లంకను వీడేందుకు గొటబాయ విఫలయత్నం

ABN , First Publish Date - 2022-07-13T07:29:38+05:30 IST

ఆర్థిక, రాజకీయ సంక్షోభంతో అల్లాడిపోతున్న శ్రీలంకలో మంగళవారం తీవ్ర నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి.

లంకను వీడేందుకు గొటబాయ విఫలయత్నం

వాయు, జల మార్గాల ద్వారా దుబాయ్‌కు పారిపోయే ప్లాన్‌ అరెస్టు, నిర్బంధాల నుంచి తప్పించుకునేందుకు వ్యూహం

తమ్ముడు బాసిల్‌ రాజపక్స కూడా

అడుగడుగునా అడ్డుకున్న అధికారులు

సైన్యంలో సన్నిహితుల సహకారం

తన పదవికి గొటబాయ రాజీనామా

వెల్లడించిన స్పీకర్‌ కార్యాలయం

నేడు ప్రకటన.. 20న కొత్త నేత 


కొలంబో, జూలై 12: ఆర్థిక, రాజకీయ సంక్షోభంతో అల్లాడిపోతున్న శ్రీలంకలో మంగళవారం తీవ్ర నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. అధ్యక్షుడు గొటబాయ రాజపక్స సతీ సమేతంగా దేశం విడిచి పారిపోయేందుకు ప్రయత్నించారనే వార్తలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో ఆయన వాయు, జల మార్గాల ద్వారా దేశం నుంచి పారిపోయేందుకు సిద్ధమైనట్టు అధికారులు సైతం చెప్పారు. తొలుత వాయుమార్గం ద్వారా దుబాయ్‌కు వెళ్లాలని ఆయన ప్రయత్నించారు. అయితే, విమానాశ్రయంలో ఇమ్మిగ్రేషన్‌ అధికారులు ఆయనను అడ్డుకున్నారు. దీంతో సముద్ర మార్గంలో నౌకాదళ పెట్రోలింగ్‌ వాహనంలో దుబాయ్‌కు పారిపోయే ప్రయత్నం చేసినట్టు అధికారులు తెలిపారు.


అయితే ఇక్కడ కూడా ఆయనను అనుమతించలేదని అధికారులు భీష్మించారు. 73 ఏళ్ల గొటబాయ.. తన అధికారిక నివాసంపై నిరసన కారులు దాడులు చేసిన సమయంలో ఆ నివాసాన్ని విడిచిపెట్టిన విషయం తెలిసిందే. అనంతరం ఆయన దుబాయ్‌కు వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నట్టు అధికారులు తెలిపారు. అధ్యక్షుడి హోదాలోనే దేశాన్ని విడిచి పెట్టడం ద్వారా తనను అరెస్టు చేయకుండా, నిర్బంధించకుండా ఉండేలా జాగ్రత్త పడినట్టు భావిస్తున్నారు. అయితే, అధికారులు తిరస్కరించడంతో బండారు నాయకే అంతర్జాతీయ విమానాశ్రయం పక్కనే ఉన్న మిలటరీ బేస్‌లో అధ్యక్ష దంపతులు ఓ రాత్రంతా గడిపారు. అప్పటికే దుబాయ్‌కు వెళ్లే నాలుగు విమానాలు వెళ్లిపోయాయి. అయితే, మిలిటరీలోని గొటబాయ సన్నిహితులు కొందరు ఆయనను నౌకా మార్గంలో తప్పించేందుకు చర్చలు జరిపినట్టు తెలిసింది. మరోవైపు, అధ్యక్షుడు గొటబాయ ప్రస్తుతం లంక వాయుసేన అధిపతి చీఫ్‌ ఎయిర్‌ మార్షల్‌ సుదర్శన్‌ పతిరాణా ప్రైవేటు నివాసంలో ఆశ్రయం పొందుతున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే, ఈ వార్తలను సుదర్శన్‌ ఖండించారు. ఓ మాజీ పోలీసు అధికారి చేసిన ప్రచారం సరికాదని తెలిపారు.  కాగా, గొటబాయ తమ్ముడు, ఆర్థిక శాఖ మాజీ మంత్రి బాసిల్‌ రాజపక్సే కూడా మంగళవారం దేశం విడిచిపారిపోయే ప్రయత్నం చేశారు. అయితే..


ఈయనను గమనించిన ప్రజలు అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో అధికారులు అప్రమత్తమై.. ఆయనను కూడా నిలువరించారు. బాసిల్‌కు లంక సహా అమెరికా పౌరసత్వం కూడా ఉండడంతో వీఐపీ టెర్మినల్‌ నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశారు. అయితే.. ఇమ్మిగ్రేషన్‌ అధికారులు ఆయనను అడ్డుకున్నారు. బాసిల్‌ను గమనించిన ఇతర ప్రయాణికులు.. ఆయనకు వ్యతిరేకంగా నిరసన తెలిపారని విమానాశ్రయ అధికారులు తెలిపారు. మంగళవారం ఉదయం కొలం బో అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి పారిపోయే ప్రయ త్నం చేశారని, అయితే, అధికారులు అడ్డుకోవడంతో ఆయన వెనుదిరిగి వెళ్లిపోయారని తెలిపారు. ఉన్నతస్థాయి వ్యక్తులు దేశం విడిచి వెళ్లకుండా చూడాలని తమపై ఒత్తిడి ఉందని ఇమ్రిగ్రేషన్‌ అధికారుల సంఘం చైర్మన్‌ కేఏఎస్‌ కనుగల తెలిపారు. ఈ క్రమంలో తమ భద్రతకు కూడా ముప్పు పొంచి ఉందని, ఈ సమస్య పరిష్కారం కాకపోతే.. విధులను బహిష్కరిస్తామని హెచ్చరించారు. మరోవైపు.. బాసిల్‌ తమను ఆశ్రయం కోరారన్న వాదనను భారత ప్రభుత్వం తోసిపుచ్చింది. 


కోర్టులో సూట్‌కేసులు

రూ.14 కోట్ల నగదు, కీలక డాక్యుమెంట్లతో కూడిన సూట్‌ కేసులను భద్రపరిచినట్టు అధికారులు తెలిపారు. ఇవన్నీ కోర్టు అధీనంలో ఉన్నాయన్నారు. 


గొటబాయ ముందస్తు రాజీనామా

శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్స తన పదవికి రాజీనామా చేశారు. 13వ తేదీతో ఉన్న లెటర్‌హెడ్‌తో తన రాజీనామా పత్రాన్ని పార్లమెంటు స్పీకర్‌కు పంపించారు. ఈ విషయాన్ని స్పీకర్‌ కార్యాలయం వెల్లడించింది. అయితే.. దీనిపై బుధవారం(నేడు) స్పీకర్‌ మహింద యప అబేయవర్దనే అధికారిక ప్రకటన చేయనున్నారు. దీంతో రాజపక్సేల పాలన ముగిసినట్టేనని రాజకీయ వర్గాలు పేర్కొన్నాయి. కాగా, ప్రస్తుత ప్రధాని రణిల్‌ విక్రమసింఘే బుధవారం ఆపద్ధర్మ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.  రాజ్యాంగ నిబంధనల మేరకు ఈ నెల 20న పార్లమెంటులో నూతన అధ్యక్షుడి ఎన్నిక ఉంటుందని స్పీకర్‌ ప్రకటించారు. దీనికి సంబంధించిన నామినేషన్ల ప్రక్రియ 19న చేపట్టనున్నట్టు తెలిపారు. 

Updated Date - 2022-07-13T07:29:38+05:30 IST