస్తున్నా ఎలాంటి స్పందన లేకపోవడం పట్ల రైతుల్లో అసంతృప్తి వ్యక్తమవుతున్నది. సంక్షేమ పథకాలకు కోట్ల రూపాయలు వెచ్చిస్తున్న ప్రభుత్వం, ఫ్యాక్టరీలకు చెరకు సరఫరా చేసిన రైతులకు రూ.68 కోట్లు చెల్లించడానికి వెనుకాడడమే మిటని ప్రశ్నిస్తున్నారు.

Updated Date - 2021-07-25T05:38:06+05:30 IST