Abn logo
Aug 28 2020 @ 00:41AM

అస్త్రాలున్నాయ్‌.. తప్పనిసరైతే వాడతాం

  • కొవిడ్‌-19 పోరాటంపై ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంతదాస్‌

ముంబై: ప్రపంచాన్ని, దేశాన్ని కుదిపివేస్తున్న కరోనా సంక్షోభంపై పోరాటానికి ఆర్‌బీఐ అమ్ముల పొదిలో ఇంకా అస్ర్తాలున్నాయని, అవసరాన్ని బట్టి వాటిని ప్రయోగిస్తామని ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ అన్నారు. గురువారం ఆయన బిజినెస్‌ స్టాండర్డ్‌ పత్రిక నిర్వహించిన వెబినార్‌లో మాట్లాడుతూ.. రెపో రేటు యథాతథంగా ఉంచినంత మాత్రాన అస్ర్తాలన్నీ అంతరించిపోయాయనుకోవడం పొరపాటని స్పష్టం చేశారు.


కొవిడ్‌-19 సంక్షోభం ఏర్పడిన తర్వాత వరుసగా రెండు విడతలుగా ఆర్‌బీఐ రెపో రేటును 1.15 శాతం మేరకు తగ్గించడంతో పాటు అవసరాన్ని బట్టి నిర్దేశిత సమయం కన్నా ముందే నిర్ణయాలు కూడా తీసుకున్న విషయం ఆయన గుర్తు చేశారు. అయితే ప్రస్తుతం ద్రవ్యోల్బణం అదుపు తప్పిన నేపథ్యంలో భవిష్యత్తులో చోటు చేసుకునే పరిణామాలను దీటుగా ఎదుర్కొనడం కోసం రేట్ల తగ్గింపునకు విరామం ఇచ్చినట్టు ఆయన చెప్పారు. ప్రభుత్వ సెక్యూరిటీలపై రాబడులు ఇటీవల కాలంలో తగ్గడంపై వెలువడిన ఆందోళనకు సమాధానం చెబు తూ ఆర్‌బీఐ చర్యలు ఫలితాలనివ్వకపోవడమే అందుకు కారణమని భావించరాదన్నారు. మార్కెట్లు ఎలాంటి ఆటుపోట్లు లేకుండా సాఫీగా నడిచేలా చూడడమే ఆర్‌బీఐ బాధ్యత అని దాస్‌ స్పష్టం చేశారు. గత కొద్ది నెలలుగా 5.70 శాతం నుంచి 5.79 శాతం మధ్యన ఉన్న బాండ్‌ రాబడులు ఇటీవల 6.10 శాతానికి పెరిగాయని ఆయన చెప్పారు. ప్రస్తుత అనిశ్చితి కారణంగానే ఆర్‌బీఐ వృద్ధి, ద్రవ్యోల్బణం రెండింటి అంచనాలనూ ప్రకటించలేదని శక్తికాంత దాస్‌ తెలిపారు. 


మితిమీరిన రిస్క్‌ విముఖత మంచిది కాదు: దశాబ్ది క్రితం ఏర్పడిన అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభం నాటి కన్నా ప్రస్తుత కొవిడ్‌ సంక్షోభంలో భారత ఆర్థిక వ్యవస్థ, ఆర్థిక రంగం బలంగానే ఉన్నాయని దాస్‌ అన్నారు. జీడీపీలో రుణ నిష్పత్తి మెరుగు పడడం, విత్తలోటు, ద్రవ్యోల్బణం స్థూలంగా అదుపులోనే ఉండడం, కరెంట్‌ అకౌంట్‌ లోటు కూడా మెరుగ్గా ఉండడం ఇందుకు నిదర్శనమని చెప్పారు. రాబోయే కాలంలో కూడా ఆర్థిక రంగం స్థిరంగానే ఉంటుందని, కాని బ్యాంకింగ్‌ రంగంలో మరిన్ని సంస్కరణలు తప్పనిసరి అని ఆయన అన్నారు. బ్యాంకుల్లో అంతర్గత నిర్వహణ సంస్కృతి, రిస్క్‌ మేనేజ్‌మెంట్‌ విధానాలు మెరుగుపడాలని ఆయన నొక్కి చెప్పారు. వ్యవస్థలో రుణ వృద్ధి మందగించడంపై స్పందిస్తూ బ్యాంకులు ఒక పరిధిని దాటిపోయి రిస్క్‌ విముఖత ప్రదర్శించడం తమను తాము ఓడించుకోవడమే అవుతుందని దాస్‌ హెచ్చరించారు. ఎలాంటి రిస్క్‌ తీసుకోకపోతే అవి తమ మనుగడకు అవసరమైన నిధులు కూడా సమకూర్చుకోలేవని స్పష్టం చేశారు. మితిమీరిన రిస్క్‌ విముఖత కన్నా రిస్క్‌ నిర్వహణ విధానాలు మెరుగుపరుచుకోవడం, ఎలాంటి ప్రతికూలతలైనా తట్టుకోగల స్థితి కల్పించుకోవడం అవసరమని ఆయన సూచించారు. 


అసలు డిమాండే లేదు: బ్యాంకుల రిస్క్‌ విముఖతపై దాస్‌ చేసిన వ్యాఖ్యలకు ప్రభుత్వ, ప్రైవేట్‌ బ్యాంకు ల అధిపతులు స్పందిస్తూ రుణాలు ఇచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నా తీసుకునే వారే లేరని స్పష్టం చేశారు. రుణాలను ఉద్దీపింపచేయడానికి ప్రభుత్వమే ఏదైనా చేయాల్సి ఉంటుందని వారన్నారు. కొద్ది సంవత్సరాల క్రితం 15-16 శాతం ఉన్న రుణ డిమాండు ఇప్పుడు 6 శాతం కన్నా దిగువకు వచ్చింది. ప్రధానంగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ఎండీ ఆదిత్యపురి, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ ఎండీ ఎస్‌ఎస్‌ మల్లికార్జునరావు, యూనియన్‌ బ్యాంక్‌ సీఈఓ రాజ్‌ కిరణ్‌ రాయ్‌, ఇతరులు ఈ సమాధానం ఇచ్చిన వారిలో ఉన్నారు. 


Advertisement
Advertisement
Advertisement